రూ.2,271 కోట్లతో మొదలైన ఐదు టవర్ల ప్రాజెక్టు.. ఇప్పుడు రూ.15,316 కోట్లకు చేరిక
ఏడాదిన్నరలోనే ప్రధాన నిర్మాణ పనుల అంచనా మరో రూ.1,952 కోట్ల పెంపు
రూ.4,688 కోట్ల నుంచి రూ.6,641 కోట్లకు పెరిగిన ప్రధాన నిర్మాణ వ్యయం
అద్దాల పనుల అంచనా వ్యయం రూ.2,540 కోట్ల నుంచి రూ.4,830 కోట్లకు పెంపు
చైనాలో చదరపు మీటరుకు రూ.80,892.. అమరావతిలో రూ.2,05,450.82!
అద్దాల పనుల్లో చదరపు మీటరుకు రూ.1.24 లక్షల వ్యత్యాసం
అవే మూడు సంస్థలకు ప్రధాన నిర్మాణం, విద్యుత్, ఇతర పనుల కేటాయింపు
2018లో ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సీసీకి రూ.2,271.24 కోట్లకు పనుల అప్పగింత
2024లో పాత టెండర్ల రద్దు.. 2025లో రూ.4,688.83 కోట్లకు అదే సంస్థలకు మళ్లీ కాంట్రాక్టులు
ఏడాదిన్నరలోనే మరో రూ.1,952.38 కోట్ల భారం.. కాంట్రాక్టర్లకు భారీ ప్రయోజనం
కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నీకింత–నాకింత దోపిడీ అంటూ ఇంజినీరింగ్ నిపుణుల ఆరోపణ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయం ఐదు భవనాల (టవర్లు) నిర్మాణ వ్యయాన్ని ఇంతింతై వటుడింతై అన్నట్లుగా చంద్రబాబు సర్కార్ ఎప్పటికప్పుడు భారీగా పెంచేస్తోంది. ఐదు భవనాల నిర్మాణ వ్యయాన్ని రూ.4,688.83 కోట్ల నుంచి రూ.6,641.21 కోట్లకు పెంచేందుకు సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ)కు అనుమతి ఇస్తూ మంత్రివర్గం శుక్రవారం ఆమోదముద్ర వేసింది. ఏడాదిన్నర గడవక ముందే ఆ భవనాల నిర్మాణ వ్యయాన్ని రూ.1,952.38 కోట్లు పెంచేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఐదు భవనాల పనులను మూడు సంస్థలకు కట్టబెట్టి.. ఆ పనుల అంచనా వ్యయాన్ని ఎప్పటికప్పుడు పెంచేస్తూ.. ఆ సంస్థలతో కలిసి ‘నీకింత–నాకింత’ అంటూ ముఖ్యనేత దోచుకుతింటున్నారని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.
రూ.6,641 కోట్లకు..
రాజధానిలో తాత్కాలిక సచివాలయానికి సమీపంలో శాశ్వత సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం 4.85 లక్షల చదరపు మీటర్ల (52,20,496 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో ఐదు టవర్లను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో డయాగ్రిడ్ విధానంలో 39 అంతస్తులతో నాలుగు టవర్లు, 49 అంతస్తులతో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ) టవర్ నిర్మిస్తోంది. ఈ ఐదు భవనాల నిర్మాణ పనులను 2018 మే 1న మూడు ప్యాకేజీల కింద రూ.2,271.24 కోట్లకు ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సీసీ సంస్థలకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. 2024లో తిరిగి అధికారంలోకి వచి్చన చంద్రబాబు ప్రభుత్వం నాటి టెండర్లను రద్దు చేసింది.
అనంతరం 2025 ఏప్రిల్ 16న పనుల అంచనా వ్యయాన్ని రూ.4,688.83 కోట్లకు పెంచి, మళ్లీ అదే మూడు సంస్థలకు టెండర్ల ద్వారా పనులు అప్పగించింది. తాజాగా ఐదు టవర్ల డిజైన్లలో మార్పుల వల్ల పనుల పరిమాణం పెరిగిందని, అదనంగా హైగ్రేడ్ స్ట్రక్చరల్ స్టీల్ అవసరమవుతుందని కాంట్రాక్టు సంస్థలు సీఆర్‌డీఏకు ప్రతిపాదనలు పంపాయి. డయాగ్రిడ్ స్ట్రక్చర్‌కు అగ్ని నిరోధక ఇంట్యూమెసెంట్ పెయింట్ వేయాల్సి రావడం వల్ల కూడా ఖర్చు పెరుగుతుందని పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనలను సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించి, అంచనా వ్యయాన్ని పెంచేందుకు కేబినెట్‌కు పంపింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఐదు టవర్ల ప్రధాన నిర్మాణ పనుల అంచనా వ్యయం రూ.4,688.83 కోట్ల నుంచి రూ.6,641.21 కోట్లకు చేరింది.
