అసలైన ఆధ్యాత్మిక యాత్ర ఇదేనా? | Spiritual Journey To Liberation | Sakshi
Sakshi News home page

అసలైన ఆధ్యాత్మిక యాత్ర ఇదేనా?

Oct 22 2026 7:16 AM | Updated on Oct 22 2026 7:16 AM

Spiritual Journey To Liberation

జ్యోతిర్మయం

కాశీ రామేశ్వరాలకు, బదరీనాథ్‌ కేదార్నాథ్‌లకు చేసే యాత్రను సాధారణంగా అందరూ ఆధ్యాత్మిక యాత్రలుగా పేర్కొంటూ ఆ యాత్రలను చేసి రావటానికి ఎంతెంతో వ్యయప్రయాసలకు లోనవుతుంటారు. రాధాస్వామి సత్సంగ్‌ సంతులు ఆధ్యాత్మిక యాత్రను మరోవిధంగా వివరిస్తారు. మన ఆధ్యాత్మిక యాత్ర పాదాల నుండి శిరోగ్రము వరకు సాగుతుంది.

ఈ యాత్రకు రెండు మజిలీలు. ఒకటి కన్నుల వరకు, రెండవది కన్నులకు పైన. కన్నులకు కింద కన్నులు, చెవులు, ముక్కు వంటి నవ రంధ్రాలున్నాయి. వీటి ద్వారా మన ధ్యాస బాహ్యంగా ప్రపంచమంతటిలోను వ్యాపిస్తున్నది. ఈ నవ ద్వారాల్లో ప్రాపంచిక వ్యవహారాలు, ఇంద్రియాల నిస్సారపు రుచులు ఉన్నాయి. ఈ నవద్వారాల్లో ముక్తి లేదు. కన్నులకు పైన మనసూ, ఆత్మల కేంద్రం ఉన్నది. దీనిని సంతులు‘తీసరా తిల్‌’ లేక ముక్తికి దర్వాజ అన్నారు. మహమ్మదీయ ఫకీర్లు దీనిని ‘నుక్తాయే సువైదా’ అని, ఏసుక్రీస్తు ‘మన ఇంటి వాకిలి’ అని అన్నారు.

మన ధ్యాస ఈ కేంద్రం నుండే కిందికి దిగి నవద్వారాల గుండా ప్రపంచమంతటిలోనూ వ్యాపిస్తున్నది.మన మనస్సు నిరంతరం బయట తిరుగుతున్నది. మనం దీన్ని బయట నుండి కూడదీసుకొని ఈ కేంద్రం వద్దకు తీసుకురావాలి. ఈ స్థానం వద్ద ఆ పరమాత్మ ధామం నుండి శబ్దం నిరంతరం వస్తుంది. ఈ స్థానంలో మన సురత్‌ను లేదా ఆత్మను ఏకాగ్రపరచి మనం ఆ శబ్దంతో కలిసి మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించగలం.

ఈ ఆధ్యాత్మికాభ్యాసం కోసం సంతులు మనకు స్మరణ, ధ్యానం, భజన అనే సాధనాలను బోధిస్తారు (పుట 558 – భూతల స్వర్గము – రాధాస్వామి సత్సంగ్‌ బ్యాస్‌). ఇలాంటి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పలుమార్లు చేసిన సజీవ సద్గురువు మార్గదర్శనములో చేస్తే సురక్షితంగా గమ్యం చేరవచ్చంటారు రాధాస్వామి సత్సంగ్‌ వారు. ప్రతి ఒక్కరూ కుల, మత, ప్రాంత, లింగ భేదాలు పాటించక చేయవలసిన ప్రయాణమిదే.
– రాచమడుగు శ్రీనివాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement