పోటాపోటీగా గోల్డ్ లోన్‌లు చేసిన సంస్థలు ఇప్పుడు డబ్బుల రికవరీపై దృష్టి సారిస్తున్నాయి. అనూహ్యంగా ధరలు పెరగడంతో కొత్త లోన్‌లతోపాటు పోటీ సంస్థల్లో ఉన్న బంగారాన్ని సైతం టేకోవర్ చేస్తూ డబ్బులు ఇచ్చారు. ఎంత వేగంగా ధర పెరిగిందో ఇప్పుడు అంతే వేగంగా పడిపోవడంతో గోల్డ్ లోన్ సంస్థలు ఆలోచనలో పడ్డాయి. తాకట్టు పెట్టిన బంగారం విలువ కూడా తగ్గిపోయింది. దీంతో తగ్గిన మొత్తాన్ని చెల్లించాలని రుణగ్రహీతలకు బ్యాంకులు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి.
2025 జనవరిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 80 వేలు ఉండగా.. 2026 జనవరి, ఫిబ్రవరిలో రూ.లక్షా 80 వేలకుపైగా పెరిగింది. అదే సమయంలో చాలా మంది రైతులు, చిన్న వ్యాపారులు, మహిళలు తమ బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకున్నారు. జిల్లాలో శనివారం నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,28,000కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,17,760కు పడిపోయింది. అంటే ఈ ఏడాది జనవరి నాటి గరిష్ట ధరతో పోలిస్తే 10 గ్రాములకు దాదాపు రూ.50 వేలకు పైగా తగ్గింది.
ఎల్‌టీవీ సమస్య ఏమిటి?
బ్యాంకులు బంగారం విలువలో 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే రుణం ఇస్తాయి. దీన్నే ఎల్‌టీవీ (లోన్ టు వాల్యూ) అంటారు. ధర తగ్గగానే ఈ నిష్పత్తి దెబ్బతింటుంది. ఉదాహరణకు, ధర ఎక్కువగా ఉన్నప్పుడు రూ.15 లక్షల విలువైన బంగారంపై రూ. 11.25 లక్షల రుణం తీసుకున్నారనుకుంటే.. ఇప్పుడు అదే బంగారం విలువ రూ.12 లక్షలకు పడిపోతే, తీసుకున్న రుణం మొత్తం బంగారం విలువలో 93 శాతం అవుతుంది. నిబంధనల ప్రకారం అది 70 నుంచి 80 శాతం లోపే ఉండాలి. బ్యాంకులు, ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలు ఆ తేడా మొత్తాన్ని కట్టమని లేదా మరికొంత బంగారం తాకట్టు పెట్టమని నోటీసులు ఇస్తున్నాయి. దీన్నే మార్జిన్ కాల్ అంటారు.
ధర బాగున్నప్పుడు బ్యాంకు వాళ్లే పిలిచి మరీ ఎక్కువ లోన్ తీసుకోమన్నారని, ఇప్పుడు తగ్గిన బంగారం ధరను లెక్కిస్తూ డబ్బులు కట్టాలని ఫోన్ చేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకువచ్చి కడుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళన చెందొద్దు
ధర తగ్గినప్పుడు ఆందోళన చెంది బంగారాన్ని వదిలేయొద్దు. కొంత పార్ట్ పేమెంట్ చేసినా, 2, 3 గ్రాముల బంగారం అదనంగా పెట్టినా ఎల్‌టీవీ మళ్లీ సర్దుకుంటుంది. వేలం వరకు వెళ్లనీయకుండా బ్యాంకుతో మాట్లాడుకోవడం మంచిది. – సుంకం వీర గణేశ్‌చారి, గోల్డ్ అప్రైజర్, ఆర్మూర్
నిర్లక్ష్యం చేయొద్దు
బ్యాంకు నుంచి నోటీసు వస్తే నిర్లక్ష్యం చేయొద్దు. గడువులోగా బ్రాంచ్‌కు వెళ్లి మాట్లాడండి. మొత్తం కట్టలేకపోయినా, కొంత మొత్తం చెల్లించి గడువు కోరండి. నోటీసుకు సమాధానం ఇవ్వకపోతే బ్యాంకులు బంగారాన్ని వేలం వేసే అవకాశం ఉంటుంది. – ఎం సుభాష్ చందర్, గోల్డ్ అప్రైజర్, ఆర్మూర్