అంటే ఏడాదిన్నర గడవకముందే అదనంగా రూ.1,952.38 కోట్ల పనులు అదే మూడు సంస్థలకు దక్కనున్నాయి. గతంలోనే పెంచిన అంచనాలకు మళ్లీ అదనపు భారం జోడించడంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పనుల పరిమాణం, ధరల పెరుగుదలను సాకుగా చూపుతూ పదేపదే అంచనాలు పెంచడం వెనుక అసలు ఉద్దేశమేమిటని ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టు సంస్థలకు భారీగా లబ్ధి చేకూర్చేలా ఈ వ్యవహారం సాగుతోందని, ఇందులో కమీషన్ల ఆరోపణలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో ఐదు టవర్లకు హైసైడ్ ఎలక్ట్రికల్ వ్యవస్థ, హెచ్‌వీఏసీ (వాతావరణ నియంత్రణ వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్టులు, ప్లంబింగ్ పనుల కోసం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను కూడా ఈ నెల 2న అదే మూడు సంస్థలకు అప్పగించడం గమనార్హం.

అద్దాల పనుల్లో అంచనాల మాయాజాలం!
ఐదు టవర్లకు గ్లాస్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కాలమ్ క్లాడింగ్, స్కైలైట్, ఫొటోవోల్టాయిక్ సోలార్ ప్యానళ్లు, బిల్డింగ్ మెయింటెనెన్స్ యూనిట్ల (బీఎంయూ) ఏర్పాటుకు ప్రభుత్వం తొలుత రూ.2,540 కోట్ల అంచనా వ్యయంతో అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి మే 1న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అల్యూమినియం ధరలు, కార్మికుల వేతనాలు, ఇన్‌స్టలేషన్ ఛార్జీలు, రవాణా ఖర్చులు పెరిగాయని.. ఆరు మీటర్ల పొడవైన స్టెయిన్‌లెస్ స్టీల్ ప్యానళ్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని కాంట్రాక్టు సంస్థలు పేర్కొన్నాయి.
ఈ సాకుతోనే అంచనా వ్యయాన్ని రూ.4,830 కోట్లకు పెంచాలని కోరాయి. దీనిపై అక్టోబర్ 28న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం ఆమోదముద్ర వేసింది. దీంతో రూ.2,540 కోట్లుగా ఉన్న అంచనా వ్యయాన్ని రూ.4,830 కోట్లకు పెంచుతూ ఈ నెల 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే కేవలం అద్దాలు, క్లాడింగ్ పనులకే అదనంగా రూ.2,290 కోట్లు పెంచేశారు. మే 1న అంచనాలు ఖరారు చేసినప్పటి నుంచి అక్టోబర్ 28 వరకు అల్యూమినియం ధరలు, కార్మికుల వేతనాలు, రవాణా ఛార్జీల్లో అంత భారీ పెరుగుదల లేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. మరి అంత భారీగా అంచనా వ్యయాన్ని ఎందుకు పెంచాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
చైనాలో రూ.80 వేలు.. అమరావతిలో రూ.2 లక్షలు!
అమరావతి సచివాలయ టవర్లకు డిజైన్లు రూపొందించిన పోస్టర్ పార్టనర్స్ సంస్థే చైనాలోని షెన్‌జెన్‌లో మర్చంట్స్ బ్యాంక్ హెడ్‌క్వార్టర్స్ టవర్లను కూడా డిజైన్ చేసింది. ఆ భవనాలకు అద్దాలు అమర్చిన పనులకు చదరపు మీటరుకు రూ.80,892 చొప్పున వ్యయం అయింది. ఇందులో పన్నులు, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ ఫీజు కూడా కలిపి ఉన్నాయి. కానీ అమరావతిలోని ఐదు సచివాలయ టవర్లకు అద్దాలు అమర్చే పనులకు చదరపు మీటరుకు ఏకంగా రూ.2,05,450.82 చొప్పున అంచనా వేశారు. అంటే చైనాలో చేసిన పనులతో పోలిస్తే ఇక్కడ చదరపు మీటరుకు రూ.1,24,558.82 అదనంగా చూపించారు.
