సమయ్ రైనా.. భారతదేశానికి చెందిన ప్రముఖ స్టాండప్ కమెడియన్, యూట్యూబర్, చెస్ స్ట్రీమర్. తాజాగా ఈయన యూట్యూబ్‌లో కొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఒక యూట్యూబ్ ఛానెల్‌లో 10 లక్షల మంది పెయిడ్ మెంబర్స్‌ను సంపాదించిన క్రియేటర్‌గా నిలిచాడు. ఈ విషయాన్ని యూట్యూబ్ స్వయంగా గూగుల్ ఇండియా బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది.
మిస్టర్ బీస్ట్ వంటి ప్రపంచ స్థాయి యూట్యూబర్లు కూడా సాధించలేని ఈ ఘనత సమయ్‌కు దక్కడం విశేషం. ప్రస్తుతం అతని ఛానెల్‌కు 1.24 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
యూట్యూబ్ పెయిడ్ మెంబర్‌షిప్
యూట్యూబ్ పెయిడ్ మెంబర్‌షిప్ అంటే ఏమిటి? అనే విషయానికి వస్తే.. సబ్‌స్క్రైబర్లు ప్రతి నెలా కొంత డబ్బు చెల్లించి తమ అభిమాన క్రియేటర్‌కు సంబంధించిన ప్రత్యేకమైన కంటెంట్‌ను చూడటం. ఇందులో సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉండే వీడియోలు, ప్రత్యేకమైన బ్యాడ్జ్‌లు, ఎమోజీలు, తెరవెనుక జరిగే విషయాలు వంటి సదుపాయాలు ఉంటాయి. సమయ్ రైనా ఛానెల్‌లో దాదాపు 10 లక్షల మంది ఇలా డబ్బులు చెల్లించి మెంబర్‌షిప్ తీసుకోవడం.. అతనికి అభిమానుల్లో ఉన్న ఎంత క్రేజ్ ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది.
సమయ్ రైనా నెట్‌వర్త్
ఇక సమయ్ రైనా నెట్‌వర్త్ విషయానికి వస్తే.. ఇతని ఆస్తుల వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. అయితే.. 2026లో ప్రచారంలో ఉన్న కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. అతని నికర ఆస్తి విలువ సుమారు రూ.140 కోట్ల నుంచి రూ.215 కోట్ల మధ్య ఉండవచ్చని సమాచారం.
యూట్యూబ్ ప్రకటనలు, పెయిడ్ మెంబర్‌షిప్స్, బ్రాండ్ ప్రమోషన్లు, లైవ్ కామెడీ షోలు, ఇండియాస్ గాట్ లేటెంట్ కార్యక్రమం ద్వారా సమయ్ రైనా డబ్బు సంపాదిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం ద్వారా కూడా భారీ మొత్తంలో ఆదాయం వస్తుందని తెలుస్తోంది.
ఇలా ఫేమస్ అయ్యారు
సమయ్ రైనా ఇంతలా ఫేమస్ అవ్వడానికి ప్రధాన కారణం.. అతని డిఫరెంట్ కామెడీ స్టైల్. కామిక్‌స్టాన్ సీజన్ 2 విజేతల్లో ఒకడిగా నిలిచిన ఇతడు.. తర్వాత చెస్ స్ట్రీమింగ్ ద్వారా యూట్యూబ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా చెస్ గ్రాండ్‌మాస్టర్లతో సరదాగా మాట్లాడుతూ చేసే స్ట్రీమ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ప్రారంభించిన ఇండియాస్ గాట్ లేటెంట్ కార్యక్రమం అతనికి దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీని తీసుకొచ్చింది. తనదైన శైలిలో మాట్లాడటం, ఎలాంటి ఫిల్టర్ లేకుండా కామెడీ చేయడం, కొత్త తరహా కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించడం అతని ప్రత్యేకత.
ప్రయాణంలో ఎదురైన సమస్యలు
అయితే సమయ్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. పలు వివాదాలు, పోలీసు ఫిర్యాదులు, మీడియా విమర్శలు, సోషల్ మీడియా విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అతని అభిమానులు అతనికి అండగా నిలిచారు. కాశ్మీర్‌కు చెందిన సమయ్ తన వ్యక్తిగత జీవితంలోని అనుభవాలను కూడా అభిమానులతో పంచుకుంటుంటాడు. తాజాగా వచ్చిన స్టిల్ అలైవ్ 2026 ద్వారా తన జీవితంలోని అనేక విషయాలను ప్రేక్షకులకు వెల్లడించారు. మొత్తం మీద ఒక సాధారణ చెస్ స్ట్రీమర్‌గా ప్రయాణం ప్రారంభించిన సమయ్ రైనా, నేడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన యూట్యూబ్ క్రియేటర్‌గా ఎదగడం నిజంగా విశేషం.
ఇదీ చదవండి: వెండి భారీ పతనం.. కిలోపై రూ.2.55 లక్షలు డౌన్!


