కళ్లలో చక్కెర కొడుతుంది జాగ్రత్త!! | Diabetic Retinopathy Symptoms Causes and treatment | Sakshi
Sakshi News home page

కళ్లలో చక్కెర కొడుతుంది జాగ్రత్త!!

Nov 11 2026 2:42 PM | Updated on Nov 11 2026 2:49 PM

Diabetic Retinopathy Symptoms Causes and treatment

డయాబెటిస్‌ కారణంగా రెటీనా దెబ్బతినే కండిషన్‌ ను ‘డయాబెటిక్‌ రెటినోపతి’  (Diabetic Retinopathy) అంటారు. డయాబెటిస్‌–డే కి ముందర ఇస్తున్న వరుస కథనాల్లో భాగంగా డయాబెటిక్‌ రెటినోపతి,   దాని నివారణ, చికిత్స వంటి వివరాలు...  

మన దేశంలో 10 కోట్ల మందికి పైగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారని, వాళ్లలోనూ 40 ఏళ్ల పైబడిన డయాబెటిస్‌ బాధితుల్లో దాదాపు ప్రతి ఐదుగురిలో ఒకరికి డయాబెటిక్‌ రెటినోపతి ఉందని ఐసీఎంఆర్‌–ఇండియా అధ్యయనం (2023) అంచనా. 

డయాబెటిక్‌ రెటినోపతి అంటే...
మన దేహంలోని అన్ని అవయవాల్లాగే రెటీనాకూ అత్యంత సన్నని రక్తనాళాలు (క్యాపిల్లరీస్‌) ద్వారా రక్తం సరఫరా అవుతుంటుంది. రక్తంలో చక్కెర చాలాకాలం పాటు చాలా ఎక్కువ మోతాదులో ఉంటే ఈ సన్నని రక్తనాళాలు గోడలు దెబ్బతిని బలహీనపడతాయి. దాంతో రెండు రకాల సమస్యలు వస్తాయి. అవి... 

మొదటిది లీకేజీ: బలహీనపడిన రక్తనాళాలు గోడలు అక్కడక్కడ చిన్న బుడగల్లా ఉబ్బుతాయి. వీటిని ‘మైక్రో అన్యూరిజమ్స్‌’ అంటారు. వీటి నుంచి, దెబ్బతిన్న ఇతర రక్తనాళాల నుంచి రక్తం, ద్రవాలు, ప్రొటీన్లు రెటీనాలోకి లీక్‌ అవుతాయి. ఈ ద్రవం మాక్యులా అనే భాగంలో చేరి అది ఉబ్బిపోవడాన్ని‘డయాబెటిక్‌ మాక్యులార్‌ ఎడీమా’ అంటారు.  

ఇదీ చదవండి: ముందు జాగ్రత్తేమందు!

రెండోది రక్తప్రసరణ ఆగిపోవడం: కొన్ని సన్నని రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోవడంతో రెటీనాలోని ఆ భాగాలకు ఆక్సిజన్, పోషకాలు అందవు. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు రెటీనా ‘వీఈజీఎఫ్‌’ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. దీని ప్రభావంతో అసాధారణమైన, అత్యంత బలహీనమైన కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తాయి. ఇవి తేలిగ్గా చిట్లిపోయి రక్తస్రావానికి దారితీస్తాయి. ఈ కొత్త రక్తనాళాలు ఏర్పడని తొలిదశను ‘నాన్‌ప్రొలిఫరేటివ్‌ డయాబెటిక్‌ రెటినోపతి (ఎన్‌ పీడీఆర్‌)’ అనీ, అసాధారణ రక్తనాళాలు పెరిగే ముదిరిన దశను ప్రొలిఫరేటివ్‌ డయాబెటిక్‌ రెటినోపతి (పీడీఆర్‌)’ అని అంటారు.

తొలినాళ్లలో కనిపించని లక్షణాలు... 
తొలిదశలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. సమస్య ముదిరాక కనిపించవచ్చు. 

మాక్యులార్‌ ఎడీమా వల్ల చూపు మసకబారడం, సరళ రేఖలు వంకరగా కనిపించడం.

కంటి ముందు నల్లటి మచ్చలు, దారపు పోగుల్లాంటివి తేలుతున్నట్టు (ఫ్లోటర్స్‌) కనిపించడం.  అసాధారణ రక్తనాళాలు చిట్లి, కంటి లోపలి జెల్లీ లాంటి ‘విట్రియస్‌’లోకి రక్తస్రావం జరిగితే... చూపు అకస్మాత్తుగా పోవడం లేదా కంటి ముందు తెర కమ్మినట్టు అనిపించడం. అప్పటికీ నిర్లక్ష్యం చేస్తే, అసాధారణ రక్తనాళాలతో పాటు పెరిగే పీచు కణజాలం రెటీనాను లాగడంతో అది కంటి లోపలి గోడ నుంచి విడిపోవచ్చు. దీన్ని ‘ట్రాక్షనల్‌ రెటినల్‌ డిటాచ్‌మెంట్‌’ అంటారు. ఈ కొత్త రక్తనాళాలు కంటి ముందు భాగంలో పెరిగితే ‘నియోవాస్కులర్‌ గ్లకోమా’ అనే తీవ్రమైన నొప్పితో  సమస్య వస్తుంది. 

చికిత్స: 
డయాబెటిక్‌ రెటినోపతి దశను, కంటికి జరిగిన నష్టాన్ని బట్టి చికిత్స ఉంటుంది.  యాంటీ–వీఈజీఎఫ్‌ ఇంజెక్షన్లు: మాక్యులార్‌ ఎడీమాకు ప్రస్తుతం ఇదే ప్రధాన చికిత్స. ఈ ఇంజెక్షన్లు వాపును, లీకేజీని తగ్గిస్తాయి. అసాధారణ రక్తనాళాల పెరుగుదలనూ అదుపు చేస్తాయి. 

లేజర్‌ చికిత్స:  ప్రొలిఫెరేటివ్‌ దశలో రెటీనా అందులో లేజర్‌ (పాన్‌–రెటినల్‌ ఫోటో  కోయాగ్యులేషన్‌ – పీఆర్‌పీ) చేయడం ద్వారా అసాధారణ రక్తనాళాలు తగ్గి, రక్తస్రావం ముప్పు తగ్గుతుంది.

 విట్రియో–రెటినల్‌ సర్జరీ (విట్రెక్టమీ): విట్రియస్‌లోకి జరిగిన రక్తస్రావం తగ్గకపోయినా, రెటీనా విడి΄ోయినా ఈ అత్యాధునిక మైక్రోసర్జరీ అవసరమవుతుంది. ఇందులో రెటీనాను యథాస్థానంలో అతికిస్తారు.

కంటిని కాపాడుకోవాలంటే... చక్కెర, బీపీ, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి. ఆహారనియమాలు ΄ాటిస్తూ, వ్యాయామం చేస్తూ, క్రమం తప్పకుండా మందులు వాడాలి. పొగతాగడం మానేయాలి.

ఇదీ చదవండి : తొలి బిడ్డను కోల్పోవడం తీరని విషాదం : సోనియా గాంధీ

-డాక్టర్‌ రవికుమార్‌ రెడ్డి సీనియర్‌  కంటి వైద్య నిపుణులు  

 – నిర్వహణ: యాసీన్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement