ప్రీమియర్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చదవాలంటే లక్షల రూపాయల విద్యా రుణం తీసుకోవాల్సి రావచ్చు. అయితే, ఐఐఎం కలకత్తాలో ఎంబీఏ పూర్తి చేసిన అవని రాథోర్ మాత్రం రూ.30 లక్షల రుణాన్ని కేవలం రెండేళ్లలోనే పూర్తిగా తీర్చేశారు. ఇందుకోసం ఒకే ఆదాయంపై ఆధారపడకుండా నాలుగు మార్గాలను ఉపయోగించుకున్నారు. ప్రీ-ఎంబీఏ ఉద్యోగంలో వచ్చిన పొదుపు, ఇంటర్న్‌షిప్ స్టైపెండ్, పార్ట్‌టైమ్ ఉద్యోగ ఆదాయం, ఎంబీఏ అనంతరం వచ్చిన జీతాన్ని రుణ చెల్లింపునకు మళ్లించారు.
ఎంబీఏకి ముందే పొదుపు
ఎంబీఏలో చేరడానికి ముందు అవని రెండేళ్లపాటు ఉద్యోగం చేశారు. ఆ సమయంలో కూడబెట్టిన నగదును విద్యా ఖర్చులకు వినియోగించారు. అయితే మ్యూచువల్ ఫండ్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వంటి దీర్ఘకాలిక పెట్టుబడులను మాత్రం ముట్టుకోలేదు. ఇలా రుణంపై ఆధారపడాల్సిన మొత్తాన్ని కొంత తగ్గించుకున్నారు.
బీసీజీ ఇంటర్న్‌షిప్‌తో అదనపు ఆదాయం
ఎంబీఏ చదువుతున్న సమయంలో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేశారు. దీనికి వచ్చిన స్టైపెండ్‌లో కొంత మొత్తాన్ని రుణ చెల్లింపులకు కేటాయించారు. రెండో ఏడాదిలో ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్ (పీపీఓ) రావడంతో పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేశారు. తద్వారా చదువుకుంటూనే అదనపు ఆదాయాన్ని సమకూర్చుకున్నారు.
జీతంలో అధిక భాగం రుణానికే..
ఎంబీఏ పూర్తయ్యాక ఉద్యోగంలో చేరిన ఆమె.. జీతంలో గణనీయమైన మొత్తాన్ని రుణ చెల్లింపులకు మళ్లించారు. తనపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఆదాయంలో ఎక్కువ భాగాన్ని అప్పు తీర్చేందుకు వినియోగించగలిగానని వెల్లడించారు. ఇలా వివిధ దశల్లో సమకూరిన డబ్బుతో రెండేళ్లలోనే రూ.30 లక్షల రుణాన్ని పూర్తిగా తీర్చేశారు.
రుణం తీర్చడమే ఎందుకు ప్రాధాన్యం?
విద్యా రుణాన్ని ముందుగానే చెల్లించడం అందరికీ ఆర్థికంగా ప్రయోజనకరం కాకపోవచ్చని అవని అంగీకరించారు. తక్కువ వడ్డీతో లభించే రుణానికి కనీస వాయిదాలు చెల్లిస్తూ, మిగిలిన డబ్బును ఇతర పెట్టుబడుల్లో పెట్టడం ద్వారా మెరుగైన రాబడులు పొందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే, తాను ఉద్యోగాన్ని వదిలి కొత్త ప్రయాణం ప్రారంభించాలనుకుంటున్నందున అప్పు భారం లేకుండా ఉండటానికే ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు. రుణ బాధ్యత లేకపోతే భవిష్యత్తులో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, మరిన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి స్వేచ్ఛ ఉంటుందని వివరించారు.
ఆమె నిర్ణయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు ఆర్థిక క్రమశిక్షణను అభినందించగా, మరికొందరు తక్కువ వడ్డీ రుణాన్ని ముందుగానే తీర్చడం కంటే ఆ మొత్తాన్ని పెట్టుబడులుగా మళ్లించడం మంచిదని సూచించారు.
ఇదీ చదవండి: రెండు రోజుల్లో కొత్త రూల్స్.. భయపెడుతున్న ‘బ్యాంక్ బ్యాలెన్స్’!


