ఆధ్యాత్మిక దర్శనం | Five elements are aspects of God, His Divinity, and His supreme power | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక దర్శనం

Nov 23 2026 12:38 AM | Updated on Nov 23 2026 12:38 AM

Five elements are aspects of God, His Divinity, and His supreme power

మంచిమాట

మనం కళ్ళు తెరిచి చూసే ప్రతి దృశ్యం వెనుక ఒక అదృశ్య శక్తి పనిచేస్తోంది. విత్తనం మొలకెత్తడం నుంచి నక్షత్రాలు తమ కక్ష్యలో తిరగడం వరకు అంతా ఒక క్రమశిక్షణతో సాగుతోంది. ఆ క్రమశిక్షణే దైవత్వం. ‘అణురేణు  తృణకాష్ఠ పరిపూర్ణుడు‘ అని మన పురాణాలు కీర్తించినట్లు, చిన్న గడ్డిపోచలోనూ, మహా పర్వతంలోనూ ఉన్నది ఒకే తత్వం. ప్రకృతిని ప్రేమించడం, పంచభూతాలను గౌరవించడం అంటే సాక్షాత్తు ఆ దైవాన్ని ఆరాధించడమే.

అణువణువునా, విశ్వమంతటా నిండి ఉన్న అనంత చైతన్యమే దైవం’ అనే సత్యం వేదాలు, ఉపనిషత్తులు, భక్తి మార్గాలలో ప్రధానంగా కనిపిస్తుంది. మానవ దృష్టి భౌతిక రూపాలపై నిలిచినప్పుడు భేదాలు కనిపిస్తాయి. కానీ అంతర్దృష్టితో చూసినప్పుడు ప్రతి జీవీ, ప్రతి వస్తువు ఆ పరమాత్మ చైతన్యంలో భాగంగానే గోచరిస్తాయి. 

భౌతిక ప్రపంచంలో మనం చూసే పర్వతాలు, నదులు, ఆకాశం, నక్షత్రాలు వీటన్నింటి వెనుక ఒక సూక్ష్మ శక్తి, ఒక క్రమం పనిచేస్తున్నాయి. ఆధ్యాత్మిక దృష్టిలో ఈ సమస్త సృష్టికి ఆధారం ఆ సర్వవ్యాపక చైతన్యమే. ఈ భావన మనిషిలో ప్రకృతి పట్ల గౌరవాన్ని పెంచుతుంది. చెట్టును, జంతువును, నీటిని, గాలిని ఉపయోగించుకునే వస్తువులుగా కాకుండా, దైవ స్వరూపాలుగా చూడటం వల్ల పర్యావరణం, జీవరాశుల పట్ల బాధ్యత ఏర్పడుతుంది.

సర్వవ్యాపక దైవ భావన తత్వశాస్త్ర చర్చకే పరిమితం కాకూడదు. అది మన దైనందిన ప్రవర్తనలో ప్రతిఫలించాలి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బాధలో ఉన్నవారికి తోడుగా నిలవడం జాలి కాదు. అది ఆ రూపంలో ఉన్న దైవానికి చేసే నిజమైన సేవగా భావిస్తారు. మనల్ని గమనించే శక్తి సర్వత్రా ఉందన్న స్పృహ మన మాట, చేతలలో నిజాయితీని నిలబెడుతుంది.

గంట కొట్టడం, పూజ చేయడం వంటి బాహ్య ఆచారాలతో పాటు, తోటి ప్రాణులతో ప్రేమగా మెలగడం కూడా ఆరాధనలో భాగమే. ఆధునిక విజ్ఞానం కూడా విశ్వంలోని పదార్థాలన్నీ ఒకే మూలశక్తి, నియమాల బంధంతో ముడిపడి ఉన్నాయని చెబుతుంది. ఆధ్యాత్మిక భాషలో ఇదే అద్వైత, సర్వవ్యాపక భావన. విశ్వం వేరు, మనం వేరు కాదుం మనం ఈ విస్తారమైన చైతన్య ప్రవాహంలో ఒక భాగమే. ఈ ఐక్యతను అనుభూతి చెందగలిగినప్పుడు భయం తగ్గి, విశ్వప్రేమ వికసిస్తుంది.

సర్వవ్యాపక దైవం అనే భావన మనిషిని సంకుచిత ఆలోచనల నుంచి విశాల దష్టి వైపు నడిపిస్తుంది. దైవాన్ని ఎక్కడో వెతకాల్సిన అవసరం లేకుండా, ప్రతి క్షణంలో, ప్రతి జీవిలో, మన అంతరాత్మలో అనుభూతి చెందగలగడమే ఈ తత్వం ఇచ్చే గొప్ప సందేశం. అప్పుడు ప్రతి పని ఒక యజ్ఞంగా, ప్రతి జీవితం ఒక ఆధ్యాత్మిక సాధనగా మారుతుంది.

దైవత్వాన్ని వెతకడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు.  మన చూపులోని మాలిన్యాన్ని తుడిచివేసుకుంటే, ఎదురుగా కనిపించే ప్రతి మనిషిలోనూ, ప్రతి ఆకులోనూ ఆ అనంత చైతన్యమే చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తుంది.

ఎదుటివారు కోపంగానో, పొరపాటుగానో ప్రవర్తించినప్పుడు వెంటనే వారిపై ముద్ర వేయకుండా, వారి వెనుక ఉన్న బాధను లేదా అజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారిలో ఉన్న అంతరాత్మ స్వచ్ఛమైనదని, పరిస్థితుల ప్రభావమే వారి ప్రవర్తనకు కారణమని గుర్తించడం వల్ల క్షమాగుణం పెరుగుతుంది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసినప్పుడు ‘నేను సహాయం చేస్తున్నాను‘ అనే అహంకారం కాకుండా, ‘ఆ రూపంలో ఉన్న దైవానికి సేవ చేసే అవకాశం నాకు దక్కింది‘ అనే కృతజ్ఞతతో వ్యవహరించాలి. తాగే నీరు, పీల్చే గాలి, తినే ఆహారం ఇవన్నీ ప్రకృతి మనకు ఇస్తున్న ప్రసాదాలని గుర్తించాలి. ఆహారం వెనుక ఉన్న సూర్యరశ్మిని, భూమిని, రైతు శ్రమను స్మరించుకోవడం ప్రకృతిలోని దైవత్వాన్ని అనుభూతి చెందే సులభమైన మార్గం.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement