సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు సాధించిన విజయాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా రెండున్నరేళ్లకే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగి, ప్రజాభిప్రాయంలో మార్పు కనిపిస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా రెండున్నరేళ్లు గడువు ఉండగానే ప్రజలు తమ తీర్పుతో మార్పును సూచిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ ‘ఎక్స్’లో చేసిన పోస్టు సైతం చర్చకు దారితీసింది.
‘‘రెండున్నర సంవత్సరాలు ప్రభుత్వానికి ఉండగానే, పథకాలు పోతాయని కూడా భయపడకుండా ఓటర్ తీర్పు నేను ఊహించలేదు’’ అంటూ ఆయన పేర్కొన్నారు. మరో పోస్టులో ‘‘స్థానిక ఎన్నికలు ఓటర్ మార్పు కోరుకుంటున్నాడని.. మార్పు మొదలైందని నిరూపిస్తున్నాయి.. నిజం ఇదే’’ అని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు స్థానిక ఎన్నికల ఫలితాలపై జరుగుతున్న చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి.
https://t.co/EbQgM7cB7c
— PV Sunil Kumar (@PV_Sunil_Kumar) November 27, 2026
అధికారంలో లేకపోయినా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గ్రామస్థాయిలో పోటీకి నిలిచి విజయాలు సాధించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వచ్చినా ప్రజల మనోభావాలను తక్కువగా అంచనా వేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు, అధికార పక్షం బలహీనపడుతోంది? ప్రతిపక్షం పుంజుకుంటోంది? అనే చర్చ ప్రజల్లో మొదలైంది.