దాదాపు రెండున్నర రెట్లకుపైగా వ్యయం చూపడంపై ఇంజినీరింగ్ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మర్చంట్స్ బ్యాంక్ హెడ్‌క్వార్టర్స్ టవర్ల నిర్మాణం గతేడాదే పూర్తయింది. అక్కడ వినియోగించిన సామగ్రికి, అమరావతి టవర్లలో వినియోగించే సామగ్రికి పెద్దగా తేడా లేదని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇక్కడ అద్దాల పనులకు ఇంత భారీగా అంచనాలు పెంచడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. సిండికేట్ సంస్థలకు అధిక ధరలకు పనులు అప్పగించడం ద్వారా భారీగా లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
చదరపు అడుగుకు రూ.29,340!
ఐదు సచివాలయ టవర్లకు సంబంధించిన నిర్మాణం, ఇతర ప్రధాన పనుల అంచనాలను కలిపితే వ్యయం ఇప్పటికే రూ.15,316.94 కోట్లకు చేరింది. ఇందులో ప్రధాన నిర్మాణ పనులకు రూ.6,641.21 కోట్లు, విద్యుత్, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక, లిఫ్టులు, ప్లంబింగ్ పనులకు రూ.2,316.88 కోట్లు, అద్దాలు, క్లాడింగ్ పనులకు రూ.4,830 కోట్లు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలకు రూ.1,057.62 కోట్లు, డిజైన్ల రూపకల్పనకు రూ.471.23 కోట్లు ఖర్చవుతున్నాయి. మొత్తం 52,20,496 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతానికి ఈ అంచనాలను లెక్కిస్తే చదరపు అడుగుకు సుమారు రూ.29,340 వ్యయం అవుతోంది.
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఫైవ్‌స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్‌తో కూడిన భవనాలను సైతం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి రూ.4,500లోపు నిర్మించవచ్చని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే అమరావతి టవర్ల ప్రాజెక్టులోని అన్ని పనుల అంచనాలను కలిపి సాధారణ భవన నిర్మాణ వ్యయంతో పోల్చడం సరికాదని, అయినా ఈ స్థాయిలో వ్యయం చేరడంపై సమగ్ర పరిశీలన అవసరమని నిపుణుల అభిప్రాయం. సంప్రదాయ నిర్మాణ పద్ధతిలోనైనా, డయాగ్రిడ్ విధానంలోనైనా నిర్మాణ వ్యయంలో ఇంత భారీ వ్యత్యాసం ఉండాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. డయాగ్రిడ్ విధానంలో ఎత్తు పెరిగే కొద్దీ నిర్మాణ సామర్థ్యం, స్టీల్ వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయినప్పటికీ అంచనాలు పదేపదే పెరుగుతుండటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రూ.2,271 కోట్లతో మొదలై.. రూ.15,316 కోట్లకు!
2018 మే 1: ఐదు టవర్ల నిర్మాణ పనులు ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సీసీ సంస్థలకు రూ.2,271.24 కోట్లకు అప్పగింత.
2024: పాత టెండర్ల రద్దు.
2025 ఏప్రిల్ 16: ప్రధాన నిర్మాణ పనుల అంచనా వ్యయం రూ.4,688.83 కోట్లకు పెంపు.
తాజాగా: ప్రధాన నిర్మాణ పనుల అంచనా రూ.6,641.21 కోట్లకు పెంపు.
విద్యుత్, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక, లిఫ్టులు, ప్లంబింగ్ పనులకు రూ.2,316.88 కోట్లు.
అద్దాలు, క్లాడింగ్, సోలార్ ప్యానళ్లు, బీఎంయూ పనులకు రూ.4,830 కోట్లు.
రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలకు రూ.1,057.62 కోట్లు.
డిజైన్ల రూపకల్పనకు రూ.471.23 కోట్లు.
మొత్తం అంచనా వ్యయం: రూ.15,316.94 కోట్లు.
మొత్తం నిర్మిత ప్రాంతం: 52,20,496 చదరపు అడుగులు.
చదరపు అడుగుకు సగటు వ్యయం: రూ.29,340.


