యుగయుగాలకూ శుభదినమిది | ancient times dasara festival in world, sakshi special story | Sakshi
Sakshi News home page

యుగయుగాలకూ శుభదినమిది

Oct 19 2026 1:19 AM | Updated on Oct 19 2026 1:19 AM

ancient times dasara festival in world, sakshi special story

అత్యంత ప్రాచీన కాలంలో దసరా కేవలం ఒక మతపరమైన పండగలా కాకుండా ప్రకృతి ఆరాధనగా మహావీరుల పరాక్రమ ప్రదర్శనగా, రాజ్యాల దిగ్విజయ యాత్రలకు శుభారంభ సూచికగా జరుగుతూ వచ్చింది. ప్రాచీన గ్రంథాల ప్రకారం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని దేశవిదేశాలలో జరుపుకొంటున్నాము. ప్రాచీన మధ్య యుగాలలో భారత దేశాన్ని పరిపాలించిన రాజులు దసరాను అత్యంత వైభవంగా, అధికారికంగా నిర్వహించేవారు.

విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారత దేశంలో దసరా వేడుకలకు పెట్టింది పేరు. రాయలకాలంలో ‘మహా నవమి దిబ్బ’ కేంద్రంగా పదిరోజులపాటు దసరావేడుకలు అంబరాన్నంటేలా జరిగేవని చరిత్ర చెబుతోంది. ఆ కాలంలో ఏనుగుల ప్రదర్శనలు, మల్లయుద్ధాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అద్భుతంగా ఉండేవని పర్షియన్‌ రాయబారి అబ్దుల్‌ రజాక్‌ వంటి విదేశీ యాత్రికులు తమ రచనల్లో చెప్పారు. విజయనగరరాజుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ క్రీ. శ. 1610లో రాజా వొడయార్‌ శ్రీ రంగ పట్నంలో మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించారు. ప్రాచీనకాలం నాటి ఆ రాజసం నేటికీ చాముండేశ్వరీదేవి ఊరేగింపులో మనకు కనువిందు కలిగిస్తోంది.

కృతయుగంలో...
కృతయుగం(సత్య యుగం), త్రేతాయుగం, ద్వాపర యుగాలు గడచి, నేటి కలియుగంలో దసరా మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. మన దేశంలోనూ, ప్రపంచంలోని పలు దేశాల్లోనూ కన్నుల పండుగగా జరగడం మనం చూస్తున్నాం.

కృతయుగంలో మహిషాసురుడనే మహారాక్షసుడు తన ఘోర తపోఫలంగా బ్రహ్మదేవుడు తనకిచ్చిన వరాలతో మదమెక్కి దేవతల్ని, మునులను పీడించేవాడు. అతడిని అంతం చేయడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ముక్కోటి దేవతల శక్తులన్నీ ఏకమై, ఒకే ఒక మహాశక్తి దుర్గగా అవతరించింది. ఆ అమ్మవారే ఆశ్వీయు జశుద్ధ పాడ్యమినుండి తొమ్మిది రాత్రులు మహిషాసురుడితో భీకరమైన యుద్ధం చేసి, ఆశ్వీయుజ శుద్ధ దశమి నాటి ఉదయం మహిషాసురుడిని వధించి ముల్లోకాలకు శాంతిని చేకూర్చింది. విజయాన్ని తెచ్చిన పదవరోజున పండగ చేసుకోవడం కృతయుగం నుంచే ప్రారంభమైంది.

త్రేతాయుగంలో...
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు మహాపరాక్రమవంతుడైన రావణాసురుడిని సంహరించడానికి సంకల్పిం చాడు. లంకానగరంలో ఉన్న సీతాదేవి ని రక్షించడానికి శ్రీరాముడు లక్ష్మణ సమేతంగా వానర సైన్యంతో కలిసి వెళ్లి, రావణాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించాడు. లంకపై దాడిచేయడానికి ముందుగా శ్రీరాముడు దేవీ నవరాత్రులు దీక్షను ఆచరించి దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందా డని పురాణాలు చెబుతాయి. ఆ యుగంలో శ్రీరాముడు రావణాసురుని సంహరించి విజయాన్ని సాధించింది విజయదశమి నాడేనని రామాయణం చెబుతోంది. అందుకే ఈ రోజును చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఉత్తరభారత దేశం లో ‘రామలీలా ‘ఉత్సవాలను అనందోత్సాహాలతో నిర్వహించి, రావణాసురుని దిష్టి బొమ్మ’లను దహనం చేస్తారు.

ద్వాపర యుగంలో... ద్వాపరయుగంలో పాండవులు తమ 12 ఏళ్ళ వనవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం ముగించుకొని శమీ వృక్షం (జమ్మిచెట్టు) పైన దాచివుంచిన తమ ఆయుధాలను తిరిగి తీసుకొన్న రోజు కూడా విజయదశమే. ఆయుధాలను ధరించి వారు విజయాన్ని సాధించారు. దసరానాడు శమీపూజ, ఆయుధపూజ ఆచారం అప్పటి నుంచీ స్థిరపడింది. మహాభారత ఘట్టం ప్రకారం దసరా పండగల్లో అలా ఆయుధ పూజ, జమ్మిచెట్టుకు ప్రదక్షిణ అంతర్భాగమయ్యాయి.

బౌద్ధులకు...
విజయ దశమి బౌద్ధులకు అత్యంత పవిత్రమైన రోజు. దీనిని ఆ మతస్తులు ‘అశోక విజయ దశమి’ గా పాటిస్తారు. కళింగయుద్ధంలో జరిగిన రక్తపాతాన్ని కళ్లారా చూసిన మౌర్య చక్రవర్తి అశోకుడు ఆ తరువాత జీవితంలో శాంతిమార్గాన్ని ఎంచుకొని విజయదశమి పర్వదినంనాడే బౌద్ధమతాన్ని స్వీకరించాడు. అది చరిత్ర. దేశంలోని అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా మహారాష్ట్రలో నివసించే బౌద్ధమతస్తులు ఈ రోజును ‘ధమ్మ చక్ర ప్రవర్తన్‌ దివస్‌‘గా లేదా ‘అశోక విజయ దశమి‘గా ఉత్సవం చేసుకుంటారు. పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తారు. ప్రార్థనలు చేస్తారు.

సిక్కులకు...
సిక్కుల పదవ గురువైన గురు గోవింద్‌ సింగ్‌ జీ దసరా పండుగకు గల ‘చెడుపై మంచి సాధించిన విజయ’ మనే భావనను గౌరవించారు. జలూమ్‌ (అన్యాయం)పై పోరాడటానికి ఆయన దసరా పర్వదినాన్ని అందరికీ శక్తినీ, ధైర్యాన్ని ప్రదర్శించే రోజుగా ఎంచుకున్నారు.

జైనులు కూడా...
జైన రామాయణం ప్రకారం ‘జైన పద్మపురాణం’లో శ్రీరామచంద్రమూర్తిని ఎనిమిదవ బలదేవుడిగా కీర్తిస్తూ, ఆయన రావణుడిపై సాధించిన విజయాన్ని సాధించిన రోజుగా విజయోత్సవం జరుపుకుంటారు. జైనులు ఈ పర్వదినం నాడు శాంతినీ, అహింసను ప్రబోధిస్తూ ప్రత్యేక పూజలు, అర్చనలు చేస్తారు.
ముస్లింలు, క్రైౖస్తవులు ఈ పండుగను మత పరంగా జరుపుకోకపోయినా, భారతదేశంలో శతాబ్దాలుగా వున్న సహజీవన సంస్కృతి దృష్ట్యా, ఈ మహోత్సవాల్లో భాగస్వాములౌతారు. ఉత్తర భారత దేశంలో ‘రామ లీల’ నాటకాలకోసం ముస్లిం కళాకారులు రావణుడి కుష్బొమ్మలను తయారు చేయడం, నాటకాలలో పాత్ర లు వేయడం తరతరాలుగా కొనసాగుతోంది.

మైసూరులో అందరికీ...
అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన మైసూర్‌ దసరా మహోత్సవాలను, హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ‘కులు’ దసరా ఉత్సవాలను ఒక మతపరమైన పండగలాగా కుండా, రాష్ట్రసాంస్కృతిక ఉత్సవాలు(స్టేట్‌ ఫెస్టివల్‌)గా నిర్వహిస్తున్నారు. వీటిలో అన్నిమతాల ప్రజలు ఊరేగింపులు చూస్తూ, ఉత్సవ ప్రదర్శనలలో పాల్గొంటూ ఆనందిస్తారు. వివిధ దేశాల్లో ఈ పండుగను అనేకరీతుల్లో జరుపుకొంటున్నారు. ఇండోనేషియాలోని బాలి, జావా ద్వీపాల్లో దసరా పండగ సంస్కృతి సర్వత్రా కనిపిస్తుంది. విజయదశమి రోజుల్లో రామాయణ గాధనుప్రతిబింబించే అద్భుతమైన షాడో పప్పెట్రీ (తోలు బొమ్మ లాటలు), సాంప్రదాయ రామాయణ నృత్యనాటకాలను ప్రదర్శిస్తారు. కరేబియన్‌ దేశాలని పిలవబడే ట్రినిడాడ్, గయానా, సరినామ్‌ దేశాల్లో శతాబ్దాల క్రితమే స్థిరపడిన హిందూ సంతతి వారు దసరా సంస్కృతిని కాపాడుకుంటూ వైభవంగా జరుపుకుంటున్నారు. ఉత్తర భారతదేశాన్ని పోలి ఉండేలా వీరు బహిరంగ ప్రదేశాల్లో ‘రామ్‌ లీలా’ నాటకాలను ప్రదర్శిస్తారు. పండగ చివరి రోజున భారీ ఎత్తున రావణాసురుని ‘కుష్బో బొమ్మను’ తయారు చేసి దహనం చేస్తారు.

ఇండోనేషియాలో ఒక తెల్లటి వస్త్రం వెనుక లైట్‌ వేసి, ఆ కాంతిలో తోలు బొమ్మల నీడలు తెరపై కనిపించేలా ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనను నిర్వహించే కళాకారుడిని దలాంగ్‌ అంటారు. అతనొక్కడే వందలాది పాత్రలకు వేర్వేరు గొంతులతో హాస్యభరితంగా డైలాగులు చెబుతూ కథను రక్తి కట్టిస్తాడు. ఈ రామాయణ ప్రదర్శన జరుగుతున్నంతసేపూ వెనుక నుంచి ‘గమేలాన్‌’ అనే ఇండో నేషియా సంప్రదాయ సంగీతవాద్యబందం ఉద్వేగంతో సంగీతాన్ని వినిపిస్తూ వుంటుంది.శ్రీరాముని జననం, సీతాపహరణం, హనుమంతుని లంకా దహనం, రావణ సంహారం వంటి రామాయణ కీలక ఘట్టాలను ఇండోనేషియా స్థానిక సంస్కృతి, హాస్యపాత్రలతో రాత్రంతా (సెమార్, గారాంగ్‌ మొ. నవి.) మిళితం చేసి ప్రదర్శిస్తారు.

– శిష్ట్లా నాగేశ్వరరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement