గతంలో రెండుసార్లు పెంచిన వేతనాలకు కొత్త జీవోతో గండి
116 మున్సిపాలిటీలు,12 కార్పొరేషన్లలోని 31 వేల మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిలో ఆందోళన
కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.22,750 నుంచి రూ.19,500కు తగ్గింపు
డ్రైవర్ల వేతనం రూ.19,500 నుంచి రూ.16,600కు పరిమితం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలక సంస్థల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం గత జూలైలో జారీ చేసిన ఉత్తర్వులతో 31 వేల మంది ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల హోదా, వేతన తగ్గింపు ఎలాంటి కసరత్తు లేకుండా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. వేతనాల్లో 15 నుంచి 20 శాతం కోత విధించడంతో ఇప్పటికే అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
వేతనాల్లో కోత విధిస్తూ జారీ చేసిన జీవో 1181ను పునఃసమీక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, ప్రోగ్రామర్లు, హార్డ్‌వేర్ ఇంజనీర్లతోపాటు డ్రైవర్లు, హార్టీకల్చర్ ఫీల్డ్ అసిస్టెంట్లు, డీఆర్‌ఎఫ్ బృందాలు, ఎలక్ట్రీíÙయన్లు, హెల్పర్లు, పబ్లిక్ హెల్త్ వంటి విభాగాల్లో 25 హోదాల్లో ఉన్న సుమారు 31 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోత బారిన పడ్డారు.
గతంలో పెంచిన జీతాలు తగ్గించారు
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 12 నగరపాలక సంస్థల్లో వివిధ హోదాలతో వివిధ విభాగాల్లో 31వేల మంది ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. కార్యాలయాల నిర్వహణ, పన్నుల వసూలు, పారిశుధ్యం, ఎలక్ర్టీసిటీ, ప్రజారోగ్యం, తాగునీటి సరఫరా తదితరాల్లో క్షేత్రస్థాయిలో వీరు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరికి 2016లో జీవో 14 ద్వారా, తిరిగి 2021లో జీవో 60 ద్వారా ప్రభుత్వం 30 శాతం చొప్పున రెండు పర్యాయాలు వేతనాలు పెంచింది.
దీంతో కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు, ఇతర సాంకేతిక సిబ్బందికి మెరుగైన వేతనాలు అందాయి. కానీ 2026 జూలై 12న జారీ చేసిన జీవో 1181లో ఉద్యోగుల హోదా, వారికి చెల్లించాల్సిన వేతనాలను పునర్‌నిర్వచించడంతో గతంలో పొందిన ప్రయోజనాలకు గండి పడిందని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు, వైద్య అవసరాలు, పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న తమకు కొత్త జీఓ మరింత భారం పెంచేలా ఉందని ఆందోళన చెందుతున్నారు.
జీవో 1181లో శాస్త్రీయత ఏదీ?
ప్రభుత్వం 2016లో ఇచి్చన జీవో 14 ప్రకారం కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ.17,500, డ్రైవర్‌కు రూ.15,000 వేతనం నిర్ణయించింది. 2021లో జీవో 60 ద్వారా వీటిని 30 శాతం పెంచి వరుసగా రూ.22,750, రూ.19,500 చేసింది. అదే ఏడాది జీవో 63 ద్వారా ఇతర కేటగిరీల వేతనాల సవరణకు మార్గదర్శకాలు ఇచ్చింది. అయితే కొత్త జీవో 1181లో మొత్తం 30,946 సేవలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అయితే ఉద్యోగుల వేతనాలను నిర్ణయించడానికి ఎలాంటి ప్రాతిపదిక అనుసరించారనే అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కొత్త జీవోలో కంప్యూటర్ ఆపరేటర్లను డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా చెబుతూ రూ.19,500, డ్రైవర్లకు రూ.16,600గా నిర్ణయించారు. అంటే కొత్త జీఓ మూలంగా కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.3,250, డ్రైవర్లకు రూ.2,900 మేర నెలవారీ వేతనాల్లో తగ్గుదల కనిపిస్తోంది.
వరంగల్‌లో 519 మంది వేతనాల్లో కోత
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఉదాహరణగా తీసుకుంటే 519 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కొత్త జీవో మూలంగా కోత పడింది. రూ.49500 వేతనంతో నియమితుడైన ఐటీ మేనేజర్ కొత్త జీవో మూలంగా రూ.19500 పొందాల్సి వస్తోంది. అదే తరహాలో హార్టీకల్చర్ అసిస్టెంట్ వేతనం రూ.32500 నుంచి 13500కు, ఆటోక్యాడ్ ఆపరేటర్‌కు రూ.49000 వేతనం నుంచి రూ.13500కు వేతనం చెల్లిస్తున్నారు.
ఇదే తరహాలో 40 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 53 మంది డ్రైవర్లు, 57 మంది పీహెచ్ వర్కర్లు, 85 మంది పారిశుద్ధ్య జవాన్లు, 150 మంది క్షేత్రస్థాయి సిబ్బంది వేతనాల్లోనూ కొత్త జీఓ మూలంగా కోత పడింది. విద్యుత్, తాగునీటి సరఫరా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఇతర సాంకేతిక సిబ్బంది కూడా ఈ జాబితాలో ఉన్నారు.
జీతాల తగ్గింపు అన్యాయం
ఉద్యోగుల కుటుంబాల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు. జీవో 14, 60 ప్రకారం పొందుతున్న వేతన ప్రయోజనాలను కాపాడాలి. ఒకే విధమైన పనులు చేస్తున్న ఉద్యోగులను వేర్వేరు హోదాలతో చూపించి జీతాలు తగ్గించడం శాస్త్రీయమైన విధానం కాదు. జీవో 1181ను పునఃసమీక్షించి వేతనాలు తగ్గకుండా చూడాలి.
–మియాపురం శ్రీకాంత్, అధ్యక్షుడు, మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్
జీవోను పునఃసమీక్షించాలి
అరకొర వేతనాలతో విధులు నిర్వరిస్తున్న మాపై ప్రభుత్వం కొత్త జీవోతో మరింత భారం మోపుతోంది. వేతనాలు పెంచాల్సిందిపోయి తగ్గించడం అన్యాయం. కొత్త జీవోను సమీక్షించి వేతన సవరణ చేయాలి. ఉద్యోగుల అర్హతలు, అనుభవం, బాధ్యతలకు తగిన హోదాలు కొనసాగించాలి.
–పాసికంటి గాయత్రి, కంప్యూటర్ ఆపరేటర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్


