ఇటు ఇచ్చుకో.. అటు పుచ్చుకో.. | Industrial subsidies only if bribes are paid | Sakshi
Sakshi News home page

ఇటు ఇచ్చుకో.. అటు పుచ్చుకో..

Nov 28 2026 5:38 AM | Updated on Nov 28 2026 5:38 AM

Industrial subsidies only if bribes are paid

ముడుపులిస్తేనే పారిశ్రామిక రాయితీలు

విడతల వారీగా విడుదల చేస్తున్న మొత్తంలోను కమీషన్లు 

బకాయిల్లో 20% విడుదలకు కూడా 12.5% ఇవ్వాల్సిందే 

బ్యాంకు ఖాతా పునరుద్ధరించు కోవాలన్నా చేయి తడపాల్సిందే 

ప్రోత్సాహకాలు విడుదలగాక ఎన్‌పీఏలుగా మారిపోయిన బ్యాంకు ఖాతాలు 

పరిశ్రమలశాఖ అధికారుల తీరుతో లబోదిబోమంటున్న ఎంఎస్‌ఎంఈ పారిశ్రామికవేత్తలు

సాక్షి, అమరావతి: చేయి తడిపితేనే ప్రోత్సాహకాల విడుదల.. ముడుపులు ఇవ్వకపోతే ప్రోత్సాహకాలు నిలిపివేత.. ఇప్పుడిది రాష్ట్ర పరిశ్రమలశాఖలో జరుగుతున్న అవినీతి బాగోతం. పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను సకాలంలో ఇవ్వకుండా ఒకపక్క వేధిస్తూ 20 శాతం, 30 శాతం చొప్పున విడతల వారీగా విడుదల చేసే మొత్తాల్లోను పీక్కుతింటున్నారు. పరిశ్రమలకు రూ.15 వేలకోట్ల వరకు ప్రోత్సాకాలు ఇవ్వాల్సి ఉండగా అందులో ప్రభుత్వం కేవలం రూ.1,400 కోట్లు విడుదల చేసింది. 

12.5 శాతం కమీషన్‌ ఇస్తేనే ప్రోత్సాహకాలు తమ అకౌంట్లో జమ అవుతున్నాయని లేకపోతే ఏదో సాకు పెట్టి రాయితీలను ఆపేస్తున్నారని పారిశ్రామికవేత్తలు ఆవేదన చెందుతున్నారు. విశాఖ పెట్టుబడుల సమావేశం ముందు హాడావుడిగా బకాయిలు విడుదల చేసినా ఇప్పటివరకు చాలామంది ఖాతాల్లో నగదు జమకాలేదు. బ్యాంకు ఖాతా నంబర్లు మారిపోయాయని, అకౌంట్‌ యాక్టివ్‌గా లేదని, బ్యాంకు రుణం కంటే పొందుతున్న రాయితీల విలువ ఎక్కవ ఉందని.. ఇలా అనేక సాకులు చూపుతూ ప్రోత్సాహకాలను ఆపేశారు.

బ్యాంకు ఖాతా మార్చాలంటే జిల్లా పరిశ్రమల అధికారుల్ని ప్రసన్నం చేసుకోవాల్సిందే 
పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల కాకపోవడంతో పారిశ్రామికవేత్తలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించలేకపోయారు. వరుసగా మూడునెలలు బకాయిలు చెల్లించకపోవడంతో అవి నిరర్థక ఆస్తులుగా మారిపోయి ఖాతాలు స్తంభించిపోయాయి. ఇప్పుడు ఈ ఖాతాలకు నగదు విడుదల అవడంతో.. జమకాలేదు. దీంతో సీఎఫ్‌ఎంఎస్‌లో నగదు జమ ఫెయిలయినట్లు చూపిస్తోంది. ఈ ప్రోత్సాహకాల కోసం కొత్త బ్యాంకు ఖాతా లేదా బ్యాంకుల నుంచి ఎన్‌వోసీ తీసుకుని జిల్లా పరిశ్రమల శాఖలో సమర్పిస్తేనే ఆ నిధులు జమ అవుతాయి.

ఇప్పుడు ఈ బ్యాంకు ఖాతా నంబరు మార్చుకోవడానికి కూడా జిల్లా పరిశ్రమలశాఖ అధికారులు మామూళ్లు అడుగుతున్నారంటూ చిన్న పారిశ్రామికవేత్తలు ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు చెల్లించాల్సిన రుణం కంటే విడుదలవుతున్న ప్రోత్సాహకాలు ఎక్కువ ఉన్నా ఆపేస్తున్నారు. బ్యాంకుల్లో పరపతి పోకూడదని అప్పుచేసి రుణాలు సకాలంలో చెల్లించడం కూడా తప్పయిపోయిందంటూ బాధపడుతున్నారు. చట్టబద్ధంగా తమకివ్వాల్సిన ప్రోత్సాహకాలను అసంబద్ధ నిబంధనలతో అడ్డుకుంటున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement