సంకల్ప బుద్ధి సంతోష సిద్ధి | Understanding the Four Components of Enduring Success | Sakshi
Sakshi News home page

సంకల్ప బుద్ధి సంతోష సిద్ధి

Oct 26 2026 12:15 AM | Updated on Oct 26 2026 12:15 AM

Understanding the Four Components of Enduring Success

మంచిమాట

ఆధ్యాత్మిక జీవన పయనంలో మానవుడు సాధించాల్సిన అత్యున్నత మానసిక స్థితులలో ‘సంకల్పం, బుద్ధి, సంతోషం, సిద్ధి’ అనేవి నాలుగు ప్రధానమైన మెట్లు. ఈ నాలుగింటి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని అవగాహన చేసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. సంకల్పం అంటే మనస్సులో పుట్టే దృఢమైన ఆలోచన లేదా నిశ్చయం. మన జీవితం మన ఆలోచనల ప్రతిరూపం. సంకల్పం అనేది సృష్టికి మూలం.

సృష్టి జరగడానికి ముందు ఈ విశ్వమంతా ఒకే ఒక్క పరబ్రహ్మ స్వరూపంగా ఏకైక శక్తిగా ఉండేది. ఆ పరమాత్మకు తనలాంటి అనేక రూపాలను సృష్టించి, ఈ జగత్తును విస్తరించాలనే సంకల్పం కలిగింది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి, ప్రకృతి, మనుషులు, జంతువులు అన్నీ ఆ ఒక్క పరమాత్మ రూపాలే. మానవుడి మనస్సు చంచలమైనది. చెడు ఆలోచనలు, సంశయాలు మనస్సును బలహీనపరుస్తాయి.

 ‘సత్సంకల్పం’ ఆధ్యాత్మిక ప్రగతికి నాంది పలుకుతుంది. మనస్సు సంకల్పాన్ని లేదా ఆలోచనను ఇస్తే, దానిని సరైన మార్గంలో నడిపేది బుద్ధి. మంచి ఏది, చెడు ఏది? శాశ్వతమైనది ఏది? అని విచక్షణా జ్ఞానంతో ఆలోచించే శక్తే బుద్ధి. శ్రీ కృష్ణ పరమాత్మ గీతలో బుద్ధియోగానికి అత్యున్నత పీఠం వేశారు. చంచలమైన మనస్సును వివేకవంతమైన బుద్ధితో నియంత్రించినప్పుడే ఆధ్యాత్మిక సాధకుడు సరైన మార్గంలో పయనించగలడు.

సంకల్పం, బుద్ధి తోడైనప్పుడు సాధకుడికి లభించేది నిజమైన సంతోషం. భౌతిక ప్రపంచంలో దొరికే సంతోషాలు తాత్కాలికమైనవి, క్షణికమైనవి. కానీ, రాగద్వేషాలకు అతీతంగా, బుద్ధిని స్థిరంగా ఉంచడం ద్వారా లభించే సంతోషమే ఆత్మానందం లేదా సంతోషం. ఎదురయ్యే కష్టసుఖాలను సమభావంతో స్వీకరించే స్థితి లభించినప్పుడు, మనస్సులో ఎల్లప్పుడూ సంతోషం తాండవిస్తుంది.

 సత్సంకల్పంతో ప్రారంభమై, వివేక బుద్ధితో పయనించి, ఆనందమయమైన ప్రశాంతతను పొందిన సాధకుడికి చివరకు లభించేదే సిద్ధి. సిద్ధి అంటే పౌరాణికమైన లేదా అపౌరాణికమైన అద్భుత శక్తులు సాధించడం మాత్రమే కాదు. మనస్సుపై పరిపూర్ణ విజయం సాధించి, భగవత్‌ తత్వాన్ని పొంది, జీవన్ముక్తిని సాధించడమే ఆధ్యాత్మిక సిద్ధి.సంకల్పం ప్రణాళిక అయితే– బుద్ధి దాని మార్గం.

మనస్సు చంచలంగా మారడానికి ప్రధాన కారణం ఆలోచనల వెల్లువ. దాన్ని నియంత్రించడానికి శ్వాసనే ప్రధాన సాధనంగా మలుచుకోవాలి. ఇతరుల ముఖంలో చిరునవ్వు చూడటం ద్వారా మన అంతరంగంలో కలిగే ఆనందం అన్నింటికంటే గొప్పది. ఇది స్వార్థాన్ని తగ్గించి, నిజమైన సంతోష సిద్ధికి దారితీస్తుంది. 

ఒక దృఢమైన సంకల్పం వెయ్యి అడ్డంకులను కూడా అధిగమించగలదు. మన భావాలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ మంచి సంకల్పాలను కలిగి ఉండాలి. వివేకంతో కూడిన బుద్ధితో ప్రణాళికలు రచించి, సంతోషంగా ముందడుగు వేస్తే ప్రతి ఒక్కరూ కోరుకున్న సిద్ధిని పొందుతారు. సత్సంకల్పమే ప్రగతికి మొదటి మెట్టు!

మానవుడు తన జీవితంలో సత్సంకల్పాలను విత్తనాలుగా నాటి, వివేకమనే బుద్ధితో నీరు పోసి కాపాడుకుంటే, పువ్వులు పూసి, ఆత్మసిద్ధి అనే దివ్యమైన పండును అందిస్తాయి. ‘సంకల్పం’ విత్తనం అయితే, ‘బుద్ధి దానిని పెంచే సారవంతమైన నేల, ఆ వృక్షం ఇచ్చే అమృత ఫలం ‘సంతోష సిద్ధి’. ఇతరుల ముఖంలో చిరునవ్వు చూడటం ద్వారా మన అంతరంగంలో కలిగే ఆనందం అన్నింటికంటే గొప్పది. ఇది స్వార్థాన్ని తగ్గించి, నిజమైన సంతోష సిద్ధికి దారితీస్తుంది.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement