దుబాయ్: అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసా సదుపాయాన్ని కల్పిస్తోంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రైవేట్ ప్రారంభ బాల్య విద్యా కేంద్రాలు, పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అత్యుత్తమ విద్యావేత్తలను గుర్తించి గోల్డెన్ వీసా కోసం ఎంపిక చేస్తున్నారు. విద్యార్థుల అభ్యాస అనుభవాలను మెరుగుపరచడంతోపాటు విద్యా రంగంలో వినూత్న మార్పులకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
ఈ చొరవ దుబాయ్ ‘ఎడ్యుకేషన్ 33’ (E33) వ్యూహంలో భాగంగా కొనసాగుతోంది. ప్రతిభావంతులైన అధ్యాపకులను ఆకర్షించడం, వారిని ఎమిరేట్‌లో కొనసాగించేలా ప్రోత్సహించడం ద్వారా విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని E33 లక్ష్యంగా పెట్టుకుంది. విద్యా రంగాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులను కీలక భాగస్వాములుగా దుబాయ్ ప్రభుత్వం గుర్తిస్తోంది.
గోల్డెన్ వీసా ప్రయోజనాలు
• 10 సంవత్సరాల నివాసం: ఎటువంటి ఎంప్లాయర్ స్పాన్సర్‌షిప్ (కంపెనీ/యాజమాన్యం మద్దతు) అవసరం లేకుండా దుబాయ్‌లో నివసించవచ్చు. పనిచేయవచ్చు.
• కెరీర్ స్వేచ్ఛ: ఒక విద్యా సంస్థ నుంచి మరొక దానికి మారడానికి లేదా కెరీర్ మార్గాలను ఎంచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
• కుటుంబ స్పాన్సర్‌షిప్: వీసా పొందిన ఉపాధ్యాయులు తమ కుటుంబ సభ్యులను కూడా స్పాన్సర్ చేయవచ్చు
ఫీజు ఎలా ఉంటుందంటే..
దుబాయ్‌లో ఉపాధ్యాయుల కోసం ఇచ్చే 10 సంవత్సరాల గోల్డెన్ వీసా మొత్తం ప్రభుత్వ ఫీజు సాధారణంగా 2,800 నుంచి 4,500 దిర్హమ్‌ల వరకు (భారతీయ కరెన్సీలో రూ.64,000 నుంచి రూ.1,03,000) ఉంటుంది. ఈ మొత్తం ఖర్చు వీసా జారీ రుసుము, 10 సంవత్సరాల ఎమిరేట్స్ ఐడీ, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్, స్టేటస్ మార్పు.. ఇలా వేర్వేరు సేవలకు విడివిడిగా ఉంటుంది.
835 మందికిపైగా దరఖాస్తులు
2024 అక్టోబర్ 5న ఈ గోల్డెన్ వీసా కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి 835 మందికిపైగా అధ్యాపకులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో విద్యార్హతలు, వృత్తిపరమైన విజయాలు, విద్యా రంగానికి చేసిన సేవలు, సమాజంపై చూపిన ప్రభావం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి వచ్చిన సానుకూల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.


