జీవన కాంక్ష | self-confidence embrace opportunities and overcome obstacles with determination | Sakshi
Sakshi News home page

జీవన కాంక్ష

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

self-confidence embrace opportunities and overcome obstacles with determination

ఆధ్యాత్మికథ

ఒక విశ్రాంత ఆచార్యుడికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యులు అన్ని పరీక్షలూ చేసి అన్నవాహిక క్యాన్సర్‌ మూడో దశగా నిర్ధారించారు. తప్పని పరిస్థితిలో అన్నవాహికలో కొంత భాగాన్ని ఆపరేషన్‌ చేసి తీసేశారు. అప్పుడా ప్రొఫెసర్, డాక్టర్‌తో ‘ఇంకెన్నాళ్ళు బతుకుతాను?‘ అని అడిగాడు. డాక్టర్, ప్రొఫెసర్‌కి ధైర్యం చెబుతూ, ‘‘ఏం భయం లేదు, ధైర్యంగా ఉండండి’’ అన్నాడు.

అలాగే రేడియోథెరపీ, కీమోథెరపీలు కూడా అవసరమై చికిత్సలు ప్రారంభించారు. ఆ చికిత్సల కోసం వచ్చిన ప్రతిసారీ ప్రొఫెసర్, డాక్టర్‌తో ‘‘దేవుడు నా ఆయుష్షు ఇంకొంతకాలం పొడిగిస్తే బాగుణ్ణు’’ అనేవాడు. చిన్నచిన్నగా వారి మధ్యలో స్నేహం చిగురించింది.

చనువుకొద్దీ డాక్టర్‌ ఓ రోజు, ‘‘దేవుణ్ణి మరికొంతకాలం గడువు కోసం ప్రార్థిస్తూ ఉంటారు, కారణమేమిటి? మీ పిల్లలందరూ బాగా సెటిల్‌ అయ్యారు కదా, మీకు కూడా డెబ్బై ఏళ్ళు దాటాయి కదా’’ అని అడిగాడు. ‘‘నాకు ఎన్నాళ్ళగానో సంస్కృతంలోని వాల్మీకి రామాయణాన్ని తమిళంలోకి నాదైన శైలిలో అనువదించాలని కోరిక. నా ఉద్యోగ రీత్యా, కుటుంబ వ్యవహారాల దృష్ట్యా నేను ఇన్నాళ్ళూ ఆ పని ప్రారంభించలేకపోయాను. ఈ మధ్యలో కొంత వెసులుబాటు దొరికింది. అందుకని ఆరు నెలల ముందు ఆ మహత్కార్యం ప్రారంభించాను. అయితే దురదృష్టవశాత్తు నాకు ఈ ఆరోగ్య సమస్య వచ్చిపడింది. ఆరోగ్యం మునుపటిలా లేదు, అది పూర్తి చేయకనే నా కాలం చెల్లిపోతుందేమోనని భయంగా ఉంది’’ అని ప్రొఫెసర్‌ అనుమానం వ్యక్తం చేశాడు.

ఆశ్చర్యపోవడం డాక్టర్‌ వంతయింది. ‘‘క్యాన్సర్‌ అంటే ఇక అంతే! అనే రోజులు పోయాయి. మీకు ఏమీ కాదు, మేము నీకిస్తున్నది అత్యాధునిక చికిత్స. జబ్బు గురించి ఆలోచించకండి, మీ పని మీరు చేయండి’’ అని ధైర్యం చెప్పాడు. ఆ మాటలకి ప్రొఫెసర్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. రోజూ కొన్ని పేజీలు అనువాదం చేయసాగాడు. 

నాలుగు నెలల్లో అనువాదం పూర్తయ్యింది. ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశారు. డాక్టరే ఆ పుస్తకాన్ని తన నర్సింగ్‌ హోమ్‌లో రోగుల మధ్యన ఆవిష్కరించాడు. ‘ప్రొఫెసర్‌ శరీరంలో పెరిగిన గడ్డ ఆయన సంకల్పాన్ని పెరగకుండా ఆపలేకుండా పోయింది. ఆశయం ఉంటే అడ్డంకులనేవి దూదిపింజల్లా ఎగిరిపోతాయి’’ అని చప్పట్ల మధ్య చెప్పాడు డాక్టర్‌. తన కలల సాకారమైన గ్రంథాన్ని ప్రొఫెసర్, ఆంజనేయస్వామి పాదాల చెంత ఉంచి భక్తితో శిరస్సు వంచి నమస్కరించాడు.

– ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement