ట్రంప్‌ నాణెంపై వివాదం | Donald Trump face on America 250th Independence Day | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ నాణెంపై వివాదం

Oct 6 2025 5:56 AM | Updated on Oct 6 2025 5:56 AM

Donald Trump face on America 250th Independence Day

వచ్చే ఏడాది అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం 

ట్రంప్‌ చిత్రంతో స్మారక నాణెం ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయం 

సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైన నమూనా కాయిన్‌ 

పదవిలో ఉన్న అధ్యక్షుడి చిత్రంతో నాణెం ముద్రించడం చట్టవిరుద్ధమే

వాషింగ్టన్‌: ప్రపంచంలో నేడు అగ్రరాజ్యంగా గౌరవం అందుకున్న అమెరికాకు 1776 జూలై 4న బ్రిటిష్‌ పాలన నుంచి స్వాతంత్య్రం లభించింది. స్వతంత్ర అమెరికాకు వచ్చే ఏడాది నాటికి 250 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక వేడుకలకు అమెరికా ఇప్పటినుంచే సిద్ధమవుతోంది. ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్మారక నాణేన్ని ముద్రించి విడుదల చేయాలని యునైటెడ్‌ స్టేట్స్‌ మింట్‌(టంకశాల) నిర్ణయించింది. 

ఒక డాలర్‌ విలువ కలిగిన ఈ నాణెంపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిత్రాన్ని ముద్రిస్తారన్న ప్రచారం మొదలైంది. అయితే, చాలామంది ఈ విషయం నమ్మలేదు. ట్రంప్‌తో కూడిన నమూనా నాణెం చిత్రాన్ని యూఎస్‌ ట్రెజరీ విడుదల చేయడంతో అనుమానాలకు తెరపడింది. ట్రంప్‌ ముఖం కలిగిన ఒక డాలర్‌ కాయిన్‌ రావడం అనేది ఫేక్‌ న్యూస్‌ కాదని, ముమ్మాటికీ నిజమని ట్రెజరర్‌ బ్రాండన్‌ బీచ్‌ పేర్కొన్నారు. 

ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. నమూనా నాణెం సోషల్‌ మీడియాలో ఇప్పటికే వైరల్‌గా మారింది. అమెరికా స్వతంత్ర దేశంగా మారి 250 ఏళ్లు పూర్తికానుండడం ప్రాధాన్యత కలిగిన సందర్భమని, అందుకే తమ అధ్యక్షుడి చిత్రంతో కూడిన స్మారక నాణేన్ని విడుదల చేయబోతున్నామని స్పష్టంచేశారు. దీనిపై త్వరలో మరిన్ని వివరాలు పంచుకుంటానని పేర్కొన్నారు. 

నాణెంపై ట్రంప్‌ పోరాట పటిమ 
కొత్త నాణెంపై అమెరికాలో చర్చ మొదలైంది. నమూనా నాణెంపై ఒక వైపు ట్రంప్‌ ముఖం కనిపిస్తోంది. పైభాగంలో లిబర్టీ (స్వేచ్ఛ) అనే పదం ముద్రించారు. కిందిభా గంలో ఇన్‌ గాడ్‌ వుయ్‌ ట్రస్ట్‌(మనం నమ్మే దేవుడి సాక్షిగా) అనే పదాలు కనిపిస్తున్నా యి. మధ్యలో 1776, 2026 సంవత్సరాలను ముద్రించారు. ఇక రెండోవైపు ట్రంప్‌ పిడికిలి బిగించిన చిత్రం ఉంది. గత ఏడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసింది. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. తాను పోరాటం ఆపబోనని పిడికిలి బిగించి నినదించారు. ఈ సందర్భాన్ని గుర్తుచేస్తూ నాణెంపై ఫైట్, ఫైట్, ఫైట్‌ అనే పదాలకు స్థానం కల్పించారు. అంతేకాకుండా ట్రంప్‌ వెనుకభాగంలో రెపరెపలాడుతున్న అమెరికా జాతీయ జెండా కనిపిస్తోంది.    

కాయిన్‌ రీడిజైన్‌ చట్టానికి ఆమోదం 
సోషల్‌ మీడియాలో కనిపిస్తున్న ఈ నాణెన్ని ముద్రిస్తారా? లేక మార్పులేమైనా చేస్తారా? అనేది ఇంకా తెలియరాలేదు. సోషల్‌ మీడియా చిత్రాన్ని ట్రంప్‌ అభిమానులు రూపొందించి ఉంటారని తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం చూస్తే ప్రస్తుతం పదవిలో ఉన్న అధ్యక్షుడు లేదా జీవించి ఉన్న మాజీ అధ్యక్షుడి చిత్రాన్ని నాణెంపై ముద్రించడానికి వీల్లేదు. మరణించాక రెండేళ్ల తర్వాత మాత్రమే ముద్రించవచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ చిత్రంతో ప్రత్యేక కాయిన్‌ తీసుకురావాలని మింట్‌ నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. 

అమెరికా కాంగ్రెస్‌ ఇటీవల కాయిన్‌ రీడిజైన్‌ యాక్ట్‌ను ఆమోదించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఒక డాలర్‌ నాణెన్ని ముద్రించడానికి ట్రెజరీకి అనుమతి మంజూరు చేసింది. 2026 జనవరి 1 నుంచి ఏడాది కాలంపాటు ఒక డాలర్‌ నాణెలను ముద్రించవచ్చని పేర్కొంది. అయితే, వీటిపై జీవించి ఉన్న లేదా మరణించిన వ్యక్తుల తల గానీ, భుజం గానీ, భుజం పైభాగం నుంచి జట్టు వరకు గానీ ఉండడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. అయితే, చట్టాన్ని ఉల్లంఘించని విధంగా ట్రంప్‌ చిత్రంతో కొత్త కాయిన్‌ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. తుది డిజైన్‌ను ట్రెజరీ ఇంకా ఆమోదించలేదని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పదవిలో ఉండగానే అమెరికా నాణెంపై చోటు దక్కించుకున్న ఏకైక అధ్యక్షుడు కాల్విన్‌ కూలిడ్జ్‌. 1926లో ఆయన చిత్రంతో కాయిన్‌ ముద్రించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement