శాస్త్రీయ పద్ధతిలో 102.85 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్
పర్యావరణ సున్నిత ప్రాంతమైన కేరళలోని వయనాడ్ జిల్లా దేశంలోనే మొట్టమొదటి సంపూర్ణ ఈ-వేస్ట్ ఫ్రీ జిల్లాగా చరిత్ర సృష్టించింది. జిల్లావ్యాప్తంగా పేరుకుపోయిన 102.85 మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను దశలవారీగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్‌కు తరలించడం ద్వారా ఈ అరుదైన ఘనత సాధించింది. కల్పెట్టలోని చంద్రగిరి ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ఈ మేరకు ప్రకటన చేశారు.
వయనాడ్‌లోని 23 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో ఈ ఈ-వేస్ట్ సేకరణ, రీసైక్లింగ్ పనులు విజయవంతంగా సాగాయి. తొలుత ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి పాత ఎలక్ట్రానిక్ పరికరాలను తొలగించారు. అనంతరం స్థానిక సంస్థలు, జిల్లా శుచిత్వ మిషన్ సమన్వయంతో సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హరిత కర్మసేన వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి గృహాలు, వాణిజ్య సముదాయాలు, పర్యాటక ప్రాంతాల నుంచి వ్యర్థాలను సేకరించారు. తొలి విడతలో కొన్ని ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇలా సేకరించిన వ్యర్థాలన్నింటినీ ‘క్లీన్ కేరళ కంపెనీ’ ద్వారా సురక్షిత రీసైక్లింగ్ ప్రక్రియకు తరలించారు.
భూగర్భ జలాల రక్షణే ప్రధాన లక్ష్యం
ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో ఉండే సీసం, పాదరసం, కాడ్మియం వంటి ప్రమాదకర రసాయనాలు సాధారణ చెత్తలో కలిస్తే నేల, భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉంది. దీన్ని నివారించి జీవవైవిధ్యాన్ని, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకే ప్రభుత్వం ఈ ‘నిర్మలం’ (వ్యర్థరహిత కేరళ) ఉద్యమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఈ-వేస్ట్ నిర్మూలన స్ఫూర్తితో వయనాడ్‌లోని పర్యాటక కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ప్రజల క్రియాశీల భాగస్వామ్యం, నిరంతర పర్యవేక్షణ కొనసాగితే వయనాడ్ నమూనా యావత్ దేశానికే పర్యావరణ దిక్సూచిగా నిలవడం ఖాయం.
ఇదీ చదవండి: డిసెంబర్ 1 నుంచి జీఎస్టీ నిబంధనల్లో మార్పులు


