సౌదీకి ముప్పు! రంగంలోకి పాక్‌, టర్కీ బలగాలు | Mecca Pact Activated: Pakistan Turkiye Move to Defend Saudi Arabia | Sakshi
Sakshi News home page

సౌదీకి ముప్పు! రంగంలోకి పాక్‌, టర్కీ బలగాలు

Oct 6 2026 8:06 AM | Updated on Oct 6 2026 8:23 AM

Mecca Pact Activated: Pakistan Turkiye Move to Defend Saudi Arabia

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యెమెన్‌లో హౌతీల దూకుడు, సౌదీ అరేబియాపై వరుస దాడుల నేపథ్యంలో.. సౌదీ రక్షణకు పాకిస్థాన్‌, టర్కీ రంగంలోకి దిగుతున్నాయి. సౌదీ, పాక్‌, టర్కీ కలిసి ఏర్పాటు చేసిన మక్కా డిఫెన్స్‌ అలయన్స్‌ను ఇప్పుడు అధికారికంగా యాక్టివేట్‌ చేశారు. రియాద్‌లో జరిగిన అత్యవసర సమావేశం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

యెమెన్‌లో ఇరాన్‌ మద్దతున్న హౌతీలు ఇటీవలి వారాల్లో తమ ఆధీనంలోని ప్రాంతాలను విస్తరించేందుకు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. సౌదీ సరిహద్దులు, నగరాలు, కీలక మౌలిక సదుపాయాలపై కూడా దాడుల ముప్పు పెరిగింది. మక్కా, మదీనాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలను, సౌదీలోని నగరాలు, పౌర, ఆర్థిక మౌలిక సదుపాయాలపై దాడులను మక్కా ప్యాక్ట్‌ సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాయి.

ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 5న రియాద్‌లో మక్కా అలయన్స్‌ స్ట్రాటజిక్‌-పొలిటికల్‌, డిఫెన్స్‌ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. దాడులకు ప్రతిస్పందనగా ఉమ్మడి రక్షణ చర్యలను అమలు చేయాలని.. అవసరమైన సైనిక బలగాలు, రక్షణ సామర్థ్యాలను సౌదీలో వేగంగా మోహరించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ చర్యలు ఇప్పటికే కుదిరిన ఏర్పాట్లు, మూడు దేశాల చట్టాల ప్రకారమే ఉంటాయని స్పష్టం చేశారు.

ఆగస్టులోనే మక్కా ప్యాక్ట్‌
సౌదీ, పాకిస్థాన్‌, టర్కీ మధ్య పరస్పర రక్షణ ఒప్పందం ఆగస్టు 7న కుదిరింది. ఒప్పందంలోని ప్రధాన సూత్రం.. ఒక సభ్య దేశంపై సాయుధ దాడిని అన్ని సభ్య దేశాలపై దాడిగా పరిగణించడం. అప్పట్లో ఇది భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా ముప్పులకు ఉమ్మడిగా స్పందించేందుకు రూపొందించిన రక్షణ వ్యవస్థగా పేర్కొన్నారు. అయితే ఒప్పందం కుదిరిన కొద్దికాలానికే యెమెన్‌లో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. హౌతీల దాడులు, యెమెన్‌లో వారి దూకుడు పెరగడంతో.. ఇప్పుడు మక్కా ప్యాక్ట్‌ తొలిసారి ప్రత్యక్ష భద్రతా సంక్షోభంలో అమల్లోకి వస్తోంది.

పాక్‌, టర్కీ ఏం చేయబోతున్నాయి?
సౌదీ రక్షణకు అవసరమైన సైనిక బలగాలు, సామర్థ్యాలను వేగంగా మోహరించేందుకు పాకిస్థాన్‌, టర్కీ అంగీకరించాయి. అయితే ఇప్పటివరకు ఎన్ని బలగాలు, ఏ రకమైన ఆయుధ వ్యవస్థలు, ఎలాంటి ప్రత్యేక దళాలు పంపుతారనే పూర్తి వివరాలను వెల్లడించలేదు. అందువల్ల భారీ సంఖ్యలో సైనికులు ఇప్పటికే సౌదీకి చేరుకున్నారంటూ వస్తున్న కొన్ని ప్రచారాలను ధ్రువీకరించకుండా చూడాల్సి ఉంటుంది.

మక్కా అలయన్స్‌కు తొలి సెక్రటరీ జనరల్‌గా పాకిస్థాన్‌కు చెందిన రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ నౌమన్‌ మహ్మూద్‌ను మూడేళ్ల కాలానికి నియమించారు. కూటమి వ్యవస్థను సంస్థాగతంగా బలోపేతం చేసే బాధ్యత ఆయనపై ఉండనుంది.

యెమెన్‌లో ‘యెమెన్‌ డాన్‌’.. 100 యుద్ధ విమానాలు
ఒకవైపు మక్కా ప్యాక్ట్‌ కదులుతుండగా.. మరోవైపు యెమెన్‌లో హౌతీలపై సౌదీ మద్దతు ఉన్న బలగాలు భారీ ఆపరేషన్‌ చేపట్టాయి. యెమెన్‌ ప్రభుత్వ బలగాలు హౌతీల ఆధీనంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ‘యెమెన్‌ డాన్‌’ పేరిట ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌కు సౌదీ నేతృత్వంలోని కూటమి నుంచి భారీ వైమానిక మద్దతు లభిస్తోంది. 100 యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని కూటమి ప్రకటించింది. బాబ్‌ అల్‌-మండేబ్‌ జలసంధికి వైమానిక రక్షణ కల్పిస్తున్నామని, వందలాది హౌతీ లక్ష్యాలను ధ్వంసం చేశామని కూటమి తెలిపింది.

బాబ్‌ అల్‌.. ఇంత కీలకం ఎందుకు?
యెమెన్‌ పశ్చిమ తీరంలో ఉన్న బాబ్‌ అల్‌ మండేబ్‌ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌తో కలిపే ఈ మార్గం ద్వారా అంతర్జాతీయ వాణిజ్య నౌకలు రాకపోకలు సాగిస్తాయి. ఇటీవల హౌతీలు ఈ ప్రాంతంలో తమ పట్టును పెంచుకోవడంతో.. సముద్ర రవాణా, ఇంధన సరఫరాలపై ఆందోళనలు పెరిగాయి. అందుకే బాబ్‌ అల్‌ మందెబ్‌పై నియంత్రణ ఎవరి చేతిలో ఉంటుందనేది ఇప్పుడు యెమెన్‌ యుద్ధంలో కీలక అంశంగా మారింది.

యెమెన్‌ ప్రభుత్వ బలగాలు బాబ్‌ అల్‌ చుట్టుపక్కల కీలక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించాయి. ధుబాబ్‌ ప్రాంతం, విమానాశ్రయం, మొఖా వైపు వెళ్లే మార్గాలపై కూడా తమకు పట్టు లభించిందని తెలిపాయి. 

సనా వైపు కూడా దూకుడు
బాబ్‌ అల్‌ మండేబ్‌ ప్రాంతంలోనే కాకుండా.. హౌతీల ప్రధాన స్థావరమైన రాజధాని సనా వైపూ యెమెన్‌ ప్రభుత్వ బలగాలు వ్యూహాత్మక దాడిని ప్రారంభించినట్లు ప్రకటించాయి. హౌతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మరోవైపు హౌతీలు కూడా సౌదీపై దాడులు కొనసాగించగల సామర్థ్యం తమకు ఉందని చెబుతున్నారు. సౌదీ కీలక చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వారు చెబుతున్నారు.

ఇక ముందు ఏం జరుగుతుంది?
ఇప్పటివరకు యెమెన్‌ యుద్ధం ప్రధానంగా సౌదీ మద్దతున్న ప్రభుత్వ బలగాలు, హౌతీల మధ్యే సాగింది. ఇప్పుడు మక్కా ప్యాక్ట్‌ అమల్లోకి రావడంతో పాకిస్థాన్‌, టర్కీ కూడా సౌదీ భద్రతకు సైనికంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో సౌదీ మద్దతు ఉన్న యెమెన్‌ బలగాలు బాబ్‌-అల్‌-మండేబ్‌ నుంచి సనా వరకు దూకుడును పెంచుతున్నాయి. దీంతో యెమెన్‌లోని పోరు మరోసారి ప్రాంతీయ ఘర్షణగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సౌదీ భూభాగంపై దాడులు పెరిగితే మక్కా ప్యాక్ట్‌ కింద పాక్‌, టర్కీ సైనిక పాత్ర ఎంతవరకు విస్తరిస్తుందన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

ఇదీ చదవండి: బ్లాక్‌సీ జర్నీ.. భారతీయులకు ముప్పేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement