క్షేమంగా ఇంటికి చేరుకున్న మత్స్యకారులు
క్షేమంగా స్వగ్రామం చేరుకున్న ఏడుగురు మత్స్యకారులు
ఉప్పాడ రేవు వద్ద స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు
భావోద్వేగానికి గురై కంటతడి.. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనాలు
కాకినాడ జిల్లా సుబ్బంపేటలో ఆనందోత్సాహాలు
కొత్తపల్లి: సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఆచూకీ తెలియకుండాపోయిన కాకినాడజిల్లా ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక సురక్షితంగా ఉప్పాడ చేపలరేవుకు చేరుకోవడంతో గత పది రోజులుగా తీవ్ర ఆందోళనతో గడిపిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.
సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు.. గరికిన సింహాద్రి(బోటు యజమాని), సూరాడ కోదండరావు, గంపల ప్రకాష్, తిర్రి నారాయణ, సూరాడ చిన్న, మేరుగు నారాయణ, కందాల రాములు ఈ నెల 4న ‘ఇమ్మానుయేల్’ అనే బోటులో సముద్రంలో వేటకు వెళ్లారు. ఒడిశాలోని పారాదీప్ తీరం వైపు వెళ్లిన వీరు ఈ నెల 14వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ తరువాత తుపాను వాతావరణం, సముద్రంపై సెల్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో వీరితో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
మొరాయించిన బోటులోని గేర్‌బాక్స్..
ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ తెలియడం లేదని కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు కోస్టుగార్డు, నేవీ, మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం వీరి బోటు అనకాపల్లి జిల్లా తీరం సమీపంలోకి రాగానే మత్స్యకారుల ఫోన్లకు సిగ్నల్స్ అందాయి. దీంతో వారు తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బోటులోని గేర్ బాక్స్ మొరాయించడంతో ఇబ్బంది పడ్డామని, దానికి తోడు తుపాను వాతావరణం కూడా కొంత ఇబ్బంది పెట్టిందని, దాంతో సెల్ సిగ్నల్స్ అందలేదని మత్స్యకారులు వివరించారు. అనంతరం సముద్ర మార్గాన ప్రయాణించిన వీరంతా అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఉప్పాడ తీరానికి చేరుకున్నారు.
గ్రామంలో సంతోషకర వాతావరణం
స్వగ్రామానికి చేరుకున్న మత్స్యకారులను కుటుంబ సభ్యులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్ని రోజులుగా తమ వారి కోసం ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు వారి రాకతో ఊరట లభించింది. ఇంటికి చేరుకున్న మత్స్యకారులు మీడియా ప్రతినిధులతో తమ అనుభవాలను పంచుకున్నారు. వారిని చూసేందుకు స్థానికులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావడంతో గ్రామంలో సంతోషకర వాతావరణం నెలకొంది.


