రష్యా డ్రోన్‌ దాడి.. ముగ్గురు భారతీయులు సేఫ్‌.. కెప్టెన్‌ మృతి | Russian Drone Attack in Black Sea: Cargo Ship Sinks 3 Indians Safe | Sakshi
Sakshi News home page

రష్యా డ్రోన్‌ దాడి.. ముగ్గురు భారతీయులు సేఫ్‌.. కెప్టెన్‌ మృతి

Oct 6 2026 6:48 AM | Updated on Oct 6 2026 6:48 AM

Russian Drone Attack in Black Sea: Cargo Ship Sinks 3 Indians Safe

నల్ల సముద్రంలో రష్యా దాడుల కలకలం రేపింది. వాణిజ్య నౌకపై డ్రోన్‌ విరుచుకుపడడంతో అది మునిగిపోయింది. ఈ దాడిలో ఒకరు మరణించగా.. మొత్తం 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. వాళ్లలో ముగ్గురు భారతీయులు ఉండగా.. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ‌

ఎంవీ రోయాద్‌ మమ్మదోవ్‌ అనే సరకు రవాణా నౌకపై రష్యా దాడి జరిపింది. మంటలు చెలరేగి అనంతరం సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో నౌక కెప్టెన్‌ మృతి చెందగా.. ముగ్గురు భారతీయ సిబ్బంది సహా మొత్తం 11 మందిని రొమేనియా సైన్యం రక్షించగలిగింది. ఈ దాడిని ఖండించిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ.. టర్కీకి చెందిన ఈ నౌకలో అజర్‌బైజాన్‌, భారత్‌కు చెందిన సిబ్బంది ఉన్నారని తెలిపారు.

దాడి సమాచారం అందిన వెంటనే రొమేనియాలోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. తొలుత నౌకలో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు, వారి పరిస్థితిపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపింది. అనంతరం ముగ్గురితో నేరుగా మాట్లాడినట్లు వెల్లడించింది. ముగ్గురు భారతీయులూ సురక్షితంగా ఉన్నారని, వారిలో ఒకరికి గాయాలు కావడంతో వైద్య చికిత్స అందుతున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. ఆసుపత్రి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ సిబ్బందికి అవసరమైన అన్ని సహాయాలు అందిస్తున్నామని పేర్కొంది.

రెండు డ్రోన్లతో దాడి
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ ఘటనపై స్పందిస్తూ.. రెండు రష్యా డ్రోన్లు పౌర నౌకపై దాడి చేశాయని ఆరోపించారు. నౌకలో మొక్కజొన్న సరకు ఉందన్నారు. దాడిలో నౌక కెప్టెన్‌ మృతి చెందినట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. మరో వ్యక్తి ఆచూకీపై కొంతసేపు స్పష్టత లేదని, 11 మంది సిబ్బందిని రక్షించగా వారిలో ఒకరికి గాయాలయ్యాయని తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై రష్యా నుంచి వెంటనే అధికారిక స్పందన రాలేదు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అంతకుముందు విడుదల చేసిన రోజువారీ బులెటిన్‌లో రెండు సరకు రవాణా నౌకలపై రష్యా దళాలు దాడులు చేసినట్లు పేర్కొన్నప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు.

ఇటలీకి వెళ్తుండగా..
ఎంవీ రోయాద్‌ మమ్మదోవ్‌ మొక్కజొన్న సరుకుతో ఇటలీలోని రావెన్నా వైపు వెళ్తోంది. ఇది సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ జెండాతో ప్రయాణిస్తోంది. అంతకుముందు ఉక్రెయిన్‌లోని ఇజ్‌మాయిల్‌ నౌకాశ్రయంలో ఈ నౌక నిలిచినట్లు నౌకల కదలికలను పర్యవేక్షించే వెసెల్‌ఫైండర్‌ సమాచారం వెల్లడించింది. ఇజ్‌మాయిల్‌ ఉక్రెయిన్‌లోని డాన్యూబ్‌ నదీ తీరంలో రొమేనియా సరిహద్దుకు సమీపంలో ఉన్న కీలక నౌకాశ్రయం. యుద్ధం కారణంగా నల్ల సముద్రంలోని ఇతర మార్గాలపై ప్రమాదాలు పెరగడంతో ఉక్రెయిన్‌ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఇది ముఖ్యమైన మార్గంగా మారింది. రొమేనియా మీడియా కథనాల ప్రకారం.. నౌకపై దాడి రొమేనియా ఇంధన సంస్థ ఓఎంవీ పెట్రోమ్‌ నిర్వహించే చమురు వేదిక సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది.

భారతీయ నావికులకు పెరుగుతున్న ముప్పు
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో నల్ల సముద్రంలో వాణిజ్య నౌకల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. క్షిపణులు, డ్రోన్ల దాడులతో పాటు సముద్రంలో కొట్టుకొచ్చే మందుపాతరలు కూడా వాణిజ్య నౌకలకు ముప్పుగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు భారతీయ నావికులు దాడుల బారినపడ్డారు. జూలైలో ఉక్రెయిన్‌లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరుతున్న సమయంలో ఎంవీ గోల్డెన్‌ లియో నౌకపై రష్యా క్షిపణి దాడి జరగడంతో నలుగురు భారతీయ నావికులు మృతి చెందారు. అంతకుముందు ఎంవీ ఒమోర్ఫి నౌకపై జరిగిన దాడిలో మరో భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. అదే నెలలో ఒడెసా నౌకాశ్రయంలో ఎంవీ ఏజీఎన్‌ రాగ్నర్‌ నౌకపై కూడా దాడి జరిగింది. అందులో నలుగురు భారతీయులు ఉండగా.. ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించారు. మరో ఇద్దరి ఆచూకీపై తొలుత ఆందోళన వ్యక్తమైంది. వరుస ఘటనల నేపథ్యంలో యుద్ధ ప్రభావిత నల్ల సముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకల్లో ఉద్యోగాలు తీసుకునే ముందు భద్రతాపరమైన ముప్పులను జాగ్రత్తగా అంచనా వేసుకోవాలని భారత్‌ తన పౌరులకు సూచించింది.

ఇదీ చదవండి: దుబాయ్‌ బంపర్‌ ఆఫర్‌.. వాళ్లకు మాత్రమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement