లోన్ చెల్లించినా.. డాక్యుమెంట్స్ ఇవ్వని బ్యాంక్! | Home Loan Repaid But Documents Missing SBI Ordered to Pay Compensation | Sakshi
Sakshi News home page

లోన్ చెల్లించినా.. డాక్యుమెంట్స్ ఇవ్వని బ్యాంక్!

Nov 22 2026 1:26 PM | Updated on Nov 22 2026 1:47 PM

Home Loan Repaid But Documents Missing SBI Ordered to Pay Compensation

బ్యాంకులో లోన్ తీసుకుని.. పూర్తిగా చెల్లించిన తర్వాత, సంబంధిత పత్రాలను తిరిగి ఇవ్వడం బ్యాంకు బాధ్యత. అయితే.. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఒక వ్యక్తికి ఏకంగా ఏడేళ్ల పాటు.. ఆయన ఇంటి అసలు రిజిస్ట్రేషన్ పత్రాలను తిరిగి ఇవ్వలేదు. దీంతో విసిగిపోయిన ఆ వృద్ధుడు చివరకు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈ కేసును విచారించిన అలీగఢ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. బ్యాంకు నిర్లక్ష్యంపై తీవ్రంగా స్పందించింది. ఇంటి అసలు పత్రాలను వెంటనే తిరిగి ఇవ్వాలని, ఆలస్యం చేసినందుకు రోజుకు రూ.5,000 చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

నో డ్యూస్ సర్టిఫికెట్ జారీ..
అలీగఢ్‌లోని జ్ఞాన్ సరోవర్ కాలనీకి చెందిన 70 ఏళ్ల గుల్వీర్ సింగ్ చౌహాన్.. 1997లో ఎస్‌బీఐ బరద్వారీ సిటీ బ్రాంచ్‌లో హోమ్ లోన్ తీసుకున్నారు. దీనికోసం రిజిస్టర్ చేసిన తన ఇంటి అసలు సేల్ డీడ్‌ను బ్యాంకులో జమ చేశారు. అయితే.. ఆయన 2019 మే 13న తీసుకున్న లోన్ పూర్తిగా తిరిగి చెల్లించారు. దీనికి సంబంధించి బ్యాంకు నో డ్యూస్ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. అయినప్పటికీ ఆయనకు అసలు ఇంటి పత్రాలను తిరిగి ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా పత్రాలు కనిపించడం లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అసలు ఆస్తి పత్రాలు లేకపోవడంతో.. గుల్వీర్ సింగ్‌కు తన ఇంటి యాజమాన్యాన్ని నిరూపించుకోవడం, ఆస్తిని ఇతరులకు బదిలీ చేయడం వంటి పనుల్లో సమస్యలు ఎదురయ్యాయి. అంతేకాకుండా.. మరో బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలన్నా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆయన 2023 జూన్ 13న వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.

బ్యాంకు తీరుపై విచారణ.. పరిహారం
విచారణ సమయంలో ఎస్‌బీఐ ఆయన లోన్ తీసుకున్న విషయాన్ని, అసలు డాక్యుమెంట్స్ బ్యాంకులో జమ చేసిన విషయాన్ని అంగీకరించినప్పటికీ, ఆయన ఫిర్యాదును వ్యతిరేకించింది. అయితే.. 2020 ఫిబ్రవరి 13న బ్యాంకు జారీ చేసిన లేఖను పరిశీలించిన కమిషన్, 2019 మే 13నే రుణ ఖాతా పూర్తిగా మూసివేసినట్లు నిర్ధారించింది.

ఈ కేసును విచారించిన కమిషన్ చైర్మన్ హస్నైన్ ఖురేషీ, సభ్యురాలు పూర్ణిమా సింగ్ రాజ్‌పుత్‌లతో కూడిన ధర్మాసనం బ్యాంకు తీరును తప్పుబట్టింది. లోన్ మొత్తం చెల్లించిన తర్వాత కూడా అసలు ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వకపోవడం సేవల్లో లోపంగా పరిగణించింది.

కాబట్టి.. గుల్వీర్ సింగ్‌కు సంబంధించిన అసలు సేల్ డీడ్‌ను వెంటనే తిరిగి ఇవ్వాలని, 2019 మే 13 నుంచి పత్రాలు అందజేసే వరకు రోజుకు రూ.5,000 చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతే కాకుండా.. కేసు ఖర్చుల కోసం మరో రూ.10,000 చెల్లించాలని, 45 రోజుల్లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఆదేశాలను పాటించకపోతే వినియోగదారుల రక్షణ చట్టంలోని సెక్షన్ 72 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement