పాత వాహనం కొన్నా.. అమ్మినా.. ఏపీనే టాప్! | Used Vehicle Transfer Andhra Pradesh Tops India Car bike ownership | Sakshi
Sakshi News home page

పాత వాహనం కొన్నా.. అమ్మినా.. ఏపీనే టాప్!

Nov 7 2026 6:29 PM | Updated on Nov 7 2026 6:37 PM

Used Vehicle Transfer Andhra Pradesh Tops India Car bike ownership

మీలో చాలా మంది పాత కారు లేదా బైక్ కొనడమో, అమ్మడమో చేసే ఉంటారు.. కాబట్టి ఆ వాహన యాజమాన్య బదిలీ ఎంత తలనొప్పో మీకు తెలిసే ఉంటుంది. ఈ ప్రక్రియ ఏ రాష్ట్రంలో సులభం, ఏ రాష్ట్రంలో కష్టం అనే దానిపై కొత్త నివేదిక ఒకటి వచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉంది.

ఇండియాటెక్.ఆర్గ్, కన్జ్యూమర్ వాయిస్ సంస్థలు సంయుక్తంగా "ఈజ్ ఆఫ్ వెహికల్ ఓనర్‌షిప్ ఇండెక్స్ 2026" విడుదల చేశాయి. దేశంలోని వ్యవస్థీకృత పాత కార్ల మార్కెట్‌లో 85 శాతానికి పైగా వాటా ఉన్న 15 రాష్ట్రాల్లో వాహన బదిలీ విధానాలను ఈ అధ్యయనం పరిశీలించింది.

పదికి 5.91 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. కేరళ 5.74తో రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు, ఢిల్లీ చెరో 4.58 సాధించాయి. కర్ణాటకకు 4.30 వచ్చాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్ 2.47తో చివరి స్థానంలో ఉంది. దానికి ముందు బిహార్ (2.51), పశ్చిమ బెంగాల్ (2.56) ఉన్నాయి. ఏ రాష్ట్రమూ పదికి ఆరు పాయింట్లు దాటలేదు. అంటే దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థలో ఏ స్థాయిలో లోపాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఏపీ ఎందుకు ముందుందంటే..

ఆంధ్రప్రదేశ్‌లో బయోమెట్రిక్ ఆధారిత వాహన యాజమాన్య బదిలీ వ్యవస్థ ఉంది. దీనివల్ల ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం తగ్గింది. ప్రధాన పట్టణాల్లో బదిలీ ఒకటి నుంచి మూడు రోజుల్లో పూర్తవుతోందని నివేదిక పేర్కొంది.

ఖర్చుల భారం

ఈ నివేదికలో అత్యంత ఆందోళన కలిగించే అంశం బదిలీ ఖర్చులు. అధికారిక రుసుములకు పదిరెట్ల వరకు ఖర్చవుతోందని, కొన్నిచోట్ల రూ.14,000 వరకు చేరుతోందని అధ్యయనం తెలిపింది. రాష్ట్రాల వారీగా చూస్తే.. ఉత్తరప్రదేశ్‌లో రూ.5,000–8,000, రాజస్థాన్‌లో రూ.4,500–6,500, పంజాబ్‌లో సుమారు రూ.6,500 నమోదయ్యాయి. ఢిల్లీలో రూ.3,000–3,600, హరియాణాలో రూ.2,000–4,000, కేరళలో రూ.500–2,400 ఖర్చవుతోంది. అత్యధిక ఖర్చు బిహార్‌లో నమోదైంది. ముజఫర్‌పూర్‌లో రూ.13,000 నుంచి రూ.14,000 వరకు అయింది. రాష్ట్రాల మధ్యే కాదు, ఒకే రాష్ట్రంలోని ఆర్టీఓల మధ్య కూడా ఛార్జీల్లో వ్యత్యాసాలు చాలానే ఉన్నాయి.

రోడ్ ట్యాక్స్ రీఫండ్ సమస్య

ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనం అమ్మినప్పుడు రోడ్ ట్యాక్స్ రీఫండ్ పెద్ద సమస్యగా మారుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే పనిచేసే రీఫండ్ విధానం ఉన్న రాష్ట్రాలుగా నివేదిక గుర్తించింది. అక్కడ రీఫండ్‌కు 15 నుంచి 30 రోజులు పడుతోంది. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, హరియాణా, బిహార్‌లలో రీఫండ్‌కు పనిచేసే మార్గమే లేదని అధ్యయనంలో పాల్గొన్న వాహనదారులు తెలిపారు. అందుకే "ఒకే భారత్, ఒకే రోడ్ ట్యాక్స్" పేరుతో దేశమంతటికీ ఒకే ట్యాక్స్ విధానం తేవాలని ఇండియాటెక్ సూచించింది.

భారీగా పాత వాహనాల మార్కెట్‌

ఈ సమస్యలు పరిష్కరించడం ఎందుకు ముఖ్యమో మార్కెట్ పరిమాణమే చెబుతోంది. భారత పాత వాహనాల మార్కెట్ 2030 నాటికి 73.5 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా. అయితే అధిక బదిలీ ఖర్చులు, ఆర్టీఓ జాప్యాలు, రాష్ట్రాల్లో ఒకేలా లేని విధానాలు వృద్ధికి అడ్డంకి కావచ్చు. కార్స్24 నివేదిక ప్రకారం 2025లో పాత కార్ల డిమాండ్‌లో మహారాష్ట్ర 20.7 శాతం, కర్ణాటక 16.5 శాతం, గుజరాత్ 13.5 శాతం, ఉత్తరప్రదేశ్ 13 శాతం వాటా కలిగి ఉన్నాయి. అంటే పెద్ద మార్కెట్లలో కొన్నింటిలోనే బదిలీ ప్రక్రియ అత్యంత కష్టంగా ఉంది.

ప్రభుత్వం వైఖరి

నివేదిక విడుదల కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. అక్కడ మాట్లాడిన ఎంపీ హర్ష్ మల్హోత్రా, పాత వాహనాల యాజమాన్య బదిలీ సరళీకరణను పరిశీలిస్తామని చెప్పారు. అయితే నిబంధనల్లో మార్పులపై గానీ, గడువుపై గానీ ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇండియాటెక్, కన్జ్యూమర్ వాయిస్ ఎనిమిది సంస్కరణలను సిఫార్సు చేశాయి.

కొనేవారు, అమ్మేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పాత వాహనం కొనేవారు, అమ్మేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యాజమాన్య బదిలీ పూర్తయ్యే వరకు పెండింగ్ చలాన్లు, పత్రాలు సరిచూసుకోవాలి. అధిక ఛార్జీలు అడిగితే అధికారిక రుసుములు ఎంతో ముందే తెలుసుకోవాలి. రాష్ట్రం మారుస్తుంటే రోడ్ ట్యాక్స్ రీఫండ్ గురించి ముందే ఆరా తీయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement