ప్లీజ్‌ మేల్కోండి..ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ విషయంలో అశ్రద్ధ వద్దు | Health Tips: Prostate cancer Symptoms and causes | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌ మేల్కోండి..ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ విషయంలో అశ్రద్ధ వద్దు

Oct 25 2026 9:22 AM | Updated on Oct 25 2026 9:22 AM

Health Tips: Prostate cancer Symptoms and causes

పురుషుల్లో దాదాపు 84 శాతం మంది ఆన్‌లైన్‌లో ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం వెతుకుతున్న ప్పటికీ, ప్రోస్టేట్‌ క్యాన్సర్, దాని తాలూకు ముప్పునకు కారణమయ్యే అంశాలు (రిస్క్‌ ఫ్యాక్టర్లూ), చికిత్సా విధానాలపై అవగాహన మాత్రం అంతంత మాత్రమేనని ఓ సర్వే వివరాలు వెల్లడించాయి. ఉదాహరణకు మహారాష్ట్రలో 45 ఏళ్లు పైబడిన పురుషుల్లో కేవలం 17 శాతం మందే ప్రోట్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ చేయించు కున్నట్లు  హీల్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ఒక జాతీయ స్థాయి సర్వేలో వెల్లడైంది. అందునా... మన రాష్ట్రమైన తెలంగాణలో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌  స్క్రీనింగ్‌ చేయించు కున్నవారు కేవలం 4 శాతం మందికి మాత్రమే. 

మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ– (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ – ఎన్‌సీఆర్‌ ప్రాంతాలకు చెందిన 1,036 మంది పురుషులపై ఈ సర్వే నిర్వహించారు. మహారాష్ట్రలో 64 శాతం మంది తమకు గతంలో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ జరిగిందో లేదో కూడా కచ్చితంగా చెప్పలేకపోయారు. పురుషులలో ఆరోగ్యం పట్ల అవగాహన, ముందస్తు పరీక్షల విషయంలో ఉన్న లోపాలను ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి.

తమకు 50 ఏళ్లు దాటిన తర్వాతే స్క్రీనింగ్‌ గురించి ఆలోచించాలని దాదాపు 75 శాతం మంది అనుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక దాదాపు 69 శాతం మంది ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు సంబంధించిన ఒక్క రిస్క్‌ ఫ్యాక్టర్‌ను కూడా గుర్తించలేకపోయారు. కుటుం బంలో ఈ వ్యాధి చరిత్ర ఉండటం కూడా ఒక రిస్క్‌ ఫ్యాక్టర్‌ అని కేవలం 13.2 శాతం మందికే తెలుసు.  నిజానికి... స్క్రీనింగ్‌ వల్ల కలిగే లాభనష్టాల గురించి వైద్యులతో చర్చించడం అన్నది తమ 45 ఏళ్ల వయసు నుంచే మొదలుపెట్టవచ్చు. కుటుంబంలో ఈ వ్యాధి చరిత్ర ఉండటం వంటి  అదనపు రిస్క్‌ ఫ్యాక్టర్లు ఉన్నవారు ఇంకా ముందే డాక్టర్‌ను సంప్రదించాలని నిపుణుల సూచన. 

అవగాహన, స్క్రీనింగ్‌లో లోపాలు
సర్వేలో పాల్గొన్నవారిలో 67 శాతం మంది... వైద్యులు, ఆసుపత్రుల నుంచి దొరికే  సమాచారాన్ని ఎక్కువగా నమ్ముతున్నప్పటికీ, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కోసం ఏ స్పెషలిస్టును కలవాలన్నది కూడా చాలామందికి తెలియదు. యూరాలజిస్ట్‌ను సంప్రదించాలని కేవలం 36 శాతం మందికే తెలుసు. దాదాపు 59.5 శాతం మంది స్క్రీనింగ్‌ లేదా చికిత్స గురించి వైద్యులతో మాట్లాడటానికి ఇబ్బందిగా భావిస్తున్నట్లు తెలిపారు. కేవలం 18 శాతం మంది మాత్రమే ఈ విషయాలపై వైద్యులతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. 

లక్షణాలపై అవగాహన కూడా అందరిలో ఒకేలా లేదు. సుమారు 70 శాతం మంది మూత్ర సంబంధిత లక్షణాలను గుర్తించగలిగారు. అయితే, వెన్ను లేదా పెల్విక్‌ ప్రాంతంలో నొప్పిని ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో సంబంధం ఉన్న లక్షణంగా గుర్తించినవారు కేవలం 10 శాతమే. అయితే, ఈ లక్షణాలు ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. ఇవి కనిపించినంత మాత్రాన క్యాన్సర్‌ ఉన్నట్లు భావించకూడదు. ప్రాంతాలవారీగా స్క్రీనింగ్‌ శాతాల్లో తేడాలుసర్వేలో పాల్గొన్న ప్రాంతాల్లో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ చేయించుకున్నవారి శాతాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ – 4 శాతం
కర్ణాటక – 25 శాతం
తమిళనాడు – 20 శాతం
మహారాష్ట్ర – 17 శాతం
ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ – 16 శాతం

ఈ వివరాల ప్రకారం, తెలంగాణలో స్క్రీనింగ్‌ చేయించుకున్న పురుషుల శాతం చాలా తక్కువ. చికిత్సా విధానాలపై పరిమిత అవగాహన ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల గురించి కూడా చాలామందికి తగిన అవగా హన లేదు. సర్వేలో పాల్గొన్నవారిలో 71.2 శాతం మంది చికిత్సా విధానాల గురించి తమకు చాలా తక్కువ లేదా తక్కువ అవగాహన మాత్రమే ఉందని తెలిపారు.

కేవలం ఒక శాతం మందికి మాత్రమే రేడియోఫార్మాస్యూటికల్‌ థెరపీ గురించి తెలుసు. మొత్తం చికిత్సా ప్రక్రియపై తమకు పూర్తి అవగాహన ఉందని నమ్మకంగా చెప్పినవారు కేవలం 10 శాతం మందే. మహారాష్ట్రలోనూ 71 శాతం మంది చికిత్సా విధానాలపై చాలా పరిమితమైన  అవగాహన కలిగి ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 

ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. 45 ఏళ్ల వచ్చిన ప్రతి పురుషుడూ తప్పనిసరిగా స్క్రీనింగ్‌ చేయించుకోవాలన్న నియమం లేదు. అయితే వయసు, కుటుంబ చరిత్ర, ఇతర రిస్క్‌ ఫ్యాక్టర్లు ఉన్నప్పుడు డాక్టర్‌ను ఒకసారి సంప్రదించి ఆ మేరకు నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే పీఎస్‌ఏ పరీక్షలో ఏవైనా అసాధారణ ఫలితం వచ్చినంత మాత్రాన అది క్యాన్సర్‌ ఉన్నట్లు కాదు.

డాక్టర్‌ వి చంద్రమోహన్‌, సీనియర్‌ యూరో సర్జన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement