బుధ గ్రహం కక్ష్యలోకి బెపీకొలంబో  | European–Japanese BepiColombo spacecraft entered orbit around Mercury | Sakshi
Sakshi News home page

బుధ గ్రహం కక్ష్యలోకి బెపీకొలంబో 

Nov 23 2026 4:12 AM | Updated on Nov 23 2026 4:12 AM

European–Japanese BepiColombo spacecraft entered orbit around Mercury

అతిచిన్న గ్రహం రహస్యాలను ఛేదించడంలో ముందడుగు  

సజావుగా సాగుతున్న ఐరోపా–జపాన్‌ సంయుక్త మిషన్‌  

వాషింగ్టన్‌:  బుధ గ్రహానికి(మెర్క్యూరీ) మానవాళి పంపిన సరికొత్త అంతరిక్ష నౌక ఒక చరిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఐరోపా–జపాన్‌ సంయుక్తంగా నిర్మించిన ‘బెపీకొలంబో’స్పేస్‌క్రాఫ్ట్‌.. సౌర వ్యవస్థలోని అతి చిన్న గ్రహమైన బుధుడి చుట్టూ ఉన్న కక్ష్యలోకి శనివారం విజయవంతంగా ప్రవేశించింది. సువిశాల విశ్వాన్ని అధ్యయనం చేయడానికి జరుగుతున్న శాస్త్రీయ ప్రయోగాల్లో ఇదొక కీలకమైన ముందడుగు అని సైంటిస్టులు చెబుతున్నారు. 

అంతరిక్ష నౌక బెపీకొలంబో భూమిపై ఉన్న నియంత్రణ వ్యవస్థలతో తిరిగి సంబంధాన్ని ఏర్పరచుకుందని బెపికొలంబో ప్రయోగ బృందం వెల్లడించింది. అది బుధ గ్రహం కక్ష్యలోకి చేరినట్లు యూరోపియన్‌ స్పేస్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌లోని ఫ్లైట్‌ డైనమిక్స్‌ బృందాలు ధ్రువీకరించాయి. ‘‘మాకు బెపీ నుండి సమాచారం అందింది. అది ఇప్పుడు భూమితో సంప్రదింపులు జరుపుతోంది’’అని మిషన్‌ బృందం తెలిపింది. అంతరిక్ష నౌక నుంచి అందిన సమాచారాన్ని ఇంజనీర్లు విశ్లేషిస్తున్నారు. త్వరలో పూర్తి సమాచారాన్ని పంచుకుంటామని ఆ బృందం పేర్కొంది. బుధ గ్రహ రహస్యాలను ఛేదించే విషయంలో బెపీకొలంబో మరింత క్రియాశీలంగా మారింది.  

రెండు శాస్త్రీయ ఆర్బిటార్లు  
బెపీకొలంబో స్పేస్‌క్రాఫ్ట్‌ను 2018 అక్టోబర్‌ 20న ప్రయోగించారు. ఇది యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ(ఈఎస్‌ఏ), జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీల ఉమ్మడి మిషన్‌. భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం అయినప్పటికీ.. ఇప్పటివరకు మనుషులు సరిగ్గా అన్వేషణ సాగించని గ్రహం బుధుడు. ఇది సూర్యుడికి కూడా దగ్గరగా ఉండటమే ఇందుకు కారణం. బుధుడిపై అత్యంత సమగ్రమైన పరిశోధనను చేపట్టేందుకు ఈ మిషన్‌ను రూపొందించారు. ఆ అంతరిక్ష నౌక ఎనిమిదేళ్లకు పైగా అంతర సౌర వ్యవస్థ గుండా ప్రయాణించింది. బిలియన్ల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. 

