వీధులన్నీ ఊదా రంగులోకి.. ఈ నగరం అందం చూస్తే ఫిదా! | Grafton Jacaranda Festival Purple Flower Celebration | Sakshi
Sakshi News home page

వీధులన్నీ ఊదా రంగులోకి.. ఈ నగరం అందం చూస్తే ఫిదా!

Oct 25 2026 1:24 PM | Updated on Oct 25 2026 1:58 PM

Grafton Jacaranda Festival Purple Flower Celebration

ఫండే

అగడం బగడం

వీధులన్నీ ఊదా రంగును పులుముకుంటే, ఎటు చూసినా ప్రకృతి అందాలు కనువిందు చేస్తే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది! అలాంటి అందమైన దృశ్యాలకు వేదికగా మారింది ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌ రాష్ట్రంలో ఉన్న గ్రాఫ్టన్‌ నగరం. ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్‌ మాసాల్లో పదిరోజుల పాటు నిర్వహించే జకరాండా ఫెస్టివల్‌ వేడుకలు గ్రాఫ్టన్‌ నగరంలో ఘనంగా సాగుతున్నాయి. ఈ ప్రకృతి పండుగలో పాల్గొనేందుకు పర్యాటకులు ఇప్పటికే ఈ నగరానికి క్యూ కట్టారు.

జకరాండా చెట్లు పూసే అక్టోబర్, నవంబర్‌ నెలల్లో గ్రాఫ్టన్‌ నగరం ఊదా రంగు పూలతో అందంగా ముస్తాబవుతుంది. నగరంలోని వీధులు, పరిసర ప్రాంతాలు పూలతో కనువిందు చేస్తాయి. అందుకే ఈ ఉత్సవాన్ని జకరాండా ఫెస్టివల్‌గా పిలుస్తారు. ఈ ఏడాదికి గాను ఈ ఫెస్టివల్‌ను అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 8 వరకు నిర్వహిస్తున్నారు. ఈ వేడుక సమయంలో పూల సహజ అందాలను ఆస్వాదించడంతో పాటు స్థానిక సంస్కృతి, కళలను పరిచయం చేయడం ఈ పండుగ ప్రత్యేకత.

షైనింగ్‌ బ్రైట్‌
జకరాండా ఫెస్టివల్‌కు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఆస్ట్రేలియాలో 1934లో ప్రారంభమైన ఈ వేడుక పూల పండుగగా గుర్తింపు పొందింది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఉత్సవానికి ఈ ఏడాది ‘షైనింగ్‌ బ్రైట్‌’ అనే థీమ్‌ను ప్రకటించారు. పదిరోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో పెద్దవారి నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరు పాల్గొంటారు. ఐక్యతను చాటుతూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ ఆహారాలు, నృత్యాలు, కళాకారుల ఆటపాటలు, పరేడ్‌లు, పాతకాలపు కార్ల ప్రదర్శన ఇలా ఎన్నో రకాల వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు.

రాత్రివేళల్లో వెలుగుల వేడుక
జకరాండా చెట్లను విద్యుత్‌ దీపాలతో అలంకరించి రాత్రివేళల్లో ప్రత్యేకంగా ప్రదర్శించడం ఈ ఉత్సవాల్లో మరో ఆకర్షణ. సీ పార్క్‌లో జరిగే ‘ఇల్యూమినేట్‌’ కార్యక్రమంలో వెలుగుల ప్రదర్శనలు సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి. అలాగే మెమోరియల్‌ పార్క్‌లో ఏర్పాటు చేసే బాణసంచా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది.

చివరగా నవంబర్‌ 8న జరిగే పరుగు పందెంతో ఈ పండుగ ముగుస్తుంది. ప్రకృతి అందాలు, పూల గుబాళింపులు, సంగీతం, స్థానిక సంస్కృతిపై ఆసక్తి ఉన్నవారికి ఈ వేడుక మంచి అనుభూతిని అందిస్తుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు జకరాండా చెట్ల అందాలను ఆస్వాదించడంతో పాటు గ్రాఫ్టన్‌ నగరంలోని స్థానిక జీవనశైలిని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
- రమా జంబుల

ఇదీ చదవండి: ఓ పాత పెయింటింగ్‌.. వేలంలో దీని ధర ఎన్ని కోట్లంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement