దక్కన్ పీఠభూమిలో కరువు తీవ్రతను తగ్గించాలంటే సూక్ష్మ వాతావరణపరిస్థితులను మెరుగుపరచాలి
పచ్చదనం, నేలలో తేమ, చెరువులు, చిన్న నీటివనరుల పునరుద్ధరణ కీలకం
తెలంగాణలో నీటి భద్రతపై సమగ్ర ఆలోచన అవసరం..
సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్
‘తెలంగాణలో ఏళ్ల నాటి సంప్రదాయ గొలుసుకట్టు చెరువులు, కుంటలు నీటి సంరక్షణ, నీటిపారుదల విధానాలు ధ్వంసమైపోయాయి. మిషన్ భగీరథ, ఇతర మెగా ప్రాజెక్టులున్నా ప్రజల భాగస్వామ్యంతో సుస్థిర, వికేంద్రీకృత చెరువులు, కుంటల నిర్వహణ, స్థానిక నీటి యాజమాన్య విధానాలతోనే మార్పు సాధ్యం అవుతుంది. నదుల పునరుజ్జీవానికి చెరువులు, కుంటల వికేంద్రీకృత యాజమాన్య విధానాలే శరణ్యం’అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెసె పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్రసింగ్ తెలిపారు.
చెరువులు, కుంటలు, అడవులు, కొండలు, నదులు, నేలలో తేమ.. వాటన్నింటినీ ఒక సమగ్ర వ్యవస్థగా పునరుద్ధరించాలని.. దీన్నే మైక్రో క్లైమేట్ పునరుద్ధరణగా పిలుస్తారని వివరించారు. దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో కరువు తీవ్రతను తగ్గించాలంటే స్థానిక సూక్ష్మ వాతావరణ పరిస్థితులను మెరుగుపరచాలని సూచించారు. ఇందుకు పచ్చదనం, నేలలో తేమ, చెరువులు, చిన్న నీటివనరుల పునరుద్ధరణే కీలకమన్నారు.
ప్రతి గ్రామంలో స్థానిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా చెట్ల పెంపకం, చెరువుల పునరుద్ధరణ, కాంటూర్ బండ్లు, ఫార్మ్ పాండ్లు, వర్షపు నీటిసంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టడమే అసలైన పరిష్కారమన్నారు. ప్రస్తుతం తె లంగాణ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యల గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజేంద్రసింగ్ కీలకాంశాలు వెల్లడించారు.
ప్రస్తుత కరువు సమస్యను ఎలా అధిగమించాలి?
ప్రపంచ వాతావరణ మార్పుల వల్ల ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్తాన్ తదితర రాష్ట్రాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. అయితే ఈ సమస్యకు ప్రజల భాగస్వామ్యంతో కూడిన వికేంద్రీకృత నీటి నిర్వహణ పరిష్కారం చూపగలుగుతుంది. గత 52 ఏళ్లుగా నేను పనిచేస్తున్న ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల ప్రభావమే కనిపించలేదు. భూగర్భజలాల సంరక్షణ పూర్తిస్థాయిలో జరగడంతో అవసరమైనపుడు ఎక్కడి నుంచైనా నీటిని తీసుకొనే వీలు ప్రజలకు కలిగింది. రాజస్తాన్‌లో నేను పనిచేస్తున్న 10,800 చ.కి.మీ. పరిధిలో వర్షాభావం లేదా వరదల వంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు.
తెలంగాణకు తక్షణ ఉపశమనంతోపాటు దీర్ఘకాలిక జలవిధానాన్ని ఎలా రూపొందించాలి?
రాష్ట్రంలో 365 మండలాలు కరువు ప్రభావాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితిలో ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యం తాగునీటి భద్రత కావాలి. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి అవసరాలను ముందుగా అంచనా వేసి అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థంగా వినియోగించాలి. అత్యవసర ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, పాడైన బోర్లు, పైపులైన్ల మరమ్మతులు, నీటి లీకేజీల నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
విద్యుత్ సరఫరా, తాగునీటి పంపిణీ, ఆసుపత్రులు, వ్యవసాయం వంటి కీలక రంగాలకు ప్రత్యేక కార్యాచరణ ఉండాలి. భారీ ప్రాజెక్టులతోపాటు దీర్ఘకాలిక లక్ష్యం కింద గ్రామీణ చెరువుల వ్యవస్థను బలోపేతం చేయాలి. పూడికతీత, కాలువలకు మరమ్మతులు, ఆక్రమణల తొలగింపు, చెరువు పరీవాహక ప్రాంతాల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. చెరువులు నీటిని స్థానికంగా నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచుతాయి.
నీటి సంరక్షణలో మనం ఎక్కడ విఫలం అవుతున్నాం?
భూగర్భం నుంచి నీటిని వెలికితీయడంలో దేశం అద్భుత సాంకేతికతను సాధించింది. లోతైన బోర్లు, భారీ పంపులు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించగలుగుతున్నాం. కానీ భూమిలోకి నీటిని తిరిగి చేర్చడంలో, సహజ జలవనరులను పునరుద్ధరించడంలో అదే స్థాయిలో శ్రద్ధ చూపట్లేదు. ఇదే నీటి నిర్వహణలో ప్రాథమిక లోపం. జలాశయాలు ఎండిపోతున్నప్పుడు మరింత లోతుగా బోర్లు వేయడం తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా భవిష్యత్తులో తాగునీటి సమస్య మరింత తీవ్రం అవుతుంది.
అందుకే గ్రామ స్థాయిలో భూగర్భ జలాల లెక్కలు నిర్వహించాలి. ప్రతి గ్రామంలో జలసంఘాలు ఏర్పాటు చేసి బోర్ల వినియోగంపై సామూహిక నిర్ణయాలు తీసుకోవాలి. గ్రామంలోని బోర్ల సంఖ్య, నీటి మట్టాలు, సాగు విస్తీర్ణం, నీటి వినియోగంపై ప్రజలే చర్చించాలి. కొత్త బోర్లకు అనుమతులు, నీటి పంపిణీ, పంటల ఎంపికపై నిర్ణయాలు తీసుకోవాలి. భూగర్భ జలాలు వ్యక్తిగత ఆస్తి మాత్రమే కాదు.. సామూహిక సహజ వనరు అనే అవగాహన పెరగాలి.
హైదరాబాద్‌లో నెలకొన్న నీటి సమస్యను ఎలా ఎదుర్కోవాలి?
ప్రస్తుత పరిస్థితి ఏర్పడటానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న అస్తవ్యస్త నీటి నిర్వహణ, భూగర్భ జలాల విచ్చలవిడి వినియోగం, చెరువుల విధ్వంసం ప్రధాన కారణాలు. ఇప్పటికైనా హైదరాబాద్ నగర నీటి భద్రత విషయంలో అప్రమత్తం కావాలి. ఒకవైపు నగరానికి దూర ప్రాంతాల నుంచి నీటిని తరలించే పథకాలపై ఆధారపడుతున్నాం. మరోవైపు నగరంలోని చెరువులు, కుంటలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. జలవనరులపై ఒత్తిడి పెరిగినప్పుడు ప్రత్యామ్నాయ నీటి వనరుల అవసరం అనివార్యమవుతుంది.
అందుకే నగరంలోని మిగిలిన చెరువులను కాపాడటం అత్యవసరం. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లను పటిష్టంగా రక్షించాలి. చెరువులను పునరుద్ధరిస్తే భూగర్భ జలాల పెరుగుదలతోపాటు స్థానిక ఉష్ణోగ్రతల నియంత్రణ, జీవవైవిధ్య పరిరక్షణకు కూడా మేలు జరుగుతుంది. చెరువులు, పచ్చదనం, నేలలో తేమే కరువు నివారణకు అసలైన ఆయుధాలు. ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టుకోవాలి.
కె. రాహుల్


