ముంబై: విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ .. కేంద్రాన్ని కోరింది. దేశీయంగా 60 కోట్ల మంది ప్రజలు విమానయానం చేసేందుకు అవకాశాలు ఉన్నాయని గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ రాబీ సింగ్ తెలిపారు. ఇందుకోసం రోజువారీ ఫ్లయిట్స్ సంఖ్య దాదాపు పది రెట్లు పెరిగి 30,000కు చేరాల్సి ఉంటుందని వివరించారు.
ఈ నేపథ్యంలోనే ఎయిర్‌లైన్స్‌ను అభివృద్ధి చేసే దిశగా... ఏదైనా ఫండ్ లేదా ఏదైనా ఎయిర్‌లైన్ కంపెనీలోనో లేదా ఆ రంగంలోకి దిగాలనుకుంటున్న ఔత్సాహిక వ్యాపారవేత్తల వెంచర్లోనో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఇండియా డెట్ క్యాపిటల్ మార్కెట్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా సింగ్ చెప్పారు. వచ్చే ఏడాదిలో తమ ఎయిర్‌పోర్ట్ వ్యాపారం లిస్టింగ్‌కి సన్నద్ధమయ్యే అవకాశం ఉందని వివరించారు.
ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు సైతం సొంత ఎయిర్‌లైన్స్‌ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్న వార్తలు వచ్చినప్పుడు అదానీ గ్రూప్ కూడా రంగంలోకి దిగొచ్చనే ఊహాగానాలు వచ్చాయి. కానీ అప్పుడు వాటిని ఖండించిన అదానీ గ్రూప్ తాజాగా ఆసక్తి వ్యక్తం చేయడం గమనార్హం.


