సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో ధరణికృష్ణ పిటిషన్
కోట్ల రూపాయల ‘జనసేన’ కుంభకోణంలో కీలక మలుపు
నన్ను హత్యచేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పథకం పన్నారు
పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడంలేదు
పైపెచ్చు సీఐడీ నాపైనే కేసు నమోదు చేసింది
నాకు, నా కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉంది
రాష్ట్ర అధికార యంత్రాంగంపై నాకు నమ్మకం లేదు
హైకోర్టును వేడుకున్న బాధితురాలు
వ్యక్తిగత ప్రతివాదులుగా కోట రుక్మిణి, కేకే, పలువురు పోలీసులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయల మేర డబ్బు వసూలు చేసిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సహాయకురాలు (పీఏ), కైరన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో కోట రుక్మిణి, ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు(కేకే)లతోపాటు మంగళగిరి గ్రామీణ పోలీసులు కలిసి తనను కస్టడీలో హింసించి హత్య చేసేందుకు ప్రయత్నించారని, దీనిపై ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయడం లేదంటూ ధరణికృష్ణ అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు.
బాధితురాలినైన తనపైనే సీఐడీ కేసు పెట్టిందని, ఈ నేపథ్యంలో తనకు న్యాయం జరగాలంటే సీబీఐ దర్యాప్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొంది. అందువల్ల ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విన్నవించారు. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్‌లో సీబీఐ డైరెక్టర్‌తో పాటు మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రవితేజ, హెడ్ కానిస్టేబుల్ శ్యామ్, కానిస్టేబుళ్లు రియా, సురేష్, కళ్యాణం శివ శ్రీనివాసరావు, కోట రుక్మిణిలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా, హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు.
రోజూ బెదిరింపులే..!
‘నాకు, నా కుటుంబసభ్యుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. మంగళగిరి పోలీసులు, జనసేన పార్టీ నాయకుల నుంచి రోజూ నాకు బెదిరింపులు వస్తున్నాయి. రాష్ట్రంలోని ఏ అధికార యంత్రాంగంపై నాకు నమ్మకం లేదు. నన్ను హింసించి, చంపడానికి ఆదేశించిన వ్యక్తులు కోట రుక్మిణి, కళ్యాణం శివ శ్రీనివాసరావులు. వీరు రాష్ట్రంలోని అధికార కూటమిలో భాగమైన జనసేన పార్టీ నాయకులు.
నా విడుదల తర్వాత, ప్రభుత్వ ఆసుపత్రి మెడికో–లీగల్ రికార్డు, ఆసుపత్రి స్వయంగా పోలీసులకు పంపిన సమాచారం ఉన్నప్పటికీ, పోలీసులు మాత్రం నా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవడం లేదు. పెనమలూరు పోలీసులు నా ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించారు. ఎస్‌పీ, డీజీపీ మౌనంగా ఉన్నారు. రాష్ట్రంలోని ఏ ఏజెన్సీ కూడా నా కస్టోడియల్ టార్చర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం లేదు. ఇందుకు విరుద్ధంగా నాపైనే సీఐడీ కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో నాకు న్యాయం జరగాలంటే సీబీఐ దర్యాప్తు ద్వారా మాత్రమే సాధ్యం’ అని ధరణికృష్ణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
నేపథ్యం ఇదీ..
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.7 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలతో జనసేన నేతలు కోట రుక్మిణి, కేకే ఇచ్చిన ఫిర్యాదులపై ధరణికృష్ణ పై కేసు నమోదైంది. ఈ నెల 13న పోలీసులు తనను అదుపులోకి తీసుకుని మూడు రోజులపాటు హింసించారని ధరణికృష్ణ ఆరోపించారు. తన తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే పోలీసుల నిర్బంధం నుంచి బయటపడ్డానని వెల్లడించారు. తనపై కేసు పెట్టినవారే అసలు దోషులని పేర్కొన్నారు. బాధితుల వివరాలు, మొత్తం ఆర్థిక లావాదేవీలు, విదేశీ నగదు బదిలీలపై సమగ్ర దర్యాప్తు చేయకుండా విచారణను ధరణి కృష్ణకే పరిమితం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ధరణికృష్ణ అడ్వకేట్‌ను కిడ్నాప్ చేసిన సీఐడీ పోలీసులు!
ధరణికృష్ణ తరఫున ఈ వ్యాజ్యం దాఖలు చేసిన న్యాయవాది నాగూర్ బాబును గుంటూరు సీఐడీ పోలీసులు శుక్రవారం ఉదయం కీసర టోల్ ప్లాజా వద్ద కిడ్నాప్ చేశారని తొలుత మరో న్యాయవాది డాక్టర్ అన్వర్ షేక్ హైకోర్టుకు నివేదించారు. దీనిపై అత్యవసర విచారణ జరిపాలని అన్వర్ కోరారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ, ఇది కేవలం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడానికి సంబంధించిన వ్యవహారమన్నారు. దీనిపై అంత అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, న్యాయవాదిని సీఐడీ అధికారులు కిడ్నాప్ చేశారని చెబుతున్న నేపథ్యంలో, అన్నీ వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని, అప్పుడే వాటిని పరిశీలిస్తామని చెబుతూ విచారణను వాయిదా వేసింది.


