పెట్రోలింగ్ వాహనాలపై ప్రత్యేక కెమెరాల ఏర్పాటు
వాటి ద్వారా లోపాలు గుర్తించి కాంట్రాక్టర్ దృష్టికి...
తెలంగాణలో 1,800 కి.మీ. ఎన్‌హెచ్‌ఏఐ రోడ్లపై అమలు
2,239 లోపాల గుర్తింపు...1,983 పరిష్కారం..
దేశంలోనే తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై ఎక్కడ ఏ లోపం ఉందో గుర్తించి వెంటనే సరిదిద్దేందుకు ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టిన కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థ డాష్‌కామ్ అనలిటిక్స్ సరీ్వస్ సత్ఫలితాలిస్తోంది. ఈ విధానంలో హైవేలపై నిత్యం గస్తీ తిరిగే ఎన్‌హెచ్‌ఏఐ రూట్ వాహనాల డ్యాష్‌బోర్డ్/విండ్‌షీల్డ్ వద్ద ఉండే హైరిజల్యూషన్ స్మార్ట్ డాష్‌క్యామ్‌లు రోడ్లను ఆసాంతం హై రిజల్యూషన్‌తో వీడియో తీస్తాయి. ఈ వీడియోలన్నీ నేరుగా ఎన్‌హెచ్‌ఏఐ డేటాలో అప్‌లోడ్ అవుతాయి. అక్కడి ఏఐ ఆధారిత మెషీన్ లెరి్నంగ్ సాఫ్ట్‌వేర్ ఆ దృశ్యాలను సెకన్లలో విశ్లేషించి ఎక్కడెక్కడ గుంతలు, పగుళ్లు, ఆక్రమణలు వంటి 30కిపైగా రకాల లోపాలను గుర్తిస్తాయి.
24 గంటల్లోనే కాంట్రాక్టర్లకు అలర్ట్
ఏఐ గుర్తించిన ప్రతి లోపానికి జియో ట్యాగ్ (కచ్చితమైన లొకేషన్)తోపాటు ఒక ప్రత్యేక ఐడీ నంబర్ కేటాయిస్తారు. వీడియో అప్‌లోడ్ అయిన 24 గంటల్లోపే పూర్తి నివేదిక ఆ రోడ్డు నిర్వహణ కాంట్రాక్టర్లకు, ఆ ప్రాంత అధికారులకు చేరుతుంది. నిర్ధారిత లోపాన్ని ఎంత సమయంలో పరిష్కరించాలో కాంట్రాక్టు సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో స్పష్టంగా ఉంటుంది. తాజాగా డాష్‌క్యామ్‌తో గుర్తించిన లోపాన్ని ఎంత సమయంలో పరిష్కరించాలో ఏఐ ఆధారిత వ్యవస్థే పేర్కొంటుంది.
దాన్ని నిర్మాణ సంస్థకు పంపుతారు. సమాచారం అందిన వెంటనే కాంట్రాక్టర్లు గడువులోగా ఆ లోపాన్ని సరిచేయాలి. మరమ్మతు పూర్తయ్యాక ఆ ప్రాంతం ఫొటోలను తీసి తిరిగి సిస్టమ్‌లో అప్‌లోడ్ చేస్తే ఎన్‌హెచ్‌ఏఐ ఇంజనీర్లు వాటిని పరిశీలించి పనులు సంతృప్తికరంగా జరిగాయని నిర్ధారించాకే ఆ ఫిర్యాదులను మూసేస్తారు. ఈ ప్రక్రియలో వారంలో ఒక రోజు చొప్పున నెలలో నాలుగుసార్లు నిర్వహిస్తారు. అందులో ఒకసారి రాత్రివేళ పరిశీలిస్తారు.
నెల రోజులుగా పరిశీలన...
తెలంగాణలోని జాతీయ రహదారులపై ఈ కొత్త వ్యవస్థను నెల రోజులుగా అధికారులు పరిశీలిస్తున్నారు. దేశవ్యాప్తంగా 4 వేల కి.మీ. నిడివిలో ఈ వ్యవస్థ ఏర్పాటు చేయగా తెలంగాణలో టోల్ వ్యవస్థ ఉన్న రోడ్లలో 1,800 కి.మీ. మేర దీన్ని ఏర్పాటు చేశారు. శనివారం వరకు ఈ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,239 లోపాలను గుర్తించింది. వాటిల్లో 1,983 లోపాలు పరిష్కారమయ్యాయి. మిగతావి పెండింగ్‌లో ఉన్నాయి. అమెరికా, చైనా, యూరప్ దేశాల్లో ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ దేశాల సరసన భారత్ చేరింది.
పరిశీలన బాధ్యత ప్రైవేటు కంపెనీకి...
దేశాన్ని ఐదు జోన్లుగా విభజించి ఈ వ్యవస్థ పర్యవేక్షణ బాధ్యతను టెండర్ల ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. దక్షిణాది జోన్‌లో తెలంగాణ ప్రాంత బాధ్యత లాన్‌రిక్స్ అనే సంస్థకు అప్పగించారు. ప్రతి కి.మీ.కి నిర్ధారిత మొత్తాన్ని ఆ సంస్థకు చెల్లిస్తారు. వాహనాలు, సాంకేతిక వ్యవస్థను ఆ సంస్థనే సమకూర్చుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,800 కి.మీ. పరిధిలో ఈ వ్యవస్థ ఏర్పాటు కాగా, భవిష్యత్తులో మిగతా పరిధిలో ఏర్పాటు చేయనున్నారు.
ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సులో ప్రస్తావన...
ప్రస్తుతం హైటెక్స్‌లో జరుగుతున్న ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సులో ఈ ప్రాజెక్టు అంశం ప్రత్యేక చర్చకు వచి్చంది. దీన్ని వేగంగా అన్ని రోడ్లలో విస్తరింపచేసి రోడ్ల లోపాలను తక్షణమే పరిష్కరించి ప్రమాదాలను అరికట్టాలని నిపుణులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థ తెలంగాణలో మెరుగ్గా పనిచేస్తోందని అధికారులు పేర్కొన్నారు.


