జ్యోతిర్మయం
అండ అంటే రక్షణ, దండ అంటే సమీపం అని అర్థం. దైవం నిరంతరం పక్కనే ఉన్నాడని, ఆయన రక్షణలోనే ఉన్నామనే అచంచల విశ్వాసం ఉంటే ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనూ దిగులు చెంద నవసరం లేదు. కావలసింది సంశయరహితమైన నమ్మకం.
కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కుంతీ కుమారులు తమ రథాలు దిగే సమయంలో కృష్ణుడు అర్జునుడితో... ‘‘నీ గాండీవం, అమ్ముల పొదులు తీసుకుని నువ్వు ముందు రథం దిగు. తర్వాత నేను దిగుతాను’’ అంటాడు. కృష్ణుడేం పలికినా తన హితానికేనని అర్జునుడు మారు మాట్లాడకుండా రథం దిగాడు. తర్వాత కృష్ణుడు దిగాడు. వెంటనే ధ్వజం పైనున్న ఆంజనేయుడు కృష్ణునికి నమస్కరించి తొలగిపోయాడు. ఆ వెంటనే గుర్రాలతో సహా రథం చురచురమని శబ్దం చేస్తూ క్షణాల్లో మండిపోయింది.
అర్జునుడు కళ్ల ముందరి దృశ్యానికి చకితుడైపోయాడు. ఇది చాలా వింతగా ఉంది. ఈ రథం ఇలా కాలిపోవటానికి కారణం ఏమిటో చెప్పమని కృష్ణుని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు, ఈ రథం భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహనీయులు ప్రయోగించిన శక్తిమంతమైన బాణాగ్నికి ఎపుడో కాలిపోవలసింది. యుద్ధం ముగిసేవరకు నేను కాపాడాను. ఇప్పుడిలా కాలిపోవటానికి వదిలి పెట్టాను, అన్నాడు.
సాక్షాత్తు శ్రీకృష్ణుడు రథ సార థిగా ఉండటం, రథ ధ్వజంపై హనుమంతుడు కొలువై ఉండటం వల్ల, వారి దైవిక శక్తి వల్ల దివ్యాస్త్రాల ప్రభావం రథాన్ని ఏమీ చేయలేకపోయింది. కృష్ణుడు దిగిన వెంటనే రథం కాలి బూడిదైపోయింది. నీవు అనుక్షణం మమ్మల్ని కాపాడుతూ ఉండకపోతే ఏమై ఉండేవాళ్లమో అన్నాడు ఇది విన్న ధర్మరాజు. కృష్ణుడు ఏ వైపు ఉంటే అటే జయం ఉంటుందని వ్యాసుడు ఎప్పుడో చెప్పాడని కృష్ణునికి భక్తితో నమస్కరించాడు. శ్రీకృష్ణుని అండదండలు ఎప్పుడూ ఉండటం వల్లనే పాండవులు విజయాలు సాధించారు.
– డా. చెంగల్వ రామలక్ష్మి
ఇదీ చదవండి: యుగయుగాలకూ శుభదినమిది


