కోల్‌కతాలో నౌకాదళానికి అప్పగించిన జీఆర్‌ఎస్‌ఈ సంస్థ
75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక స్టెల్త్ ఫిగ్రేట్ నిర్మాణం
‘ప్రొజెక్ట్ 17ఏ’లో భాగంగా నిర్మించిన చివరి అధునాతన యుద్ధనౌక
సింథియా: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అత్యాధునిక స్టెల్త్‌ఫిగ్రేట్ యుద్ధనౌక ‘వింధ్యగిరి’ని శుక్రవారం భారత నౌకాదళానికి అధికారికంగా అప్పగించారు. భారతనౌకాదళం సముద్ర రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే ఈ యుద్ధనౌకను కోల్‌కతాలోని ప్రభుత్వ రంగ సంస్థ ‘గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ)’ నిర్మించింది. ‘ప్రాజెక్టు 17ఏ’ (నీలగిరి క్లాస్) కింద మొత్తం ఏడు స్టెల్త్‌ఫిగ్రేట్ నౌకలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా ‘వింధ్యగిరి’ అందులో చివరిది. ఈ నౌక అప్పగింతతో ప్రతిష్టాత్మక ‘ప్రాజెక్టు 17ఏ’ కార్యక్రమం విజయవంతంగా పూర్తయినట్లయింది.
‘వింధ్యగిరి’ ప్రత్యేకతలు
కర్ణాటకలోని వింధ్యగిరి పర్వత శ్రేణుల పేరును ఈ యుద్ధనౌకకు పెట్టారు. గతంలోనూ ఐఎన్‌ఎస్ వింధ్యగిరి పేరుతో లియాండర్ తరగతికి చెందిన యుద్ధనౌక భారత నౌకాదళంలో సేవలందించింది. 1981 జూలై 8 నుంచి 2012 జూన్ 11 వరకు 31 ఏళ్లపాటు విశేష సేవలు అందించిన ఆ నౌక పేరునే ప్రస్తుత అధునాతన యుద్ధనౌకకు పెట్టారు. ఈ యుద్ధనౌకలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, శత్రువులకు చిక్కకుండా కదిలే స్టెల్త్ సామర్థ్యం, అధిక అగ్నిశక్తి, ఆటోమేషన్ వ్యవస్థలు, మెరుగైన రక్షణ సామర్థ్యాలు ఉన్నాయి. భారతదేశ నౌకా నిర్మాణ రంగంలో సాధించిన సాంకేతిక పురోగతికి ఇది నిదర్శనంగా నిలువనుంది.
స్వదేశీ పరిజ్ఞానానికిపెద్దపీట
ఈ ప్రాజెక్టులో పలు కీలక విజయాలు నమోదయ్యాయి. యుద్ధనౌకల్లో 75 శాతం స్వదేశీ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. 200కుపైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4,000 మందికి ప్రత్యక్షంగా, 10,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. వింధ్యగిరి యుద్ధనౌక అప్పగింత భారత నౌకా నిర్మాణ రంగంలోని సాంకేతిక నైపుణ్యం, ఇంజినీరింగ్ సామర్థ్యం, స్వదేశీ రక్షణ ఉత్పత్తుల అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా యుద్ధనౌకల రూపకల్పన నుంచి నిర్మాణం వరకు స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్న భారత నౌకాదళానికి ఇది మరో కీలక విజయమని నేవీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం
» వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన ఈ యుద్ధనౌకను కోల్‌కతాలోని వార్‌షిప్ ఓవర్‌సీయింగ్ టీమ్ పర్యవేక్షణలో నిర్మించారు. ‘ప్రొజెక్ట్ 17ఏ’ యుద్ధనౌకల్లో అత్యాధునిక ఆయుధాలు, నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
» శత్రు యుద్ధనౌకలు, విమానాలు, జలాంతర్గాములను ఎదుర్కొనే సామర్థ్యం.
» సముద్ర ఉపరితలంపై, గగనతలంలో, నీటి అడుగున జరిగే వివిధ రకాల యుద్ధ కార్యకలాపాలను సైతం సమర్థంగా నిర్వహించగల శక్తి దీని సొంతం.
‘ప్రొజెక్ట్ 17ఏ’ కీలక విజయాలు..
» ‘వింధ్యగిరి’ అప్పగింతతో ‘ప్రొజెక్ట్ 17ఏ’లో భాగంగా నిర్మించిన మొత్తం ఏడు యుద్ధనౌకలు భారత నౌకాదళానికి చేరాయి.
» తొలి యుద్ధనౌక ఐఎన్‌ఎస్ నీలగిరిని 2024 డిసెంబర్ 20న అప్పగించారు.
» చివరి యుద్ధనౌక వింధ్యగిరిని 2026 నవంబర్ 27న అప్పగించారు.ఐఎన్‌ఎస్ నీలగిరి నిర్మాణానికి 84 నెలలు పట్టగా, వింధ్యగిరి నిర్మాణం 68 నెలల్లోనే పూర్తయింది.


