పవిత్ర కార్తీక మాసంలో (SVK) శ్రీ బాలాజీ ఆలయం ఆధ్వర్యంలో శ్రీనివాస (బాలాజీ) కళ్యాణ మహోత్సవం ఐండ్‌హోవెన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. SVK నిర్వహించిన ఈ ఆరవ కళ్యాణ మహోత్సవానికి నెదర్లాండ్స్ నలుమూలల నుంచి 1300 మంది భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి, స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి, తన్మయులయ్యారు.

ఈ మహోత్సవానికి ప్రధాన ఆకర్షణ, తిరుపతి సాంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా జరిగిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణం. SVK ఆహ్వానం మేరకు వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో, సుప్రభాత సేవతో ప్రారంభమై, తోమాల సేవ, అర్చన జరిగాయి. అనంతరం సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికపై, వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాద్యాల మధ్య స్వామివారి కళ్యాణం, వస్త్ర సమర్పణ కన్నుల పండువగా జరిగాయి. తిరుమలలో జరిగే కళ్యాణోత్సవాన్ని తలపించేలా జరిగిన ఈ వేడుకతో, తిరుమల వైభవాన్ని ఐరోపాలోనే అనుభూతి చెందామని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

మాతృభూమికి దూరంగా ఉన్నా, మన సంప్రదాయాలు, ఆచారాలు, భక్తి పరంపర తర్వాతి తరానికి అందాలి. నెదర్లాండ్స్‌లోని ప్రతి భారతీయ కుటుంబానికి స్వామివారి సేవ, దర్శనం అందుబాటులో ఉండాలనేదే SVK సంకల్పం. ఈ సంకల్పంతోనే 2022లో SVK మొదటి శ్రీనివాస కళ్యాణాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ప్రతి ఏడా నిరాటంకంగా నిర్వహిస్తూ, ఈ ఏడాది ఆరవ కళ్యాణ మహోత్సవాన్ని భక్తులకు అందించింది.
ఇదీ చదవండి: శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలకు సియాటెల్‌లో విశేష స్పందన


