పిల్లల నిద్ర విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా? | Children Sleep Health Parenting Tips | Sakshi
Sakshi News home page

పిల్లల నిద్ర విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా?

Oct 25 2026 9:14 AM | Updated on Oct 25 2026 9:14 AM

Children Sleep Health Parenting Tips

ఫండే

హెల్త్‌

సందేహం

‘రాత్రి ఆలస్యంగా పడుకున్నా, ఉదయం స్కూల్‌కు వెళ్తున్నాడుగా!’ అని సరిపెట్టుకుంటు న్నారా? అయితే పిల్లల నిద్ర విషయంలో పెద్ద పొరపాటే చేస్తున్నారు. పిల్లల ఎదుగుదలలో నిద్ర పోషించే పాత్ర ఏమిటి? తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వంటి వివరాలన్నీ వైద్య నిపుణుల మాటల్లో మీకోసం...

నిద్ర అంటే కళ్లకు విశ్రాంతి మాత్రమే కాదు, మెదడుకు మరమ్మతు, జ్ఞాపకశక్తికి పదును, శరీరానికి ఎదుగుదల కూడా! పగలంతా పరుగులు పెట్టే పిల్లల శరీరం, మెదడు... రాత్రి నిద్రలోనే నేర్చుకున్న పాఠాలను సర్దుకుంటాయి. పిల్లలకు నిద్ర చాలకపోతే చదువులో శ్రద్ధ తగ్గుతుంది. చిన్న విషయాలకే చిరాకు, కోపం, ఏడుపు, అల్లరి పెరుగుతాయి. అదే, కంటినిండా నిద్రపోయిన పిల్లలు చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలరు. కొత్త విషయాలను సులభంగా నేర్చుకోగలరు. సమస్యలకు పరిష్కారాలు వెతకడంలోనూ మెరుగ్గా ఉంటారు. అందుకే పిల్లల ఎదుగుదలలో పౌష్టికాహారం, ఆటలు ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యం.

ప్రశాంతమైన నిద్రకు పరిష్కారాలు!

  • సమయపాలనే తొలి సూత్రం:
    సెలవు రోజుల్లోనూ పడుకునే, మేల్కొనే సమయాలను సాధ్యమైనంత స్థిరంగా ఉంచండి.

  • స్క్రీన్‌ కు గంట ముందు సెలవు:
    ఫోన్‌ , గేమింగ్, సామాజిక మాధ్యమాలు నిద్రను ఆలస్యం చేస్తాయి. పడుకునే గంట ముందు తెరలకు విరామమిచ్చి, ఫోన్‌ ను పడకగదికి బయట ఉంచండి. నిద్రకు ముందు భయపెట్టే కథలు, వీడియోలు చూపించకండి. రాత్రి భయంతో పిల్లలు అరిచినా, పూర్తిగా మేల్కొనకుండా గందరగోళంగా కనిపించినా, వారిని సురక్షితంగా ఉంచి, ప్రశాంతంగా ఉండేలా చూడండి.

  • ఉదయపు వెలుతురుతో రోజుకు శ్రీకారం:
    ఉదయపు సహజ వెలుతురులో కొంత సమయం గడపడం శరీర గడియారాన్ని క్రమబద్ధం చేస్తుంది. దీనివలన రాత్రి నిద్రపోయే సమయం కూడా మెరుగుపడవచ్చు.

  • ఆటే నిద్రకు బాట:
    వయసుకు తగిన శారీరక చలనం, బయట ఆటలు, క్రమమైన దినచర్య రాత్రి నిద్రకు తోడ్పడతాయి. అయితే పడుకునే సమయానికి దగ్గరగా తీవ్రమైన వ్యాయామం చేయకుండా చూడండి.

  • పడకగది ప్రశాంతంగా ఉండాలి:
    గది నిశ్శబ్దంగా, సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతలో ఉండాలి. అర్ధరాత్రి మెలకువ వస్తే ఆకలి, నొప్పి, దగ్గు, భయం వంటి కారణాలున్నాయేమో గమనించండి. అవసరాలను తీర్చి, ప్రశాంతంగా మళ్లీ నిద్రపోయేలా చూడండి.

  • కెఫీన్‌ కు కళ్లెం:
    టీ, కాఫీ, కోలా, ఎనర్జీ డ్రింక్స్‌లోని కెఫీన్‌ నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. అలాగే, ఈ అలవాట్లు నిద్రపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో గమనించండి.

  • భోజనంలో సమతుల్యత:
    మరీ ఆకలితోనో, కడుపునిండా భారీ భోజనం చేసో పిల్లలు పడుకోకుండా చూడండి. పడుకునే ముందు అధికంగా ద్రవాలు తీసుకోవడాన్ని తగ్గించండి.

  • మనసులోని మాటకు చోటివ్వండి:
    పరీక్షలు, స్నేహితులు, ఇతర ఆందోళనల గురించి పిల్లలతో మాట్లాడండి. పడుకునే సమయాన్ని మందలింపులు, వాదనలకు వేదికగా మార్చకండి. చిన్న కథ, మసక వెలుతురుతో ధైర్యం చెప్పి, క్రమంగా సొంతంగా పడుకునే అలవాటు చేయండి.

  • తల్లిదండ్రులే ఆదర్శం:
    పెద్దలు కూడా క్రమమైన నిద్ర వేళలు, టీవీకి, స్మార్ట్‌ఫోన్‌కు విరామం పాటిస్తే పిల్లలు సులభంగా అలవాటు చేసుకుంటారు.

  • నిద్రలో భద్రత మరువద్దు:
    ఏడాది లోపు శిశువును ప్రతి నిద్రకూ వీపుపై పడుకోబెట్టాలి. గట్టి, సమతలమైన ప్రత్యేక పడకపై దిండ్లు, వదులైన దుప్పట్లు, మెత్తని బొమ్మలు లేకుండా నిద్రపుచ్చాలి. ఒకే గదిలో శిశువుతో ఉండటం మంచిదే కానీ పెద్దల మంచం, సోఫా లేదా కుర్చీలో కలిసి నిద్రపోవడం ప్రమాదకరం.

ఈ లక్షణాలుంటే వైద్యుడిని కలవాలి!
తరచు గురక పెట్టడం, నిద్రలో ఊపిరి ఆగినట్లు కనిపించడం, ఉక్కిరిబిక్కిరి కావడం, పగటిపూట విపరీతమైన నిద్రమత్తు, చదువు లేదా ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.

నిద్ర సమస్యలు వారాల తరబడి కొనసాగినా, పెదవులు నీలంగా మారడం, నిద్రలో తరచూ గాయపడే కదలికలు ఉన్నా వైద్యుడి సలహా తీసుకోవాలి. చివరగా, పిల్లల ప్రవర్తనలో కనిపించే ప్రతి మార్పునూ మొండితనంగా చూడకండి. కొన్నిసార్లు వాళ్లకు కావాల్సింది మరో చాక్లెట్‌ కాదు, సరైన నిద్రని గుర్తించండి.

- డా. కె. పవన్‌ కుమార్‌, సీనియర్‌ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్‌ అలర్జిస్ట్, ప్రొఫెసర్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌

ఇదీ చదవండి: వాహ్‌! 'సర్జీ..' వాహ్‌! డాక్టర్‌ స్థానంలో రోబో...!! ప్రాణం బాధ్యత ఎవరిది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement