ఈవారం కథ: నాణేనికి రెండోవైపు... | Funday Weekly Story On 'Naneniki Rendovaipu' Written By Anishetty Sreedhar | Sakshi
Sakshi News home page

ఈవారం కథ: నాణేనికి రెండోవైపు...

Oct 25 2026 9:53 AM | Updated on Oct 25 2026 9:53 AM

Funday Weekly Story On 'Naneniki Rendovaipu' Written By Anishetty Sreedhar

ఫండే

ఈవారం కథ

‘మా అమ్మగారిని ఆస్పత్రికి తీసుకెళ్ళానండి’
‘స్కూటర్‌ టైర్‌ పంక్చర్‌ అయిందండి’
‘ట్రాఫిక్‌ రద్దీ సార్‌’ 
ప్రధాన కార్యాలయం నుండి తనిఖీకి వచ్చిన సుందరం ఇవేం పట్టించుకోకుండా ఆలస్యంగా వచ్చిన వాళ్ళందరికీ హజరుపట్టీలో ‘ఎల్‌’ అని గుర్తు పెట్టాడు. అవినీతికి పాల్పడి, పట్టుబడి ‘అనిశా’ న్యాయస్థానంలో నిలబడిన దానికన్నా ఎక్కువ అవమానంగా భావించారు.

తను చెప్పిన కారణం సమంజసమైనదని, సహేతుకమైనదని, సర్వామోదం పొందేదని గిరిధర్‌ ఆక్రోశించాడు. ఆలస్యంగా వచ్చిన వాళ్ళందరిదీ ఇదే అభిప్రాయం. గిరిధర్‌ చెప్పిన మూడు ‘స’లు తాము చెప్పినవాటికి కూడా  వర్తిస్తాయని.   
సుందరం హెచ్చరించిన మీదట అందరూ ఐడీ కార్డ్స్‌ తగిలించుకున్నారు.

మనిషి హుందాగా ఉన్నాడు. చురుగ్గా కదులుతున్నాడు. ఇన్‌ స్పెక్టర్స్‌ ఏదైనా ఫైల్‌ అడిగినప్పుడు, అందులో సమస్య ఉందనుకుంటే, అది ఇవ్వడంలో తాత్సారం చేస్తారు సిబ్బంది. రిపోర్ట్‌ పూర్తి చేసే హడావిడిలో పడి మళ్ళీ అడగరు అని. కానీ సుందరం వదలడం లేదు. ముదురులా ఉన్నాడే, అందుకే చిన్న వయసులోనే మంచి స్థాయికి ఎదిగాడు అనుకున్నారు. నాలుగు ముక్కలు బట్టీపట్టి పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యి పదోన్నతి సంపాదించేసాడని పెదవి విరిచాడు ఒక గ్రేడ్‌ తక్కువవాడు (ఒ.గ్రే.త).  
చిన్నచిన్న తప్పులు కూడా భూతద్దం పెట్టి వెతుకుతున్నాడు అని తిట్టుకున్నారు.
సుందరం కఠినాత్ముడు. 
∙∙ 
‘మీ ఊరొస్తున్నా. రెండు రోజులు ఉంటా. సెలవు పెడతావా?’ గిరిధర్‌కి ఫోన్‌ చేశాడు ఆత్మారామ్‌.
‘అబ్బే కుదరదు. ఇన్‌స్పెక్షన్‌ జరుగుతోంది. సుందరం అని ఢిల్లీ నుండి వచ్చాడు ఇన్‌స్పెక్టర్‌. మహా మొండివాడు’ ఎగ్గొట్టడానికి వీడికెప్పుడూ ఏదో ఒక సాకు దొరుకుతుంది అనుకున్నాడు ఆత్మారామ్‌.
‘ఎవడు? ఢిల్లీ సుందరమా? వాడు నా క్లాస్‌మేటే. వాడో పెద్ద తిమింగలం. లంచాలు విపరీతంగా మరిగి కోట్లు కూడబెట్టాడు.’

ఒక మనిషి మనకన్నా ఉన్నతుడు లేక ప్రతిభావంతుడు లేక అందరిచేత ఆరాధించబడుతున్నవాడు లేక అన్నిన్నూ అని మనం కుళ్ళుకుంటూ ఉండగా అతడి వ్యక్తిత్వంలో ఉన్న ఓ పెద్ద లోపాన్ని ఎవరేనా బయటపెడితే పైకి కనిపించ(నీయ)ని పట్టరాని ఆనందం మనసులో ముప్పిరిగొంటుంది. మనం గుడ్డిగా వ్యతిరేకించే రాజకీయ పక్షం ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతే మనసు మూన్‌వాక్‌ చేస్తుంది. మనం అకారణంగా ద్వేషించే నటుడి సినిమా ఘోర పరాజయం పాలైతే మనసు డిస్కో థెక్‌ ఆడుతుంది.

‘సరే వీలుచూసుకుని నేనే మీ ఆఫీస్‌కి వస్తాలే. వాడికి చెప్పకు. సర్‌ప్రైజ్‌ ఇస్తాను.’  
ప్రాణం పోతుంటే ఏమో చెప్పలేం కానీ, ఆత్మారామ్‌ అబద్ధం ఆడడు. సుందరానికి చదువులో తనకన్నా ఎక్కువ మార్క్స్‌ వచ్చినందుకు, మంచి ఉద్యోగం సంపాదించినందుకు, అందమైన భార్య వరించడం వల్లా, అతని పిల్లలు తన పిల్లలకన్నా తెలివైనవాళ్ళు అవడం వలనా, రెండు అంగుళాలు పొడవు ఎక్కువ అవడం చేతా, ఇల్లు ఒక అంతస్తు ఎక్కువ కట్టేసిన మూలానా సుందరం అంటే అతనికి ఈర‡్ష్య లేదు. రీ–యూనియన్‌లో తనని చూసి కళ్ళెగరేశాడని, ‘ఏరా నీకు ఇంకా ప్రమోషన్‌ రాలేదా?’ అన్నాడని కోపం లేదు. అలా అని ఆత్మారామ్‌ ఆత్మాభిమానం లేనివాడు, అంత అసమర్థుడేమీ కాదు. అలా అని ఆత్మారామ్‌ ఆర్థికంగా అధమ స్థాయిలో ఏమీ లేడు. అలా అని ఆత్మారామ్‌ అవినీతికి ఆమడ దూరంలో ఏమీ ఉండడు. అయితే సుందరంలా ఎవరినీ పీడించననీ, న్యాయం(?)గా మామూళ్ళు ఇచ్చినంతే పుచ్చుకుంటానని కూసింత, కాసంత, అణా అంత, కనీసం చిల్లి గవ్వంతైనా ఆత్మసంతృప్తి ఉంది.

ఈ వార్త విని లంచాలు తీసుకోకుండా మడికట్టుకు కూర్చున్నవాళ్ళు, తీసుకోవడం చేతకానివాళ్ళు, తీసుకుంటే ఏమవుతుందో అని భయపడేవాళ్ళు– అందరూ సుందరాన్ని అసహ్యించుకున్నారు.
సుందరం కఠినాత్ముడు, లంచగొండి. 
∙∙ 
సురభి అందగత్తె, తెలివిగలది. అయితే మొదటి విశేషణమే అందరినీ ఆకర్షించేది. పనిలో ఆమె చేసిన ఒక తప్పుని ఎత్తి చూపాడు సుందరం. 
‘ఇలాంటివి జరగకుండా చూసుకోండి’ స్వరంలో వీలైనంత మార్దవాన్ని ఒలికించాలని సుందరం చూసినా సురభికి కాఠిన్యంగానే అనిపించింది. ఆరోజంతా తను అడిగిన ప్రశ్నలకి ఆమె అన్యమనస్కంగానే సమాధానాలు చెప్పడం గుర్తించాడు సుందరం.  
‘అతనికి ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు’ అంది.

‘ఏమైనా ఎక్కువగా మాట్లాడాడా?  చెప్పండి. కడిగి పారేస్తాను’ అందమైన అతివల హక్కుల సాధనకై ఎంతైనా పోరాడడానికి సిద్ధపడే మదన్‌ ఆవేశపడ్డాడు. ‘హౌ టు టాక్‌ టు అండ్‌ ఇన్‌ ఫ్లుయెన్స్‌ (బ్యూటిఫుల్‌) విమెన్‌ ఇన్‌ థర్టీ డేస్‌’ అనే పుస్తకం రాయాలని తీర్మానించుకున్నాడు.
‘సుందరం బాబుకి మహా గీర అనుకుంటానండి. రెండుసార్లు గుడ్‌ మార్నింగ్‌ చెప్పినా పట్టించుకోలేదు’ అన్నాడు సత్యం.
‘అవును నేను పలకరించినా పట్టించుకోలేదు. నాకన్నా ఒక గ్రేడ్‌ ఎక్కువని పొగరనుకుంటాను’ అన్నాడు ఒ.గ్రే.త.
‘అవును మనిషిని చూస్తేనే అర్థం అవుతుంది’ అన్నాడు పర్చేజ్‌ హెడ్‌. ఆయన్ని తలకాయ లేని హెడ్‌ అంటుంటారు.

‘నిజమా? సాటి మనిషిని మనిషిగా చూడలేని కుసంస్కారం. ఆధిపత్య ధోరణికి పరాకాష్ట. హైట్‌ ఆఫ్‌ అథారిటేరియనిజం, హైట్‌ ఆఫ్‌ యారొగన్‌ ్స, హైట్‌ ఆఫ్‌ ఇన్‌ సివిలిటీ’ అని సుందరాన్ని తెగిడి, ‘రాకెట్‌కి ఇంధనం ఎంత అవసరమో ఒక చిన్న బోల్ట్, నట్, వాషర్‌ కూడా అంతే ముఖ్యం అవుతుంది. కంపెనీకి నీ అవసరం కూడా’ అని సత్యాన్ని పొగిడి తన ఆంగ్ల పరిజ్ఞానానికి తనే అబ్బురపడ్డాడు చక్రవర్తి. ఎవరూ ఏకీభవించకపోయినా, తమ సంస్థకి తనే ఆ ఇంధనం అని అతడి నిశ్చితాభిప్రాయం. సత్యంతో కొన్ని సొంత పనులు చేయించుకుంటూ ఉంటాడు. 
‘బాబూ! ఇంట్లో మిక్సీ సరిగా పనిచెయ్యడం లేదన్నారు అమ్మగారు. రేపు సాయంత్రం వెళ్ళి చేయించుకొస్తాను’ అన్నాడు సత్యం. దీనిని కర్మఫలానికి ఉదాహరణగా తీసుకొనరాదు.
సుందరం కఠినాత్ముడు, లంచగొండి, అహంకారి.
∙∙ 
సుందరం కాఫీ, టీలు తాగడని తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు.
‘అయ్యగారికి మందు తప్ప ఇంకే ద్రవ పదార్థమూ గొంతులోకి దిగదనుకుంటాను’ సాయంత్రానికల్లా జనం ఈగల్లా ముసిరే ఈగల్‌ బార్‌ నుండి సుందరం బయటకు రావడం రెండు కళ్ళారా చూశాడట చక్రపాణి. ఒక రోజు అయితే పొరపాటు పడొచ్చు, రెండు రోజులు వరసగా చూశాట్ట! మనిషిలో తూలుడు కానీ, తడబడడం కానీ, కళ్ళు తేలెయ్యడం కానీ లేదట! ‘తాగే సత్తా ఎంత ఉంటే అలా నిలకడగా నడవగలడు?  అందుకే తొణకని నిండు (కల్లు)కుండలా, బీరునగధీరుడిలా, స్కాచి వడపోసినవాడిలా కనిపిస్తాడు సుందరం’ అన్నాడు.ఆ వార్త ఆజ్యం పోసిన అగ్నిలా, ఆక్సిజన్‌ అందిన మంటలా, ఆరని వహ్నిలా, అడవి చిచ్చులా అన్ని విభాగాలనూ చుట్టేసింది.

రోజూ ఇన్సులిన్‌ ఎక్కించుకోకపోతే చచ్చిపోతామన్నట్టు తాగే డైలీ డోస్‌ మందుబాబులు దేవదాసుని చూసినట్టు సుందరంకేసి ఆరాధనగానూ, అప్పుడప్పుడూ తాగితే పర్వాలేదు అనుకునే మందుపాపలు– సన్నివేశానికి అవసరం లేకపోయినా మందు కొడుతూ ఉండే కుర్రహీరోని చూసినట్టు అభిమానంగానూ, తాగడం పాపం అనుకునేవాళ్ళు జమిలిగా తమ గ్రూప్‌ లీడర్‌ సుబ్రహ్మణ్యం సారథ్యంలో గొంగళిపురుగుని చూసినట్టు అసహ్యంగానూ చూశారు. అసలు మద్యాన్ని ముద్దగా, ముద్దుగా మందు అని వ్యవహరించకూడదు అని న్యాయస్థానంలో ఒక పిల్‌ (అనగా మందుగోలీ కాదు) వేసి ఉన్నాడు గ్రూ.లీ.   
మనిషిని చూస్తే నిగర్విలా, నిజాయితీపరుడిలా, నిర్వాణం పొందినవాడిలా కనిపిస్తాడా? అయ్యగారి అసలు నిగ్గూ, నిజస్వరూపం, నిర్వాకం ఇదన్నమాట.
సుందరం కఠినాత్ముడు, లంచగొండి, అహంకారి, తాగుబోతు.
పురస్కారాలు, బిరుదులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మీద పడిపోతున్నాయి.
∙∙ 
తాటిచెట్టు కింద నిలబడితే తాగినట్టు కాదు:  
అడపాదడపా మందు కొట్టే ఒక బాబు ఈగల్‌ బార్‌కి వెళ్ళి రెండు పెగ్గులు బిగించాక  కేషియర్‌ పలకరించాడు.  
‘ఏం సార్‌. ఈమధ్య కనపడడం లేదు?’ బాబు నవ్వాడు. 
‘మా సుందరం మీ ఆఫీస్‌కే ఇన్‌ స్పెక్షన్‌ కి వచ్చాడు కదా’ బాబు తెల్లబోయాడు. 
‘మీ సుందరమా?’ బాబు అనుమానం.
‘అవును సార్‌. వాడు నా క్లాస్‌మేట్‌. బాగా చదివేవాడు’ బాబు ఆశ్చర్యపోయాడు.
‘బాగా తాగుతాడేమో కూడా’ బాబు వెటకారం.

‘భలేవారే. వాడికి వాసన కూడా పడదు. నేను పనిచేసే సమయం సాయంత్రాలే కదా. నాతో కబుర్లు చెప్పడానికి వస్తున్నాడు. రేపే ఆఖరు అని చెప్పాడు’ బాబుకి మత్తు దిగిపోయింది. ఈ వార్త విని తాగనివాళ్ళు కూడా హేంగోవర్‌కి గురయ్యారు.  
సుందరం బార్‌ నుండి బయటకు రావడమే చూశాడు చక్రపాణి. తాగడం చూడలేదు. అంటే అది అర్థసత్యమే! తర్కించడానికి జిజ్ఞాస ఉండాలి, జ్ఞానం కావాలి, ఓడిపోవడానికి కూడా సిద్ధపడాలి. సుందరం తాగుబోతు కాకపోతే అతని గురించి చెడుగా చెప్పుకోవడానికి తమకో అవకాశం ఉండదు, సుందరం మంచివాడు అనుకోవడానికి మనసు ఒప్పదు కనుక ఎవరూ తర్కం జోలికి పోలేదు. అదే లోకరీతి!
∙∙ 
పశ్చాత్తాప పర్వం:
ఆఖరి రోజు మోటివేషన్‌ లో భాగంగా సుందరం కొంతమంది ఉద్యోగులతో మాట కలిపాడు.
‘సత్యం గారూ. మీ అమ్మాయి, అల్లుడూ ఈమధ్యనే ఢిల్లీకి మారారని చెప్పారు కదా? వాళ్ళకేమైనా అవసరం అయితే నా ఫోన్‌ నంబర్‌ ఇవ్వండి. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వస్తే మా ఇంటికి తప్పకుండా రండి’   
సత్యాన్ని ఇలా మీరు అని గౌరవంగా సంబోధించిన సిబ్బంది ఎవరూ లేరు. సంస్థలో నిన్నో, మొన్నో చేరిన కుర్రకంకులు కూడా ‘సత్యం ఇలా రా’ అని పిలిచేవాళ్ళే.

సత్యం తల్లి ఆస్పత్రిలో చేరితే తెలిసిన వైద్యుడి ద్వారా తక్కువ ఖర్చుతో బయటపడేయించిన నారాయణహరి, పిల్ల కళాశాల రుసుములో రాయితీ ఇప్పించిన సరస్వతీ, కొడుకుకి ఉద్యోగం వేయించడంలో సహాయపడిన రాజు– ఇలా పరోపకారి పాపన్నలు, పాపమ్మలు చేసిన సహాయాలన్నీ ఆ పిలుపు ముందు బలాదూర్‌ అనిపించాయి.
‘మీరు చాలా బాగా పనిచేస్తారు. అయితే చందమామలో మచ్చ లేకపోతే ఇంకా ఎంత ప్రకాశవంతంగా ఉండేదో అన్నట్టు మీరు ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అని అలా చెప్పాను. మీ మనసు నొచ్చుకున్నట్టు ఉంది’ సురభి  పొంగిపోయింది.  
‘మీ ఆఫీస్‌ నోట్స్‌ చాలా బాగుంటున్నాయి. ఈసారి మీకు తప్పకుండా పదోన్నతి లభిస్తుంది’ ఒ.గ్రే.త. సుందరం చేతులు పట్టుకుని ఊపాడు.

‘మీరు చేసిన పొరపాట్లు సరిదిద్దేశారు. అవి రిపోర్ట్‌ చేయదగ్గ పెద్దవి కావు. రాయలేదులెండి’ పర్చేజ్‌ హెడ్‌ సంతోషంతో హెడ్‌ ఆడించాడు.
తను రెండుసార్లు పలకరించినపుడు సుందరం పరధ్యానంలో ఉన్నాడని సత్యం గమనించలేదు. ఒక గ్రేడ్‌ తక్కువవాడు ఈర‡్ష్యతో అబద్ధం చెప్పాడు. ఒక విషయంలో మందలించాడని పర్చేజ్‌ హెడ్‌ కోపంతో అలా అన్నాడు. వాళ్ళ మనసుల్లో ఉన్న గొంగళిపురుగు సీతాకోకచిలుకగా పరివర్తనం చెందింది.  
∙∙ 
లోన మనసు వెన్న:  
‘మీరింత మంచివారు. మొదటిరోజు ఆలస్యంగా వచ్చినవారి పట్ల ఎందుకు కఠినంగా ఉన్నారు’ అడిగాడు మేనేజర్‌.
‘సమయ పాలన పాటించినవాళ్ళకి ఇచ్చిన గౌరవం అది. లేదూ వాళ్ళల్లో కొంతమంది నా మీద పైకి ఫిర్యాదు కూడా చెయ్యొచ్చు ఆధారాలతో సహా. నాకెందుకు తలనొప్పి’ సుందరం తర్కానికి ఆశ్చర్యపోయాడు మేనేజర్‌. 
‘కానీ ఇందులో లేట్‌ లతీఫ్‌ల గురించిన పేజ్‌ లేదు’ రిపోర్ట్‌ చూస్తూ సందేహం వెలిబుచ్చాడు.

‘మొన్న ఒకరు నిజంగానే ఆస్పత్రికి వెళ్ళి ఉండొచ్చు, టైర్‌ పంక్చర్‌ అవుతుందని ఊహించం కదా, ట్రాఫిక్‌ అయినా అంతే. భగవంతుడు ఉన్నా, లేకపోయినా ఆయన ఉన్నాడు, మన తప్పుల్ని గమనిస్తుంటాడు’ అనే భయం ఉండాలి. అందుకే వాళ్ళ ముందు నటించాను. అది రహస్య నివేదిక కనుక అందరికీ అందుబాటులో ఉండదు’ సుందరం మంచితనానికి ముచ్చటపడ్డాడు మేనేజర్‌.   
పదో తరగతి కాండక్ట్‌ సర్టిఫికెట్‌లో అందరికీ ‘సంతృప్తికరం’ అని రాసేసే మాస్టారిలా కనిపించాడు సుందరం.
‘కానీ ఇంత మంచిమనిషికి లంచాలు తినే దుర్గుణం ఎలా అబ్బిందో? కోట్లు కూడబెట్టేశాడట!’ అనుకున్నాడు. 
అవును. సుందరం దగ్గర అలా సంపాదించిన మూడు (వేర్వేరు రంగుల) కోట్లు ఉన్నాయి. అవే మార్చి మార్చి బోర్డ్‌ మీటింగ్స్‌కి వేసుకుని వెళుతుంటాడు.     
∙∙ 
ఎ కేస్‌ ఆఫ్‌ మిస్టేకెన్‌ ఐడెంటిటీ:  
సాయంత్రం అవుతుండగా సుందరం ఉన్నాడని రూఢిపరుచుకుని కార్యాలయానికి వచ్చాడు ఆత్మారామ్‌.
‘ఏడీ మావాడు?’
‘ఈరోజు వెళ్ళిపోతున్నాడు కదా. రిపోర్ట్‌ ఖరారు చెయ్యడానికి మేనేజర్‌ దగ్గర కూర్చున్నాడు’ చూపించాడు గిరిధర్‌. 
‘అబ్బే నేను చెప్పినవాడు కాదు. ఆ సుందరం వేరే, ఇతను వేరే’ అన్నాడు ఆత్మారామ్‌. ఆత్మారామ్‌ జీవితంలో ఈ సుందరాన్ని కలిసింది లేదు. ప్రపంచంలో అతనిలా ఉంటాడని చెప్పబడే మరో ఆరుగురిలో కనీసం ఒక్కరిని కూడా ఇంతవరకూ చూడలేదు. అతనిలో అయ్యో తొందరపడ్డానే అనే భావన, పశ్చాత్తాపం వంటివి లేవు. సూర్యుడు తూర్పున ఉదయించును, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడగబడును అనే నిత్యసత్యాలను ఎంత భావరహితంగా ప్రకటిస్తామో అలా చెప్పాడు.

ఈ వార్త మాత్రం మలయమారుతంలా, చినుకు పడితే ఎగసే మట్టివాసనలా, సజ్జ వెదజల్లుతున్న పూల పరిమళంలా కార్యాలయమంతా పాకింది.
ఆత్మారామ్‌ ఆరోజు రాకపోయి ఉంటే సుందరం చాలాకాలం వాళ్ళ మనసుల్లో ఒక అవినీతిపరుడిగా మిగిలిపోయేవాడు.
‘మనం అందరం సుందరం గారిని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాం’ తాము విన్నట్టు, పొరబడినట్టు, నింద మోపినట్టు, తిట్టుకున్నట్టు – సుందరం లంచగొండి, ఒంటెద్దు, అహంకారి, తెలివి తక్కువవాడు, తాగుబోతు కాడనీ – నీతిమంతుడు, కలుపుగోలు మనిషి, మర్యాద తెలిసినవాడు, ప్రజ్ఞావంతుడు, మంచినీళ్ళు మాత్రమే తాగుతాడనీ సర్వసిబ్బంది సమావేశంలో, మూకుమ్మడి పశ్చాత్తాప సభలో ఏకగ్రీవంగా, రెండో ఆలోచన లేకుండా ముక్తకంఠంతో తీర్మానించారు.

‘సుందరం బాబు మర్యాదరామన్న’ అన్నాడు సత్యం.  
‘టీటోటలర్‌లో టీ, మనం తాగే టీ వేరే అయినా సుందరం గారు కనీసం టీ కూడా తాగని టీటోటలర్‌’ అన్నాడు చక్రపాణి. 
‘అవును, మంచివారు చాలా. సుందరంగారు చాలా మంచివారు’ అంది సురభి. అక్కడితో ఊరుకోవచ్చు కదా. కథ అయిపోయేది.  
‘శ్రీరామచంద్రుడు. పరాయి ఆడవాళ్ళ వంక కన్నెత్తి కూడా చూడరు’ అని కూడా అంది. 
ముగిసిన అధ్యాయాన్ని తిరిగి తెరవడం, రీ–పోస్ట్‌మార్టం అంటే ఇదే.
∙∙ 
యాంటిక్లైమాక్స్‌ కాని క్లైమాక్స్‌:
నాణేనికి రెండో వైపు ఉంటుందని తెలియని అజ్ఞానం, ఉంటుందేమోననే భయం, లేదని నమ్మే మూఢత్వం, ఉండదని వాదించే మూర్ఖత్వం కొంతమంది అభిప్రాయాలకి పునాది. తెలుసుకోకుండా, బుర్రకి పని పెట్టకుండా, కూలంకషంగా చర్చించకుండా, పక్షపాత వైఖరితో, అకారణ శత్రుత్వంతో ఏర్పరచుకునేవే ఎక్కువ శాతం అభిప్రాయాలు. మళ్ళీ వీటిల్లో తప్పు(డు), సరైన అభిప్రాయాలు కూడా పాలూ నీళ్ళలాగా కలిసి ఉంటాయి. సుందరం గురించి ఇప్పటివరకూ ఏర్పరచుకున్న పొరపాటు అభిప్రాయాలలాగే ఇదీ ఒకటి.

‘చందమామలో మచ్చ లేకపోతే ఇంకా ఎంత ప్రకాశవంతంగా ఉండేదో అన్నట్టు’ అన్నవి సుందరం పైకి అన్న మాటలు. ‘చందమామలో మచ్చ లేకపోతే అచ్చం మీలాగే ఇంకా ఎంత అందంగా ఉండేదో’ అనేవి సుందరం మనసులో ఉన్న మాటలు.  

సుందరం పెళ్ళి అయినవాడే. ఈ మూడు రోజుల్లో సురభి అంటే సుందరానికి విపరీతమైన క్రష్‌ (ఇష్టపడడం, అభిమానించడం, ఆరాధించడం వంటి ముసుగులు లేకుండా చెప్పాలంటే కోరికతో దహించుకుపోవడం) ఏర్పడింది. అది ఎవరికీ తెలియదు. సురభికి కూడా. సుందరం ఆ విధంగా మంచి బాలుడు అనే ముద్రతో సెలవు తీసుకున్నాడు. 
మనం ఏ వ్యక్తినీ అతని పట్ల మనకున్న పరిజ్ఞానాన్ని మించి అంచనా వేయలేం. మన పరి(మిత)జ్ఞానం ఎంత అల్పమైనది! అన్నాడు ఖలీల్‌ జిబ్రాన్‌.
- అనిసెట్టి శ్రీధర్‌

ఇదీ చదవండి: వామ్మో.. ఏడాదికి ఒక్కసారే స్నానం! విడాకులు ఇప్పించండి సారూ!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement