వాహన వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక హెచ్చరిక జారీ చేసింది. సరైన ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించేందుకు ఒక కొత్త టెక్నాలజీ ప్రారంభించింది.
వాహనాలు టోల్ ప్లాజా మీదుగా ప్రయాణించే సమయంలో.. సరైన ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ తీసుకొచ్చిన టెక్నాలజీ.. ఇన్సూరెన్స్ ఉందా?, లేదా? అనే విషయాన్ని ఆటోమేటిక్‌గా చెక్ చేసి, పాలసీ గడువు ముగిసిన వాహన యజమానులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపనున్నారు.
ఢిల్లీలో అమలు
ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఢిల్లీలోని ముండ్కా టోల్ ప్లాజా వద్ద పరీక్షిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఇతర టోల్ ప్లాజాలకు కూడా విస్తరించాలని భావిస్తున్నారు.
ఈ కొత్త టెక్నాలజీ.. వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాహన్ డేటాబేస్‌లో ఉన్న ఇన్సూరెన్స్ సమాచారంతో సరిపోల్చుతుంది. ఈ డేటాబేస్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) నిర్వహిస్తోంది. ఒక వాహనం టోల్ ప్లాజా దాటినప్పుడు దాని నంబర్ ఆధారంగా ఇన్సూరెన్స్ పాలసీ గడువు పరిశీలిస్తారు. ఒకవేళ పాలసీ గడువు ముగిసినట్లు గుర్తిస్తే, కొన్ని నిమిషాల్లోనే వాహన యజమాని మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో.. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, టోల్ ప్లాజా దాటిన తేదీ, సమయం, ఇన్సూరెన్స్ గడువు ముగిసిన తేదీ వంటి వివరాలు ఉంటాయి.
కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్
వాస్తవానికి భారతదేశంలో ప్రజా రహదారులపై తిరిగే ప్రతి మోటారు వాహనానికి కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం.. ప్రమాదం జరిగినప్పుడు ఎదుటివారికి గాయాలు కావడం, మరణం సంభవించడం లేదా వారి ఆస్తులకు నష్టం కలగడం వంటి సందర్భాల్లో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పరిహారం చెల్లించేందుకు ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరం. అందువల్ల వాహనదారులు తమ పాలసీ గడువును ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం అవసరం.
పట్టుబడితే.. రూ.10 వేలు ఫైన్!
ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడుపుతూ.. పట్టుబడితే జరిమానాలు కూడా విధిస్తారు. మొదటిసారి నిబంధన ఉల్లంఘిస్తే వాహనానికి వర్తించే బేస్ ప్రీమియానికి మూడు రెట్లు లేదా రూ.5,000.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు. రెండోసారి లేదా ఆ తర్వాత కూడా అదే తప్పు చేస్తే బేస్ ప్రీమియానికి ఐదు రెట్లు లేదా రూ.10,000.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం టోల్ ప్లాజాల వద్ద SMS వస్తుందనే విషయమే కాకుండా, చట్టపరమైన జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కూడా ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
దేశవ్యాప్తంగా ఎప్పుడంటే..
ప్రస్తుతం ఈ విధానం ఢిల్లీలోని ముండ్కా టోల్ ప్లాజా వద్ద మాత్రమే ప్రయోగాత్మకంగా అమలవుతోంది. దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయంపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక సమాచారం అందించలేదు. ముందుగా ప్రయోగ ఫలితాలను పరిశీలించిన తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ఇన్సూరెన్స్ గడువు ముగిసిన వాహనాలను గుర్తించడం ప్రభుత్వానికి సులభమవుతుంది. ముఖ్యంగా వాహనదారులు తమ ఇన్సూరెన్స్‌ను నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: గోల్డ్ మార్కెట్ ఢమాల్.. రికార్డు స్థాయిలో పడిపోతున్న ధరలు..!


