ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చట్లు
లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు
మనపై మనం పరిమితులు విధించుకోకూడదు
‘వికసిత్ భారత్’సాధనకు రాబోయే రెండు దశాబ్దాలు అత్యంత కీలకం
ఐఐటీ–ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
ఖరగ్‌పూర్: ‘వికసిత్ భారత్’లక్ష్య సాధనకు రాబోయే రెండు దశాబ్దాలు అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఆలోచనా విధానంలో అడ్డంకులను తొలగించడం ద్వారా దేశం తన సామర్థ్యాన్ని గ్రహించగలదని, అవకాశాలను సృష్టించుకోగలదని, పేదలను సాధికారత కల్పించగలదని భారత్ నిరూపించిందని అన్నారు. శనివారం పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ–ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పరిమితులను అధిగమించి, అవకాశాలను సృష్టించాలనే తన సంకల్పాన్ని భారత్ విస్పష్టంగా ప్రకటించిందని పేర్కొన్నారు.
కష్టాలను అధిగమించే విషయంలో తన ఆలోచనలను పంచుకున్నారు. ఏదైనా సవాలు ఎదురైనప్పుడు దానిని సవాలు చేయకుండా ఉండలేనని తేల్చిచెప్పారు. సవాళ్లను సవాలు చేయనిదే తనకు మనశ్శాంతి ఉండదన్నారు. ప్రజలు తరచుగా తమపై తామే పరిమితులను విధించుకుంటారని, అలా చేయడం సరైంది కాదని సూచించారు. ఆలోచనా దృక్పథానికి ఉన్న పరిమితులను అధిగమించినప్పుడే మన సామర్థ్యాలను గుర్తించగలమని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే...
విద్యార్థుల మంత్రం.. ‘దేశమే ప్రథమం’
‘‘అధికారాన్ని సాధికారత కల్పించే సాధనంగా మార్చా లి అనే సూత్రంపై నాకు విశ్వాసం ఉంది. ఒకప్పుడు కష్టమైనవిగా, అసాధ్యమైనవిగా భావించిన కార్యక్రమాలు నేడు వాస్తవరూపం దాలుస్తున్నాయి. అందుకు మన దేశంలో సెమీకండక్టర్, అంతరిక్ష రంగాలే మంచి ఉదాహరణలు. ఐదు దశాబ్దాల క్రితం ఒక సెమీకండక్టర్ తయారీ సంస్థ భారతదేశానికి వచ్చింది. ఎర్ర జెండాల ప్రదర్శనతో దానిని తరిమివేశారు.
పశ్చిమ బెంగాల్‌లో పారిశ్రామికీకరణను వామపక్షాలు వ్యతిరేకించాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. మా ప్రభుత్వం సెమీకండక్టర్ మిషన్‌ను ప్రకటించినప్పుడు, దేశం ఇప్పటికే ఆ అవకాశాన్ని కోల్పోయిందని కొందరు వాదించారు. అయినా మేము ముందుకు వెళ్లి సెమీకండక్టర్ మిషన్‌ను ప్రారంభించాం. నేడు మన దేశం చిప్‌లను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ‘దేశమే ప్రథమం’అనే మంత్రాన్ని విద్యార్థులు అనుసరించాలి. తద్వారా వారికి కొత్త అవకాశాలు లభించడమే కాకుండా, దేశాభివృద్ధికి కూడా తోడ్పాటు అందుతుంది’’ అని మోదీ అన్నారు
‘75 వాయిసెస్ ఫర్ వికసిత్ భారత్’
‘‘గత 75 ఏళ్లలో భారతదేశం ఎద్దుల బండ్ల కాలం నుంచి బుల్లెట్ రైళ్ల కాలం వరకు, తపాలా లేఖల నుంచి సోషల్ మీడియా సందేశాల వరకు ప్రయాణించింది. చిప్‌ల నుంచి నౌకల వరకు అన్నీ మన దేశంలోనే తయారవుతాయనే నమ్మకం ఉంది. రాబోయే రెండు దశాబ్దాలలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా విద్యార్థులు, అధ్యాపకులు కృషి చేయాలి. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు ప్రవేశం కల్పించడం వల్ల యువ పారిశ్రామికవేత్తలకు, ఆవిష్కర్తలకు నూతన అవకాశాలు లభించాయి.
ఐఐటీ–ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి, స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సహ వ్యవస్థాపకుడైన పవన్ కుమార్ చందనను స్ఫూర్తిగా తీసుకోవాలి. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్‌ను అభివృద్ధి చేసే దిశగా ఆ సంస్థ చేపట్టిన కృషి దేశ అంతరిక్ష కార్యక్రమానికి కొత్త ఊపునిచ్చింది. మన అంతరిక్ష ఆశయాలకు ప్రస్తుతం అనేక అంతరిక్ష స్టార్టప్‌లు తోడ్పాటు అందిస్తున్నాయి. ఒకప్పుడు అసాధ్యమని భావించిన విషయాలను సాకారం చేయడంలో ఐఐటీ–ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థుల కృషి ఎంతో దోహదపడింది.
దేశంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలకు ముందే ఈ విద్యా సంస్థను స్థాపించారు. పూర్వవిద్యార్థులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు’’అని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన వైద్య కోర్సు కార్యకలాపాలు నిర్వహించనున్న ప్రాంగణాన్ని ఆయన సందర్శించారు. ‘75 వాయిసెస్ ఫర్ వికసిత్ భారత్’కార్యక్రమంలో భాగంగా ఈ విద్యాసంస్థకు చెందిన 75 మంది ప్రతిభావంతులైన విద్యార్థులతో సంభాషించారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ సాగిస్తున్న ప్రయాణంపై విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వారితో మోదీ ఉత్సాహంగా చర్చించారు. విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణ ప్రాజెక్టులు, పరిశోధనా నమూనాల ప్రదర్శనను సైతం తిలకించారు.
రూ. 75 స్మారక నాణెం ఆవిష్కరణ
ఐఐటీ–ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా.. రూ.75 విలువైన ప్రత్యేక స్మారక నాణేన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించారు. 99.9 శాతం స్వచ్ఛమైన వెండితో తయారైన ఈ నాణెం 40 గ్రాముల బరువు ఉంది. ఈ నాణేనికి ఒక వైపు భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభం, మరోవైపు ఐఐటీ–ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ లోగో ఉన్నాయి. 1951లో ఈ విద్యా సంస్థ ఏర్పాటయ్యింది.


