జేఎన్‌టీయూహెచ్‌లో నాసిరకంగా సైబర్ సెక్యూరిటీ బోధన
ప్రాక్టికల్ శిక్షణ లేక విద్యార్థుల్లో నైపుణ్యాల కొరత
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా లేని సిలబస్
భవిష్యత్తు ఉద్యోగావకాశాలకు దూరమయ్యే ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక రంగంలో పెను మార్పులకు నాంది పలుకుతున్న క్వాంటం కంప్యూటింగ్.. భవిష్యత్తు సైబర్ భద్రతకు అతిపెద్ద సవాలుగా మారనుంది. ప్రపంచ దేశాలన్నీ ఈ అత్యాధునిక పరిజ్ఞానంపై దృష్టి సారిస్తుంటే, తెలంగాణ ఇంజనీరింగ్ విద్యలో మాత్రం ఈ సిలబస్ పుస్తకాలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జేఎన్‌టీయూహెచ్ సిలబస్‌లో ‘క్వాంటం’కు చోటు కల్పించినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రత్యేక ల్యాబ్‌లు, అడ్వాన్స్‌డ్ టీచింగ్, ప్రయోగాత్మక శిక్షణ సరిగా లేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఆఖరి ఏడాదిలోనే సబ్జెక్టులు..
జేఎన్‌టీయూహెచ్‌లో సీఎస్‌ఈ (సైబర్ సెక్యూరిటీ) సిలబస్‌లో నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో నామమాత్రంగా క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం క్రిప్టోగ్రఫీ సబ్జెక్టులు ఉన్నాయి. అయితే ఇవి ఎలక్టివ్ కోర్సులు కావడంతో విద్యార్థులందరికీ ఈ అంశాలపై శిక్షణ అందుతుందనే హామీ లేదు.
ఫస్టియర్‌లో అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్‌లో క్వాంటం కంప్యూటింగ్ ప్రాథమిక అంశాలను పరిచయం చేస్తున్నప్పటికీ లోతైన నైపుణ్యాల అభివృద్ధికి సరిపోదు. క్యూబిట్స్, క్వాంటం గేట్స్, అల్గారిథమ్‌లపై ప్రయోగాలు, వివిధ రకాల టూల్స్‌తో ప్రోగ్రామింగ్, పోస్ట్ క్వాంటం క్రిప్టోగ్రఫీ అమలుపై ప్రాక్టికల్ శిక్షణ అవసరం. ఇందుకు ప్రత్యేక ల్యాబ్‌లు, నైపుణ్యం కలిగిన అధ్యాపకులు ఉండాలి. కానీ కాలేజీల్లో ఈ సదుపాయాలు లేవనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై సమగ్ర క్షేత్రస్థాయి పరిశీలన అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


