భయంభయంగా బాల్యం.. భవితపై ప్రభావం | Intense pressure on students in the name of studies and ranks | Sakshi
Sakshi News home page

భయంభయంగా బాల్యం.. భవితపై ప్రభావం

Nov 28 2026 6:06 AM | Updated on Nov 28 2026 6:06 AM

Intense pressure on students in the name of studies and ranks

చదువులు, ర్యాంకుల పేరుతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిళ్లు 

ప్రైవేట్‌ స్కూళ్లలో కొందరు టీచర్ల బాధ్యతారాహిత్యం   

పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం 

ఇలాంటి చర్యలకు బాధ్యులపై చట్టంలో కఠిన శిక్షలు 

పలు దేశాల్లో పాఠశాల పిల్లలపై భౌతికదాడులు నిషేధం  

అలాంటివి ఇక్కడ కూడా అమల్లోకి రావాలంటున్న తల్లిదండ్రులు  

సాక్షి, అమరావతి: పాఠశాల అంటే పిల్లలకు భయపెట్టే ప్రదేశం కాదు.. భవిష్యత్తును తీర్చిదిద్దే వేదిక. కానీ హోంవర్క్‌ చేయకపోయినా, మార్కులు తగ్గినా, చదువులో వెనుకబడినా కొందరు టీచర్లు విపరీతంగా వ్యవహరిస్తున్నారు. తిట్టి, బెదిరించి, అవమానిస్తున్నారు. బెత్తంతో కొట్టి శారీరకంగా శిక్షిస్తున్నారు. ముఖ్యంగా మార్కులు, ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి విపరీతంగా పెంచుతున్నారు. ఫలితంగా పసిప్రాయం భయపడుతోంది. పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇది పెను అనర్థాలకు దారితీస్తోంది.   

ప్రైవేటు పాఠశాలల్లోనే వేధింపులు  
» దేశవ్యాప్తంగా 2024–25 విద్యాసంవత్సరంలో పాఠశాలల్లో 24.69 కోట్లమంది విద్యార్థులు చదువుతున్నట్లు యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (యూడైస్‌) గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 9.59 కోట్లమంది ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉన్నారు. అంటే మొత్తం విద్యార్థుల్లో సుమారు 39 శాతం మంది ప్రైవేట్‌ స్కూళ్లలోనే చదువుతున్నారు.  
» ఇటీవల 15 నగరాల్లో నిర్వహించిన ఓ అధ్యయనంలో 4 నుంచి 8 తరగతుల విద్యార్థుల్లో 42 శాతం మంది, 9 నుంచి 12 తరగతుల వారిలో 36 శాతం మంది పాఠశాలలో బుల్లీయింగ్‌ లేదా వేధింపులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 
» జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సర్వేలో 11 శాతం మంది విద్యార్థులు తీవ్ర ఆందోళన, 14 శాతం మంది తీవ్ర భావోద్వేగాలు, 43 శాతం మంది ‘మూడ్‌’ మార్పుల సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. 
» దేశవ్యాప్తంగా 13,044 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని నేషనల్‌ క్రైమ్‌ రి­కార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల్లో తేలింది. ఇది మొత్తం ఆత్మహత్యల్లో 7.6 శాతం.  
»  దీర్ఘకాలిక ఒత్తిడి, వేధింపులు ఎదుర్కొనే పిల్లల్లో ఆందోళన, నిద్ర సమస్యలు, డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యల ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 
»బాల్యంలో ఎదురైన భయం, అవమానం కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక అనర్థాలకు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నాయి. 

చట్టం ఏం చెబుతోంది? 
విద్యారి్థని కొట్టడం తప్పు అన్నది అందరికీ తెలిసిన ప్రాథమిక నియమం. అయితే అందరి ముందు అవమానించడం, ‘నువ్వు పనికిరావు’ అంటూ తిట్టడం, ఇతర పిల్లలతో పోల్చడం, తక్కువ మార్కులకు బెదిరించడం, గంటల తరబడి నిలబెట్టడం వంటి చర్యలు కూడా పిల్లల్లో భయం, ఆత్మన్యూనత భావాన్ని పెంచవచ్చు. 2009 విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 17 ప్రకారం పిల్లలకు శారీరక శిక్ష, మానసిక వేధింపులు నిషేధం. 

అదేవిధంగా జువెనైల్‌ జస్టిస్‌ చట్టంలోని సెక్షన్‌ 75 కింద పిల్లలపై క్రూరత్వానికి శిక్షలున్నాయి. తీవ్ర శారీరక లేదా మానసిక నష్టం, ప్రాణాపాయం వంటి పరిస్థితుల్లో కనీసం మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు కఠిన కారాగారశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. లైంగిక వేధింపుల విషయంలో పోక్సో చట్టం కింద మరింత తీవ్రమైన నేరాలు నమోదు చేయవచ్చు. అందుకే పిల్లల భద్రత విషయంలో పాఠశాల యాజమాన్యాలు ఏమాత్రం రాజీపడకూడదు. 

విదేశాల్లో ఇలా కుదరదు  
పిల్లలపై వేధింపుల విషయంలో అనేక దేశాలు మరింత కఠిన విధానాలను అవలంబిస్తున్నాయి. ఉదాహరణకు వేల్స్‌లో 2022 మార్చి 21 నుంచి పిల్లలను శారీరకంగా శిక్షించడం చట్టవిరుద్ధం. పిల్లలకు పెద్దలతో సమానంగా దాడి నుంచి చట్టపరమైన రక్షణ కల్పించారు. అమెరికాలో పలు రాష్ట్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో శారీరక శిక్షను నిషేధించాయి. ఆ్రస్టేలియా విద్యార్థుల భద్రత, గౌరవం, మానసిక ఆరోగ్యం, కుటుంబ భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రత్యేకదృష్టి పెడుతోంది. ఈ ఏడాది అక్కడ జాతీయ యాంటీ–బుల్లీయింగ్‌ ఫ్రేమ్‌­వర్క్‌ అమలుకు చర్యలు ప్రారంభించారు.

మీ పిల్లల్ని ఇలా అడగండి 
పిల్లలు స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్‌ చేశావా? ఎన్ని మార్కులు వచ్చాయి? అని మాత్రమే అడిగితే సరిపోదు. ఈరోజు స్కూల్లో ఎలా గడిచింది? ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టారా? ఏ టీచర్‌ అంటే భయంగా ఉంది? ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అని తల్లిదండ్రులు ప్రతిరోజూ పిల్లలను అడగాలి. ఒక్కసారిగా పిల్లల్లో మార్పు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. స్కూల్‌కు వెళ్లడానికి ఇష్టపడకపోవడం, తరచు కడుపునొప్పి లేదా తలనొప్పి అని చెప్పడం, నిద్రలో మార్పులు, చదువుపై ఆసక్తి తగ్గడం, భయపడటం, ఒంటరిగా ఉండటం వంటి సంకేతాలను నిశితంగా గమనించాలి. కారణాలు కనుక్కుని అవసరమైతే పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడాలి. టీచర్లు ఎలా నడుచుకోవాలి
» ఉపాధ్యాయుడు తన చేతిలో ఉన్నది కేవలం పుస్తకం కాదు.. పిల్లల భవిష్యత్తు అని గుర్తించాలి  
» విద్యార్ధి తప్పుచేస్తే అర్థమయ్యేలా వివరించి చెప్పాలి.. అంతేగానీ అవమానించకూడదు  
» తక్కువ మార్కులు వస్తే కారణం తెలుసుకోవాలి.. ఇతర పిల్లలతో పోల్చకూడదు  
» భయపెట్టి కాకుండా.. ప్రోత్సహించి చదివించాలి  
» పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే తల్లిదండ్రులతో మాట్లాడాలి  
» కోపం వస్తే శిక్ష విధించకుండా పరిస్థితిని శాంతంగా ఎదుర్కోవాలి  
» పిల్లలు తమ సమస్యలు చెప్పుకొనేలా సురక్షిత వాతావరణం కల్పించాలి

2024–25 యూడైస్‌ గణాంకాల ప్రకారం..
దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులు: 24.69 కోట్లు  
ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులు: 9.59 కోట్లు  
మొత్తం విద్యార్థుల్లో ప్రైవేటు బడుల విద్యార్థుల శాతం: 39  
టీచర్ల వేధింపులతో బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థుల సంఖ్య: 13,044  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement