breaking news
commemorative coins
-
ట్రంప్ నాణెంపై వివాదం
వాషింగ్టన్: ప్రపంచంలో నేడు అగ్రరాజ్యంగా గౌరవం అందుకున్న అమెరికాకు 1776 జూలై 4న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం లభించింది. స్వతంత్ర అమెరికాకు వచ్చే ఏడాది నాటికి 250 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక వేడుకలకు అమెరికా ఇప్పటినుంచే సిద్ధమవుతోంది. ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్మారక నాణేన్ని ముద్రించి విడుదల చేయాలని యునైటెడ్ స్టేట్స్ మింట్(టంకశాల) నిర్ణయించింది. ఒక డాలర్ విలువ కలిగిన ఈ నాణెంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని ముద్రిస్తారన్న ప్రచారం మొదలైంది. అయితే, చాలామంది ఈ విషయం నమ్మలేదు. ట్రంప్‌తో కూడిన నమూనా నాణెం చిత్రాన్ని యూఎస్ ట్రెజరీ విడుదల చేయడంతో అనుమానాలకు తెరపడింది. ట్రంప్ ముఖం కలిగిన ఒక డాలర్ కాయిన్ రావడం అనేది ఫేక్ న్యూస్ కాదని, ముమ్మాటికీ నిజమని ట్రెజరర్ బ్రాండన్ బీచ్ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నమూనా నాణెం సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్‌గా మారింది. అమెరికా స్వతంత్ర దేశంగా మారి 250 ఏళ్లు పూర్తికానుండడం ప్రాధాన్యత కలిగిన సందర్భమని, అందుకే తమ అధ్యక్షుడి చిత్రంతో కూడిన స్మారక నాణేన్ని విడుదల చేయబోతున్నామని స్పష్టంచేశారు. దీనిపై త్వరలో మరిన్ని వివరాలు పంచుకుంటానని పేర్కొన్నారు. నాణెంపై ట్రంప్ పోరాట పటిమ కొత్త నాణెంపై అమెరికాలో చర్చ మొదలైంది. నమూనా నాణెంపై ఒక వైపు ట్రంప్ ముఖం కనిపిస్తోంది. పైభాగంలో లిబర్టీ (స్వేచ్ఛ) అనే పదం ముద్రించారు. కిందిభా గంలో ఇన్ గాడ్ వుయ్ ట్రస్ట్(మనం నమ్మే దేవుడి సాక్షిగా) అనే పదాలు కనిపిస్తున్నా యి. మధ్యలో 1776, 2026 సంవత్సరాలను ముద్రించారు. ఇక రెండోవైపు ట్రంప్ పిడికిలి బిగించిన చిత్రం ఉంది. గత ఏడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసింది. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. తాను పోరాటం ఆపబోనని పిడికిలి బిగించి నినదించారు. ఈ సందర్భాన్ని గుర్తుచేస్తూ నాణెంపై ఫైట్, ఫైట్, ఫైట్ అనే పదాలకు స్థానం కల్పించారు. అంతేకాకుండా ట్రంప్ వెనుకభాగంలో రెపరెపలాడుతున్న అమెరికా జాతీయ జెండా కనిపిస్తోంది. కాయిన్ రీడిజైన్ చట్టానికి ఆమోదం సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ నాణెన్ని ముద్రిస్తారా? లేక మార్పులేమైనా చేస్తారా? అనేది ఇంకా తెలియరాలేదు. సోషల్ మీడియా చిత్రాన్ని ట్రంప్ అభిమానులు రూపొందించి ఉంటారని తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం చూస్తే ప్రస్తుతం పదవిలో ఉన్న అధ్యక్షుడు లేదా జీవించి ఉన్న మాజీ అధ్యక్షుడి చిత్రాన్ని నాణెంపై ముద్రించడానికి వీల్లేదు. మరణించాక రెండేళ్ల తర్వాత మాత్రమే ముద్రించవచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్ చిత్రంతో ప్రత్యేక కాయిన్ తీసుకురావాలని మింట్ నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా కాంగ్రెస్ ఇటీవల కాయిన్ రీడిజైన్ యాక్ట్‌ను ఆమోదించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఒక డాలర్ నాణెన్ని ముద్రించడానికి ట్రెజరీకి అనుమతి మంజూరు చేసింది. 2026 జనవరి 1 నుంచి ఏడాది కాలంపాటు ఒక డాలర్ నాణెలను ముద్రించవచ్చని పేర్కొంది. అయితే, వీటిపై జీవించి ఉన్న లేదా మరణించిన వ్యక్తుల తల గానీ, భుజం గానీ, భుజం పైభాగం నుంచి జట్టు వరకు గానీ ఉండడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. అయితే, చట్టాన్ని ఉల్లంఘించని విధంగా ట్రంప్ చిత్రంతో కొత్త కాయిన్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. తుది డిజైన్‌ను ట్రెజరీ ఇంకా ఆమోదించలేదని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పదవిలో ఉండగానే అమెరికా నాణెంపై చోటు దక్కించుకున్న ఏకైక అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్. 1926లో ఆయన చిత్రంతో కాయిన్ ముద్రించారు. -
కరుణానిధి స్మారక రూ.100 నాణెం విడుదల
సాక్షి, చెన్నై: డీఎంకే దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి స్మారక రూ.100 నాణేన్ని ఆదివారం చెన్నైలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. మొదటి నాణేన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అందుకున్నారు. డీఎంకే ప్రభుత్వం ఏడాది పొడవునా కరుణానిధి శత జయంతి ఉత్సవాలను జరిపింది. ఆయన ముఖచిత్రంతో కూడిన రూ.100 నాణేన్ని కేంద్రం విడుదల చేసింది. ఆదివారం చెన్నై కలైవానర్ అరంగంలో జరిగిన వేడుకలో ఈ నాణేన్ని విడుదల చేశారు. కరుణ జీవిత ప్రస్థానంతో రూపొందించిన 7డీ టెక్నాలజీ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. -
రూ.75 నాణెం విడుదల.. కొత్త కాయిన్ ఇలా పొందండి..
Rs 75 coin: భారత పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (మే 28) 75 రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఈ కాయిన్‌ను విడుదల గురించి మొదటగా గురువారం (మే 25) విడుదల చేసిన నోటిఫికేషన్లో కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా 75 రూపాయల స్మారక నాణేన్ని టంకశాలలో తయారు చేస్తున్నట్లు తెలిపింది. కొత్త కాయిన్ ఎక్కడ లభిస్తుంది? ప్రత్యేక సందర్భాల్లో వివిధ డినామినేషన్లలో విడుదల చేసే కాయిన్లు, స్మారక నాణేలు నేరుగా చలామణిలోకి రావు. ఇవి చలామణి కోసం ఉద్దేశించినవి కావు. ఈ స్మారక నాణేలు కావాలంటే సెక్యూరిటీస్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ దానికి సంబంధించి పేర్కొన్న ధరను చెల్లించి ఆ కాయిన్లు పొందవచ్చు. అటువంటి నాణేలు కేవలం సేకరించదగినవిగా మాత్రమే ఉంటాయి. ఎందుకంటే వాటి విలువ వాటి ముఖ విలువకు సమానంగా ఉండకపోవచ్చు. వాటిని వెండి లేదా బంగారం వంటి విలువైన లోహాలతో తయారు చేస్తారు. తాజా విడుదల చేసిన రూ.75 స్మారక నాణెంలో కూడా 50 శాతం వెండి లోహం ఉంది. 2018లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం 100 రూపాయల స్మారక నాణాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. సెక్యూరిటీస్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) వెబ్సైట్లో రూ.5,717కు అందుబాటులో ఉంది. ఈ నాణెంలో 50 శాతం వెండి, మిగిలినవి ఇతర లోహాలు ఉన్నాయి. ప్రముఖ వ్యక్తులకు నివాళులు అర్పించడం, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించడం లేదా కీలకమైన చారిత్రక సంఘటనలకు గుర్తుకు దేశంలో 1960ల నుంచి స్మారక నాణేలను విడుదల చూస్తున్నారు. Hon'ble Prime Minister Shri @narendramodi releases the commemorative Rs 75 coin in the new Parliament during the inauguration ceremony. #MyParliamentMyPride pic.twitter.com/BpFmPTS5sT — NSitharamanOffice (@nsitharamanoffc) May 28, 2023 ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్ డెడ్‌లైన్: ఖాతాదారులకు బ్యాంకుల అలర్ట్.. -
రూ.75 స్మారక నాణెం విడుదల చేసిన ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) 75 వ వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేశారు. ఎఫ్ఏవో తో భారతదేశానికి ఉన్న దీర్ఘకాల సంబంధాన్ని గుర్తుచేస్తూ స్మారక నాణాన్ని శుక్రవారం విడుదల చేశారు.ప్రత్యేకమైన ఈ కాయిన్ ప్రజలకు అందుబాటులో ఉండదు. ఎఫ్ఏఓ , ‘సాహీ పోషన్ దేశ్ రోషన్’ అనే హిందీలో ఉంటుంది.అలాగేే నేడు ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఇటీవల అభివృద్ధి చేసిన 17 రకాల బయోఫోర్టిఫైడ్ పంటలను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గెల్చుకోవడం గొప్ప విషయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆహార సరఫరా విషయంలో భారత పాత్ర, భాగస్వామ్యం చరిత్రాత్మకమైందన్నారు. బలహీన వర్గ ప్రజలను , ఆర్థికంగా, పౌష్టికంగా బలంగా మార్చడంలో ఎఫ్ఏఓ ప్రయాణం అసమానమైనదన్నారు. 2016 లో అంతర్జాతీయ పప్పుధాన్యాలు సంవత్సరంగా ప్రకటించిన సంస్థ, 2023 ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ప్రకటించిందని, దీనికి భారత మద్దతు పూర్తిగా ఉంటుందని ప్రధాని మోదీ వెల్లడించారు. -
జంషెట్జీ టాటా స్మారక నాణేలు విడుదల
న్యూఢిల్లీ: జంషెట్జీ టాటా గౌరవార్థం స్మారక నాణేలను(రూ.100, రూ.5) ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విడుదల చేశారు. ఆధునిక భారత పరిశ్రమ పితామహుడిగాప్రాచుర్యం పొందిన జంషెట్జీ టాటా 175 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నాణేలను రూపొందించారు. భారత ప్రభుత్వం ఒక పారిశ్రామికవేత్త జ్ఞాపకార్థం స్మారక నాణేలను విడుదల చేయడం ఇదే మొదటిసారి. జంషెట్జీ ఎలాంటి అధికారం లేకుండానే చరిత్ర సృష్టించారని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రశంసించారు. పర్యావరణ అనుకూల ఇంధనాల కోసం ఆయన ప్రయత్నాలు చేశారని, టాటా గ్రూపు ఉద్యోగుల సంక్షేమం కోసం ఇతోధికంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టాటా సన్స్ చైర్మన్ సైరస్ పి. మిస్త్రీ తదితరులు పాల్గొన్నారు. గుజరాత్‌లోని నవసారిలో 1839, మార్చి 3న జన్మించిన జంషెట్జీ 1868లో టాటా గ్రూప్‌ను స్థాపించారు. -
రూ.60, రూ.10 స్మారక నాణేల విడుదల
పీచు అభివృద్ధి సంస్థ వజ్రోత్సవాల వేళ విడుదల చేసిన టంకశాల సేకరించిన అమలాపురంవాసులు అమలాపురం: పీచు అభివృద్ధి సంస్థ (కాయర్ బోర్డు) ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయి వజ్రోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ముంబైలోని టంకశాల రూ.10, రూ.60 స్మారక నాణేలను విడుదల చేసింది. వీటిని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం భూపయ్య అగ్రహారానికి చెందిన నాణేల సేకర్తలు పుత్సా కృష్ణకామేశ్వర్, ఎస్బీఐ ఉద్యోగి ఇవటూరి రవి సుబ్రహ్మణ్యం సేకరించారు. ఈ నాణేలకు ఒకవైపు కొబ్బరిపీచు, చిప్ప ముద్రించారు. రూ.10 నాణెం మధ్యభాగాన్ని రాగి, నికెల్‌తోను, చుట్టూ అల్యూమినియం, ఇత్తడితో తయారు చేశారు. 35 గ్రాముల బరువున్న రూ.60 నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, చెరో ఐదు శాతం నికెల్, జింక్ ఉపయోగించి తయారు చేశారు. 1859లో ఇద్దరు అమెరికన్ జాతీయులు మన దేశంలోనే తొలిసారిగా కేరళలోని అలెప్పీలో కొబ్బరిపీచు పరిశ్రమ స్థాపించారు. తరువాత ఎంతోమంది యూరోపియన్లు అలెప్పీలో పీచు పరిశ్రమలు ఏర్పాటు చేసి, వేలమందికి ఉపాధి కల్పించారు. దేశ స్వాతంత్య్రానంతరం వారంతా తమ దేశాలకు తరలిపోగా, కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి 1953లో పీచు అభివృద్ధి సంస్థను నెలకొల్పాయి. దీని ఆధ్వర్యంలో దేశంలోని 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించిన కొబ్బరిపీచు పరిశ్రమ సుమారు ఏడులక్షల మందికి జీవనోపాధి కల్పిస్తోంది. గత ఆరు దశాబ్దాల్లో సంస్థ చేసిన సేవలకు గుర్తింపుగా ముంబైలోని టంకశాల ఈ స్మారక నాణేలు విడుదల చేసినట్టు పుత్సా కామేశ్వర్ తెలిపారు.