కలెక్టరేట్‌లో అధికారులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన టి.కమ్మపల్లి పంచాయతీ అభ్యర్థులు, ఓటర్లు
మా ఓట్లను టీడీపీ నేతలే వేసుకున్నారు
పోలింగ్ ఏజెంట్లను రానివ్వకుండా దౌర్జన్యకాండ సాగించారు
పోలీసులు, ఎన్నికల అధికారులు పూర్తిగా సహకరించారు
ఎన్నిక రద్దుచేసి రీపోలింగ్ నిర్వహించండి
పోలింగ్ బూత్ రికార్డులు, సీసీ కెమెరాలు భద్రపరచండి
పుల్లంపేట టి.కమ్మపల్లి జనసేన సానుభూతిపరుల ఆవేదన
తిరుపతి కలెక్టర్, డీపీఓ, ఆర్డీఓలకు వినతిపత్రం అందజేత
సాక్షి, తిరుపతి: ‘మేం కూటమి ప్రభుత్వం రావడానికి శాయశక్తులా కృషి చేశాం. అధికారం వచ్చాక మంచి జరగపోయినా పర్లేదు. కనీసం రాజ్యాంగం కలి్పంచిన ఓటు హక్కును కూడా ఉపయోగించుకోలేని దౌర్భగ్యస్థితికి వచ్చాం’ అని తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం టి.కమ్మపల్లి పంచాయతీ జనసేన మద్దతుదారులైన ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి సర్పంచ్ అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, ఓటర్లు మొత్తం సుమారు 50 మంది దాకా శుక్రవారం తిరుపతి కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘టి.కమ్మపల్లి పంచాయతీ ఎన్నికల్లో మా ముగ్గురితోపాటు మా డమ్మీ అభ్యర్థులు ముగ్గురు సర్పంచ్ పదవికి నామినేషన్ వేశాం. మా తరపు పోలింగ్ ఏజెంట్లు ఎవర్ని పోలింగ్ బూత్‌లలోకి రానివ్వకుండా టీడీపీ నేతలు బెదిరించి అడ్డుకున్నారు. అదేంటని ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తే దాటవేస్తూ సమయం వృథా చేశారు.
పోలీసులను అడిగితే మాపైనే దురుసుగా ప్రవర్తించారు. దీంతో 1, 2, 3, 7, 8, 9, 10 బూత్‌లలో ఉన్న సుమారు 700 మంది ఓటర్లు ఎన్నికలను బహిష్కరిస్తూ రోడ్డుపై బైఠాయించారు. గెలిచారని అక్రమంగా ప్రకటించిన అభ్యర్థి పార్వతి తరఫు ఏజెంట్లు తప్ప మిగిలిన ఏడు మంది సర్పంచ్ అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎలా పోలింగ్, కౌంటింగ్ నిర్వహిస్తారు’ అని ప్రశ్నించారు. జనసేన సానుభూతిపరులెవరూ ఓటు వేయకపోయినా టీడీపీ నేతలే అక్రమంగా ఆయా బూత్‌లలో ఓట్లు వేసుకున్నారని సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టాలని సవాల్ విసిరారు.
టి.కమ్మపల్లి సర్పంచ్ ఎన్నికను వెంటనే రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన మొత్తం సీసీటీవీ ఫుటేజీ, పీఓ డైరీలను భద్రపరచాలని కోరారు. విధి నిర్వహణలో పక్షపాతంగా వ్యవహించిన ఆర్వో, పోలీసులపై పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీపీఓ, ఆర్డీఓ తదితరులకు సర్పంచ్ అభ్యర్థులు వినతి పత్రాలు అందజేశారు.
ఇదీ చదవండి: ‘విజనరీ’ బాబు సరికొత్త రేటు.. అడుగు రూ.29,340


