వైఎస్‌ జగన్‌ హయాంలోనే పెట్టుబడుల వెల్లువ | Investments surged during YS Jagans tenure | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ హయాంలోనే పెట్టుబడుల వెల్లువ

Nov 28 2026 5:55 AM | Updated on Nov 28 2026 5:55 AM

Investments surged during YS Jagans tenure

వాటిని తమ ఘనతగా చెప్పుకొంటూ కూటమి ప్రభుత్వం క్రెడిట్‌ చోరీ

వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్‌ దువ్వూరి కృష్ణ మండిపాటు

టీడీపీ సర్కారు 2017లో చేసుకున్న ఎంఓయూల్లో ఆచరణలోకి వచ్చింది 17 శాతమే..

2018లో చేసుకున్న ఎంఓయూల్లో అయితే 7.26 శాతమే..

వైఎస్సార్‌సీపీ ఐదేళ్లలో చేసుకున్న ఎంఓయూల్లో 75.25 శాతం కార్యరూపం దాల్చాయి

ఆర్టీఐ, ప్రభుత్వ అధికారిక నివేదికలే ఇందుకు నిదర్శనం 

మేం బయటపెట్టిన ఆధారాలు చూశాక లోకేశ్‌ స్పందించాలని డిమాండ్‌

రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు వైఎస్‌ జగన్‌ కృషి ఫలితమేనని వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు దువ్వూరి కృష్ణ చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులే రాలేదని, కూటమి సర్కారు వచ్చాక రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన మండిపడ్డారు. దువ్వూరి కృష్ణ శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన సంస్థలు, పెట్టుబడులు... వాటిని తామే తెచ్చినట్లు కూటమి ప్రభుత్వం చెప్పుకొంటూ చేస్తున్న క్రెడిట్‌ చోరీని సమగ్రంగా ఆధారాలతో సహా వెల్లడించారు. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఎలా అప్పుల కుప్పగా మార్చేస్తుందో కూడా వివరించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో పెట్టుబడులపై మంత్రి లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తాను చూపించిన ఆధారాలపై వివరణ ఇవ్వాలని దువ్వూరి కృష్ణ సవాల్‌ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

ప్రాజెక్టుల విస్తరణను చూపించి క్రెడిట్‌ చోరీ
వైఎస్‌ జగన్‌ హయాంలోనే గ్రీన్‌ ఎనర్జీ, సిమెంట్, ఇతర రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు ఆయా ప్రాజెక్టుల విస్తరణలు చూపించి కూటమి క్రెడిట్‌ చోరీకి పాల్పడుతోంది. కేవలం జీవోలు ఇచ్చి పెట్టుబడులు కన్వర్ట్‌ అయినట్లు గొప్పలు చెప్పుకొంటున్నారు. జీవో ఇచ్చినంతమాత్రాన ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు కాదు. గతంలో ఇలాంటి జీవోలు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. భారీగా అప్పులు చేస్తోంది.

గ్రౌండ్‌ అయిన పెట్టుబడులు.. రెండు ప్రభుత్వాల మధ్య ఎంతో తేడా 
2025 అక్టోబర్‌ 7న చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం 2017 సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.1,03,375 కోట్ల విలువైన ఎంఓయూలు జరిగాయి. వాటిలో నిర్మాణ పనులు, వాణిజ్య కార్యకలాపాలు జరిగినవి కేవలం 17 శాతమే. 2018 సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.61,546 కోట్ల విలువైన ఎంఓయూలు చేసుకున్నారు. అందులో కేవలం 7.26 శాతం మాత్రమే గ్రౌండ్‌ అయ్యాయి. అదే వైఎస్సార్‌సీపీ హయాంలో ఐదేళ్లలో వచ్చిన పెట్టుబడులు మొత్తం రూ.4,38,161 కోట్లు. అందులో 75.25 శాతం గ్రౌండ్‌ అయ్యాయి. ఈ విషయాలన్నీ చంద్రబాబు ప్రభుత్వమే ఆర్‌టీఐ కింద అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పింది.

అయినా జగన్‌ హయాంలో వచ్చిన పెట్టుబడులను, ప్రాజెక్టులను కూడా కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటోంది. కూటమి ప్రభుత్వం ఈ మధ్యే ప్రాజెక్ట్‌ స్టేటస్‌ డాక్యుమెంట్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ ప్రభుత్వంలో వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.22.63 లక్షల కోట్లు. అందులో కన్వర్ట్‌ అయినవి రూ.17.11 లక్షల కోట్లు కాగా, గ్రౌండ్‌ అయిన పనుల విలువ రూ.7.30 లక్షల కోట్లు అని చెబుతున్నారు. అయితే వాటిలో రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గత వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్‌ జగన్‌ వేసిన అడుగుల ప్రతిఫలమే అనేది సుస్పష్టం.

మేం బయటపెట్టిన ఆధారాలపై లోకేశ్‌ స్పందించాలి
రాష్ట్ర ఆదాయాలు పెరగకపోవడం వల్ల అప్పుల మొత్తం పెరుగుతోంది. 2019–2023 మధ్య వైఎస్సార్‌సీపీ హయాంలో మొత్తం తీసుకున్న అప్పులో 33 శాతం మూలధన వ్యయానికి వెచ్చించాం. కానీ కూటమి హయాంలో ఈ సెప్టెంబర్‌ వరకు చూస్తే 27 శాతం అప్పులు మాత్రమే మూలధనానికి వెళ్తే, మిగతా అప్పులన్నీ రెవెన్యూ వ్యయాలే చేశారు. మంత్రి నారా లోకేశ్‌ నాలుగైదు రోజుల క్రితం ‘ఎక్స్‌’లో పెట్టిన పోస్టులో గత మా ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు రాలేదని పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మేం బయటపెట్టిన రిపోర్టులన్నీ అధికారిక నివేదికలు. సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధానాలు. మరి అలాంటప్పుడు మా హయాంలో అసలు పెట్టుబడులే రాలేదని ఎలా చెబుతారు? అందుకే లోకేశ్‌ ఈ ఆధారాలను చూసి, ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి.

ఆర్థిక సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణం
రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏ మాత్రం కారణం కాదు. చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో వైఫల్యాలే అందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా నానాటికీ తీవ్రంగా పెరుగుతున్న ద్రవ్యలోటు కూడా ఒక కారణం. వైఎస్సార్‌సీపీ హయాంలో 2021–24 మధ్య 15వ ఆర్థిక సంఘం, కేంద్రం అనుమతించిన దాని కంటే రూ.23,535 కోట్లు తక్కువ అప్పు తీసుకున్నాం. అదే చంద్రబాబు ప్రభుత్వం రూ.37,848 కోట్లు ఎక్కువ అప్పు తీసుకున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. కాబట్టి గత ప్రభుత్వాన్ని తప్పుబట్టడం మానుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునే విషయాన్ని ఆలోచించుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement