సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణ వ్యయం మరో రూ.2 వేల కోట్ల పెంపు
రూ.4,688 కోట్ల నుంచి రూ.6,641 కోట్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం
గ్రీన్ పనుల ప్యాకేజీ కోసం రూ.180.68 కోట్లు
శాసనసభ భవనం అదనపు నిర్మాణాలంటూ మరో రూ.379 కోట్లు
అగ్నిమాపక, ప్లంబింగ్, లిఫ్టు పనులకు రూ.431 కోట్లు
పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియానికి రూ.626 కోట్లు
రూ.1,500 కోట్ల అప్పునకు గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయం
సాక్షి, అమరావతి: అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయాలను భారీగా పెంచేస్తూ దోపిడీ పరంపరను చంద్రబాబు సర్కారు కొనసాగిస్తోంది. ఇప్పటికే రాజధాని భవనాలకు లగ్జరీ హంగులు, సోకుల పేరుతో నిర్మాణ వ్యయాలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. అది చాలదన్నట్టు తాజాగా సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణ వ్యయాన్ని అదనపు పనుల పేరుతో ఏకంగా రూ.2,000 కోట్లు పెంచేసింది. శుక్రవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణం కోసం గతంలో రూ.4,688.83 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అదనపు స్ట్రక్చరల్ స్టీల్, డయాగ్రిడ్ నిర్మాణం కోసం టూ–అవర్ ఫైర్–రేటెడ్ ఇంటుమెసెంట్ పెయింట్ పేరుతో నిర్మాణ వ్యయాన్ని రూ.6,641.21 కోట్లకు పెంచుతూ సవరించిన అంచనాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. సవరించిన పనులను, అనుబంధ పనులను ప్రస్తుత ఏజెన్సీల ద్వారానే అమలు చేయడానికి ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి ఇచ్చింది.
ఇతర పనులకూ..
» రాజధాని ప్రాంతంలో ‘గ్రీన్’ పనుల కోసం రూ.180.68 కోట్లకు పరిపాలన ఆమోదం. ఈ విభాగంలో వాగులు, కాలువల వెంబడి అభివృద్ధి, శాఖమూరు పార్కులో పబ్లిక్ పార్క్ అభివృద్ధి, అమరావతి శంకుస్థాపన ప్రదేశంలో అమరావతి మెమోరియల్ పార్క్ అభివృద్ధి.
» రాజధానిలో హైకోర్టు భవనానికి హై సైడ్ ఎలక్ట్రికల్, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ప్లంబింగ్ పనుల కోసం రూ.431.79 కోట్లు వెచ్చించేందుకు ఆమోదం.
» శాసన భవనం కోసం స్పైర్, రూఫ్, రిటైనింగ్ వాల్, షియర్–కోర్‌వాల్, స్లాబ్‌లు, బీమ్‌లు, పీటీ స్లాబ్ అండ్ బీమ్, ఇంక్లైన్డ్ లిఫ్టులు, వాటర్ ప్రూఫింగ్ పనులను రూ.379.82 కోట్లతో చేపట్టేందుకు ఆమోదం.
» రాజధాని పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.1,215.70 కోట్ల కాంట్రాక్ట్ పనులకు ఆమోదం.
» పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ భవనాల నిర్మాణం కోసం రూ.626.13 కోట్ల కాంట్రాక్ట్ పనులకు ఆమోదం.
» శాసనసభ భవనంలో ఎలక్ట్రికల్, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్టులు, ఫైర్ అలారం, ప్లంబింగ్ పనులు చేపట్టేందుకు రూ.353.51 కోట్ల కాంట్రాక్ట్‌కు ఆమోదం.
మరిన్ని అప్పులకు గ్రీన్‌సిగ్నల్
» ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.1,500 కోట్ల అప్పు తెచ్చేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
» ఎంఎస్‌ఎంఈలపై నియంత్రణ భారాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్–ఎంఎస్‌ఎంఈ (వ్యాపార హక్కు) బిల్లు–2026ను ప్రవేశపెట్టేందుకు, పలు సంస్థలకు భూముల కేటాయింపు, రాయితీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.