బుధ గ్రహ కక్ష్య చలనాన్ని అర్థం చేసుకోవడంలో ముఖ్యమైన కృషి చేసిన ఇటాలియన్‌ గణిత శాస్త్రవేత్త, ఇంజనీర్‌ గియుసెప్పె(బెపీ) కొలంబో పేరు మీద ఈ మిషన్‌కు నామకరణం చేశారు. ఈ అంతరిక్ష నౌక రెండు శాస్త్రీయ ఆర్బిటార్‌లను మోసుకెళ్తోంది. అవి బుధ గ్రహం చుట్టూ ఏకకాలంలో పనిచేస్తాయి. ఇందులో మెర్క్యూరీ ప్లానెటరీ ఆర్బిటార్‌(ఎంపీఓ)ను ఈఎస్‌ఏ అభివృద్ధి చేసింది. ఇది బుధ గ్రహం ఉపరితలం, అంతర్గత నిర్మాణం, కూర్పు, భౌగోళిక చరిత్రలను పరిశీలిస్తుంది. మెర్క్యూరీ మాగ్నెటోస్ఫియరిక్‌ ఆర్బిటార్‌(మియో)ను జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. ఇది బుధ గ్రహం అయస్కాంత క్షేత్రం, మాగ్నెటోస్ఫియర్, సౌర పవనంతో దాని పరస్పర చర్యను పరిశోధిస్తుంది. ఇవి రెండు కలిసి వేర్వేరు కక్ష్య దృక్కోణాల నుంచి బుధుడికి సంబంధించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలకు చేరవేస్తాయి.  

బుధగ్రహం ఎలా ఏర్పడిందో...
→ మన సౌర వ్యవస్థలోని అత్యంత అసాధారణమైన గ్రహాల్లో బుధుడు కూడా ఒకటి. అన్నింటికంటే చిన్నదైనప్పటికీ.. అక్కడ బలహీనమైన అయస్కాంత క్షేత్రం, ఎక్సోస్పియర్‌ అని పిలిచే అత్యంత పలుచని వాతావరణం ఉన్నాయి.  

→ చాలాకాలంగా ఉన్న ప్రశ్నలకు బెపీకొలంబో సమాధానమిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.  

→ బుధ గ్రహం ఎలా ఏర్పడింది? ఎలా పరిణామం చెందింది? అనేది అర్థం చేసుకోవడానికి ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ బుధుడి అంతర్గత నిర్మాణం, కూర్పును పరిశోధిస్తుంది. 

→ ఉపరితలంపై సూర్యకాంతి పడే చోట ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పటికీ, బుధ గ్రహ ధ్రువాల దగ్గర నీడలో ఉండే బిలాల్లో మంచు రూపంలో నీరు ఉండే అవకాశం ఉంది. బెపీకొలంబో ఈ ప్రాంతాలను అధ్యయనం చేస్తుంది.  

→ బెపీకొలంబోలోని పరికరాలు మెర్క్యూరీ ఉపరితలాన్ని మ్యాప్‌ చేస్తాయి, ఖనిజాలను పరిశీలిస్తాయి, పురాతన ఉల్కాపాత బిలాలు, అగి్నపర్వత లక్షణాలను 
పరిశోధిస్తాయి.  

→ ఇది బుధుడి కక్ష్యలోకి ప్రవేశించడం కేవలం ఆరంభం మాత్రమే. ప్రస్తుతం రెండు ఆర్బిటార్లు ఒకదానిపై ఒకటి అమర్చిన రీతిలో కలిసి ప్రయాణిస్తున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 9–10 తేదీల్లో విడిపోనున్నాయి. మరిన్ని విన్యాసాల అనంతరం ఇవి రెండూ తమకు కేటాయించిన శాస్త్రీయ కక్ష్యల్లోకి ప్రవేశిస్తాయి. 2027 ఏప్రిల్‌లో శాస్త్రీయ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అంచనా. బుధ గ్రహాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా, నక్షత్రాలకు సమీపంలో రాతిమయ ప్రపంచాలు ఎలా పరిణామం చెందాయో కూడా తెలుసుకోవడానికి ఈ అంతరిక్ష నౌక సహాయపడుతుందని భావిస్తున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement