మంచిమాట
ఈ లోకంలో చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి మనిషి నుండి ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చు. ఒకరికి తెలిసింది మరొకరికి తెలియకపోవచ్చు. అందుకే నిరంతరం నేర్చుకునే మనస్తత్వం ఉండాలి. నిరంతర విద్య,, ఆధ్యాత్మికత మానవ జీవితాన్ని పరిపూర్ణత వైపు నడిపించే రెండు శక్తిమంతమైన మార్గాలు. ఈ రెండూ వేర్వేరుగా కనిపించినప్పటికీ, ఒకదానితో ఒకటి విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయి.
జ్ఞానాన్వేషణ విద్య అయితే, ఆ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా జీవంలోకి తెచ్చుకోవడమే ఆధ్యాత్మికత. విద్య అనేది కేవలం పాఠశాలలకే లేదా డిగ్రీలకే పరిమితం కాదు. మనిషి పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఏదో ఒక రూపాన్ని సంతరించుకుంటూనే ఉంటుంది. దీన్నే ‘జీవితకాల అభ్యాసం’ అంటారు.
ప్రతి మనిషిలోనూ ఉండే సహజమైన నేర్చుకునే తపనే విద్యకు మూలం. కొత్త విషయాలను తెలుసుకోవాలనే కుతూహలం మనిషిని నిరంతరం చురుగ్గా ఉంచుతుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సమాజంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ‘నేర్చుకోవడానికి వయసుతో నిమిత్తం లేద’నే నానుడి ప్రకారం, ప్రతి అనుభవం మనకు కొత్త పాఠాన్ని నేర్పుతుంది.
ప్రతి విషయాన్ని కేవలం చూసి వదిలేయకుండా, ‘ఇది ఎందుకు జరుగుతుంది? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిట’నే ప్రశ్నలు వేసుకోవడం అలవర్చుకోవాలి. చిన్న పిల్లల్లాగే ప్రతి చిన్న విషయానికీ ఆశ్చర్యపోవడం, తెలుసుకోవాలనే తపన కలిగి ఉండటమే మొదటి మెట్టు.
మానవజన్మ ఒక విలక్షణమైన అన్వేషణ. జన్మించిన క్షణం నుండి అంతిమ ఘడియల వరకు మానవుడు ఏదో ఒక విషయాన్ని గ్రహిస్తూనే ఉంటాడు. లౌకిక ప్రపంచంలో జ్ఞానాన్ని సేకరించడం ఒకెత్తయితే, అంతరంగంలో ఉండే సత్యాన్ని శోధించడం మరొక ఎత్తు. ఈ రెండింటి కలయికే ‘నిరంతర విద్యార్థిగా ఆధ్యాత్మిక జీవితం’.
సాధారణంగా విద్య అనేది బాహ్య ప్రపంచం (ప్రకృతి, విజ్ఞానం, సమాజం) గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆధ్యాత్మిక విద్య మన అంతరంగాన్ని పరిచయం చేస్తుంది.
ఆధ్యాత్మికత అంటే ఆలోచనలు, భావోద్వేగాలు, మన ఉనికి వెనుక ఉన్న పరమ సత్యాన్ని శోధించే అంతర్ముఖ ప్రయాణం. జీవితంలో ఎదురయ్యే తీపి–చేదు అనుభవాలు, విజయాలు–ఓటములు అన్నీ మనకు గురువులే. ఒక నిరంతర విద్యార్థి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోడు. ‘పరిస్థితి ఏ పాఠం నేర్పుతోంద’ని ఆధ్యాత్మిక దష్టితో ఆలోచిస్తాడు. పాండిత్యం లేదా జ్ఞానం పెరిగేకొద్దీ మనిషిలో అహంకారం పెరిగే ప్రమాదం ఉంది. కానీ ఆధ్యాత్మిక చింతన ఉన్న విద్యార్థి, జ్ఞానం పెరిగేకొద్దీ విశ్వం అనంతత్వం ముందు తాను ఎంత అల్పుడో గ్రహించి మరింత వినమ్రుడవుతాడు.
జీవితం అనేది ఒక అనంతమైన పాఠశాల. ఇందులో మనం పొందే ప్రతి అనుభవమూ ఒక ఉపాధ్యాయుడే. మనలోని అహంకారాన్ని తొలగించుకుని, ‘నిరంతరం నేర్చుకునే విద్యార్థి’ భావనతో ఉన్నప్పుడు మాత్రమే అంతిమ సత్యమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలుగుతాం. జ్ఞానాన్ని ఆర్జించడం, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం, ఆ అనుభవం ద్వారా పరిపూర్ణత సాధించడమే నిరంతర విద్యార్థి ఆధ్యాత్మిక ప్రయాణం.
ఆధ్యాత్మిక మార్గంలో నడిచే సాధకుడు ఎప్పుడూ తనను తాను ఒక ప్రాథమిక విద్యార్థిగానే భావిస్తాడు. అహంకారాన్ని పక్కనబెట్టి, నిరంతర అభ్యాసకుడిగా జీవించడమే ఆధ్యాత్మిక పురోగతికి మూలస్తంభం. బాహ్యంగా డిగ్రీలు సాధించడమో లేదా ఒక నిర్దిష్ట వయస్సు వరకు చదువుకోవడమో ‘నిరంతర విద్య’ అనిపించుకోదు. ప్రతి చిన్న అనుభవాన్ని, ప్రతి సంఘటనను ఒక పాఠంగా స్వీకరించే మనస్తత్వమే నిరంతర విద్యార్థి లక్షణం. అన్నీ తెలుసనే భావన కలిగిన చోట జ్ఞానానికి తలుపులు మూసుకుపోతాయి. ‘తెలియాల్సింది ఇంకా ఎంతో ఉంద’నే వినయం ఉన్నప్పుడే కొత్త జ్ఞానం మనలోకి ప్రవహిస్తుంది. పాత ఆలోచనలను, మూఢనమ్మకాలను వదిలిపెట్టి, సత్యానికి అనుగుణంగా తన్ను తాను మలచుకోవడానికి సిద్ధంగా ఉండటమే అభ్యాసకుని నైజం.
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి


