breaking news
Indian sailors
-
గాలించినా ఫలితం దక్కలేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సమీపంలోని నల్ల సముద్రంలో డ్రోన్ దాడి కారణంగా సరుకు నౌక నుంచి గల్లంతైన ఇద్దరు భారతీయ నావికుల ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. రొమేనియా, ఉక్రెయిన్లకు చెందిన అన్వేషక బృందాలు తీవ్ర గాలింపు చేపట్టినా ఫలితం దక్కలేదని తెలిపింది. ఈ మేరకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనానికి ఒక నివేదికను అందజేశారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో జూలై 25న నల్ల సముద్రంలో ఎంవీ ఏజీఎన్ రాగ్నార్ అనే సరుకు నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఘటనలో భారతీయ నావికులు దీపక్ కుమార్ గుప్తా, రామచంద్ర సముద్రంలో గల్లంతయ్యారు. దీపక్ సోదరుడు సందీప్ కుమార్ వేసిన పిటిషన్‌ను విచారించింది. ఆగస్ట్ 5 నాటికి అందిన సమాచారం మేరకు నావికుల ఆచూకీ లభించలేదని, కచ్చితమైన తాజా సమాచారం అందితే తప్ప గాలింపు సాధ్యం కాదని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. సంబంధిత ఏజెన్సీలతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వివరించారు. స్పందించిన ధర్మాసనం నావికుల ఉపాధి ఒప్పందాల్లో బీమా సదుపాయం ఉంటుందని, బాధిత కుటుంబాలకు తక్షణం బీమా సాయం అందేలా చూడాలని సూచించారు. ఈ వ్యవహారంలో మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన నౌక ఫస్ట్ ఆఫీసర్ (ప్రత్యక్ష సాక్షి)ను విచారించి ప్రమాదం జరిగిన ప్రదేశం ఇతర వివరాలు తెలుసుకోవాలని పిటిషనర్ కోరగా కేంద్రం ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్‌ను ముందుగా చదవాలని సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేస్తూ, ఈలోగా తీసుకున్న చర్యలపై తాజా నివేదిక సమరి్పంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. -
బ్లాక్‌సీలో చిక్కుకున్న భారతీయ నావికులు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి భారతీయ నావికుల భద్రతపై ఆందోళన పెంచుతోంది. ఉక్రెయిన్‌లోని చోర్నోమోర్స్క్ పోర్టులో ఓ కార్గో నౌకలో 13 మంది భారతీయ నావికులు చిక్కుకుపోయారు. బ్లాక్‌సీ ప్రాంతంలో కొనసాగుతున్న డ్రోన్, క్షిపణి దాడుల మధ్య వారు ప్రాణభయంతో ఉన్నట్లు ఫార్వర్డ్ సీమన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) తెలిపింది.‘ఎంవీ అమీర్1’ అనే కార్గో నౌకలో మొత్తం 15 మంది సిబ్బంది ఉండగా.. అందులో 13 మంది భారతీయులేనని యూనియన్ వెల్లడించింది. నౌక చాలా రోజులుగా పోర్టులో నిలిచిపోయిందని, చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుసగా డ్రోన్, మిసైల్ దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల నడుమ.. నౌకలోని సిబ్బంది నిరంతరం భయంతో జీవిస్తున్నారని FSUI తెలిపింది. ఎప్పుడైనా నౌకపై నేరుగా దాడి జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే భారత ప్రభుత్వం, నౌక యజమానులు, సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని వారిని సురక్షితంగా తరలించాలని కోరింది.వరుస దాడులతో బ్లాక్‌సీ ప్రమాదకరంఇటీవల ఉక్రెయిన్ తీర ప్రాంతాల్లో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఓడెసా సమీపంలో ‘ఎంవీ ఓమోర్ఫీ’ నౌకపై జరిగిన దాడిలో ఓ భారతీయ నావికుడు మృతి చెందాడు. మరో ఘటనలో ‘ఎంవీ ఏజీఎన్ రాగ్నర్’ నౌకపై దాడి జరగగా.. కొందరు సిబ్బంది గల్లంతయ్యారు.భారతీయ నావికుల భద్రతపై ఆందోళనబ్లాక్సీ ప్రాంతం ప్రస్తుతం వాణిజ్య నౌకలకు అత్యంత ప్రమాదకరంగా మారింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు ఈ ప్రాంతాల్లో పనిచేసే ముందు భద్రతను అంచనా వేసుకోవాలని విదేశాంగ శాఖ ఇప్పటికే సూచనలు జారీ చేసింది. -
మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా
దుబాయ్: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఒమన్ తీరంలో హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ‘జీఎఫ్ఎస్ గెలాక్సీ’పై ఇరాన్ సైన్యం దాడికి దిగింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. వారిలో 10 మందిని రక్షించగా, ఒకరు గల్లంతయ్యారు. అతడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో మొత్తంగా 23 మందిని కాపాడారు. వాణిజ్య నౌకపై ఇరాన్ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. గల్లంతైన నావికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. మస్కట్‌లోని ఒమన్ అధికారులతో కలిసి ఇండియన్ ఎంబసీ గాలింపు చర్యలను సమీక్షిస్తోంది. ఇరాన్ దాడిలో నౌక వెంటనే మంటల్లో చిక్కుకుంది. హార్మూజ్ జలసంధిని మరోసారి మూసివేసినట్లు ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు హెచ్చరికగా జరిపిన దాడికి ఇరాన్ అభివర్ణించింది. ఈ దాడిలో సైప్రస్ జెండా కలిగిన జీఎఫ్ఎస్ గెలాక్సీ నౌక అగి్నకి ఆహూతయ్యింది. హార్మూజ్‌లో అది అనుమతి లేని మార్గంలో ప్రయాణిస్తోందని ఇరాన్ పేర్కొంది. ఈ ఘటన పట్ల ఎవరైనా ప్రతీకార చర్యకు దిగితే తమ ప్రతిస్పందన తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు జీఎఫ్ఎస్ గెలాక్సీపై జరిగిన దాడిని కారణంగా చూపుతూ అమెరికా సైన్యం ఇరాన్‌పై మరో విడత దాడులు చేపట్టింది. ఈ వారంలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడుల్లో ఇది మూడోది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని సుమారు 140 సైనిక లక్ష్యాలపై అమెరికా దాడులుచేసింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ స్థావరాలు, నౌకాదళ సామర్థ్యాలు, మందుగుండు సామగ్రి నిల్వ సౌకర్యాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, తీరప్రాంత నిఘా కేంద్రాలపై దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదివారం వెల్లడించింది. ఇరాన్‌లోని అత్యంత కీలకమైన ఖెష్మ్ దీవిపై ఆదివారం మధ్యాహ్నం నుంచి వరుస దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఇరాన్ అధికార వార్తా సంస్థ ఈ విషయం ప్రకటించింది. దీవిలోని సైనిక లక్ష్యాలపై కనీసం డజను దాడులు జరిగినట్లు తెలిపింది. ఇరాన్ ప్రతిదాడులు అమెరికా తాజా దాడుల పట్ల ఇరాన్ వెంటనే ప్రతిచర్యకు దిగింది. ఆదివారం ఉదయం బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, ఒమన్‌లపై వైమానిక దాడులకు దిగింది. అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకున్నట్లు ఖతార్ సైన్యం ప్రకటించింది. పొరుగున ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఖతర్‌లో ఇరాన్ దాడులను అడ్డుకునే క్రమంలో పడిన గగనతల రక్షణ వ్యవస్థ శకలాల కారణంగా ఒక చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఇరాన్ క్షిపణులను మధ్యలోనే ధ్వంసం చేశామని కువైట్ వెల్లడించింది. అమెరికా దూకుడుపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నౌకలు అనుమతి లేని మార్గాల్లో ప్రయాణిస్తున్నాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆరోపించింది. వాటిలో ఒకనౌకపై ముందస్తు హెచ్చరికగా కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపింది. హార్మూజ్‌ను మూసేశామని పేర్కొంది. అయితే హార్మూజ్ తెరచే ఉందని అమెరికా పేర్కొంది. వచ్చేవారం జనం ముందుకు మొజ్తబా! ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వచ్చేవారం ప్రజల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంస్మరణ సభను వచ్చేవారం నిర్వహించబోతున్నట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 23న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల దాకా ఈ సభ జరుగనుంది. అయితే, ఈ కార్యక్రమానికి మొజ్తబా హాజరవుతారా? లేదా? అనే దానిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.నౌకలపై ఎలాంటి ఆంక్షలు వద్దు: భారత్ హార్మూజ్‌లో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతుండటంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని, ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనేలా దౌత్యపరమైన పరిష్కారం కోసం జరుగుతున్న చర్చలను విజయవంతంగా ముగించాలని విన్నవించింది. హార్మూజ్‌లో నౌకలపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని స్పష్టంచేసింది. వాణిజ్య నౌకాయానం, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే ఆపాలని పేర్కొంది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుతమైన. నిరాటంకమైన నౌకాయానం, వాణిజ్యాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరింది. -
హార్ముజ్‌కు మళ్లీ వెళ్లం
హార్ముజ్ జలసంధి.. పశ్చిమాసియా సంఘర్షణలో అత్యంత ప్రభావితమైన ప్రాంతం. హార్ముజ్ గుండా ప్రయాణించడం అంటే నావికులు అసాధారణ ప్రమాదాలను ఎదుర్కోవడమే. యుద్ధంతో హార్ముజ్ జలసంధిలో నెలలపాటు చిక్కుకుపోయిన నావికులు ఎట్టకేలకు బయటకొచ్చారు. కానీ, మళ్లీ హార్ముజ్ పేరెత్తితేనే భయపడుతున్నారు. తాము మళ్లీ హార్ముజ్‌కు వెళ్లబోమని చెబుతున్నారు. పొట్టకూటికి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. వాణిజ్య నౌకాయానానికి నావికులను అందించే అతిపెద్ద దేశాల్లో భారత్ ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సముద్రయాన నిపుణులను పంపిస్తుంది. 2025లో ప్రపంచ వాణిజ్య నౌకా రవాణాలో 320,000 మందికి పైగా భారతీయ నావికులు పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ తొలి దాడుల తర్వాత, ఇరాన్ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. దీంతో ఘర్షణ సమయంలో గల్ఫ్‌లో వాణిజ్య నౌకాయానం లక్ష్యంగా మారింది. జూన్‌లో, ఒమన్ తీరంలో ఒక నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. అలాగే, భారతీయులు అధిక సంఖ్యలో ఉన్న మరో రెండు నౌకలపైనా దాడులు జరిగాయి. దీంతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వేలాది మంది భారత నావికులు గల్ఫ్‌ను వదిలి వచ్చేశారు. వీరిలో, ఇరాన్ షిప్పింగ్ శాఖ సహాయంతో వెళ్లిన 3,600 మందికి పైగా ఉన్నారు. భారత నావికులున్న నౌకలపైనా దాడులు జరిగాయి. మరికొందరు తమ సహచరులు చనిపోవడాన్ని చూశారు.యుద్ధాన్ని ముగించడానికి మధ్యంతర ఒప్పందం కుదిరినప్పటికీ, దాడులు కొనసాగుతుండటం, ఇప్పటికీ హార్ముజ్ జలసంధి గుండా రాకపోకలు ఉద్రిక్తంగానే ఉండటంతో.. ఘర్షణ సమయంలో జలసంధిలో ఉండిపోయి బయటపడిన వారిలో చాలామంది ఆందోళన చెందుతూనే ఉన్నారు. దాడి తర్వాత తీవ్ర నిరాశ... ‘‘మార్షల్ దీవుల జెండా ఉన్న ఒక బల్క్ క్యారియర్ నౌకలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాన్ని స్వయంగా చూశాను. మార్చిలో, మా కంపెనీకి చెందిన ‘సేఫ్సీ విష్ణు’ అనే ముడి చమురు ట్యాంకర్‌పై దాడి జరిగింది. ఆ దాడిలో ఒక భారతీయ సిబ్బంది మరణించారు. కొన్ని వారాల తర్వాత, మా నౌకపైనా దాడి జరిగింది. తెల్లవారుజామున, నా షిఫ్టుకు సిద్ధమవుతుండగా దాడి జరిగింది. మాకేమీ కాలేదు. కానీ, దాడి తర్వాత మా సిబ్బంది మొత్తం తీవ్ర నిరాశలోకి జారిపోయారు. అది జీవితాన్ని మార్చే అనుభవం, ఊహించలేనంత భయంకరమైనది. ఆ దాడి నన్ను కూడా తీవ్రంగా కుదిపేసింది. నేను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను. గల్ఫ్‌కు తిరిగి వెళ్లాలంటే భయంగా ఉంది. కానీ నేను పోషించాల్సిన కుటుంబం కూడా ఉంది కాబట్టి తప్పదు’’ అని గుజరాత్‌లోని చిన్న మత్స్యకార గ్రామానికి చెందిన 31 ఏళ్ల సీతారామ్ తండేల్ చెబుతున్నారు. పరిస్థితులు మెరుగుపడితేనే తిరిగి వెళ్తా.. ‘‘గల్ఫ్ నుంచి బయలుదేరడానికి సిద్ధమైన మార్షల్ దీవుల జెండా ఉన్న ఒక సరుకు రవాణా నౌకలో మార్చిలో చేరాను. మేం దాటడానికి చాలా ప్రయతి్నంచాం. దాడుల తీవ్రత ఎక్కువగా ఉంది. మా కంపెనీకి చెందిన మరో నౌకపై దాడి జరిగింది. ఘర్షణలు తగ్గినప్పుడు ‘ఈ ప్రయాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నా’మని ధృవీకరిస్తూ పత్రాలపై సంతకాలు చేయమని కోరారు. చివరికి, అర్ధరాత్రి వేళ ఆ ప్రమాదకర ప్రాంతం గుండా ప్రయాణించాం.’’ అని కేరళకు చెందిన 45 ఏళ్ల రతీసన్ కుట్టియన్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. పరిస్థితులు మెరుగుపడితేనే గల్ఫ్‌కు తిరిగి వెళ్తానంటున్నారు. నావికుడిగా ప్రయాణించాల్సిందే.. ‘‘ఒక సరుకు రవాణా నౌకలో హార్ముజ్ వైపు వెళ్తుండగా, మా ముందున్న నౌకపై దాడి జరిగింది. మా నౌక అబుదాబికి వెనుదిరిగింది. నేను యుద్ధ ప్రాంతంలో ఉన్నానని నా భార్యకు చెప్పలేదు. ఇప్పుడు విషయం తెలిసి ఇక ఎప్పుడూ గల్ఫ్ వెళ్లొద్దని చెబుతోంది. ఒక నావికుడిగా ప్రపంచమంతా ప్రయాణించాల్సిందేనని తెలుసు. కానీ.. తెలిసి తెలిసి ప్రాణాపాయ స్థితుల్లోకి వెళ్లలేం కదా’’ అంటున్నారు కేరళకు చెందిన 49 ఏళ్ల హరిదాస్. ఇక ఎప్పటికీ వెళ్లను.. ‘‘రెండు దశాబ్దాలకు పైగా సముద్ర ప్రయాణంలో గడిపాను. గల్ఫ్ నుంచి చైనా, సింగపూర్‌కు చమురును రవాణా చేస్తూ, అనేకసార్లు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాను. కానీ యుద్ధం నా దృక్పథాన్ని మార్చేసింది. మేం సింగపూర్‌కు బయలుదేరడానికి రెండు రోజుల ముందు యుద్ధం మొదలైంది. మా నౌకకు 10, 15 మీటర్ల దూరంలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. కొన్ని క్షిపణులు మాకు అతి దగ్గరగా దూసుకెళ్లాయి. నౌకను కదలించవద్దని ఆదేశాలు రావడంతో, దాదాపు మూడు నెలల పాటు అక్కడే నిలిచిపోయాం. భయమేసినా ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాయి. కాల్పుల విరమణ తర్వాతే నౌక కదిలింది. మే 29న దుబాయ్ మీదుగా నౌక బయలుదేరింది. విధులు ముగించుకుని దిగిపోయాను. ఇక హార్ముజ్‌కు ఎప్పటికీ వెళ్లను. నా ప్రాణం కంటే డబ్బు ఎక్కువ కాదు’’ అంటున్నారు 42 ఏళ్ల నావికుడు హిరేన్‌కుమార్ ప్రవీణ్. -
ఒమన్ తీరంలో 3 రోజుల్లో 3 వాణిజ్య నౌకలపై దాడులు
-
ఉక్రెయిన్ పోర్టులో చిక్కుకున్న 21 మంది భారత నావికులు
ముంబై: ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ పోర్టులో 21 మంది భారత నావికులు చిక్కుకుపోయారు. ఓ వాణిజ్య నౌకలో పనిచేస్తున్న వీరంతా కొన్నిరోజులుగా ఓడరేవులోనే ఉండిపోయారు. ఇప్పటికిప్పుడు బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. ప్రస్తుతం నావికులంతా క్షేమంగానే ఉన్నారని, తరచుగా కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారని షిప్ మ్యానింగ్ ఏజెన్సీ సీఈఓ సంజయ్ చెప్పారు. మరికొన్ని భారత నౌకలు కూడా మైకోలైవ్ పోర్టులో ఉన్నాయని తెలిపారు. ఈ ఓడరేవు నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్ 500 కిలోమీటర్లు, పోలండ్ సరిహద్దు 900 కిలోమీటర్ల దూరంలో ఉంది. -
చెరలో... నాలుగేళ్లు... లక్ష నరకాలు!
నాలుగు సంవత్సరాల క్రితం సోమాలియాలోని కోస్తా పట్టణం హరార్దెరె సమీపంలో ఓ నౌక కెప్టెన్‌తో సహా ఏడుగురు భారతీయ నావికులను సముద్రపు దొంగలు కిడ్నాప్ చేశారు. సమీపంలోని అడవుల్లో అష్టకష్టాలు పెట్టారు. సుదీర్ఘ చర్చల తరువాత పక్షం రోజుల క్రితం వారిని విడుదల చేశారు. ‘సముద్రపు దొంగలు డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇచ్చారా? తక్కువ ఇచ్చారా? అసలు ఎంత ఇచ్చారు?’ అనే విషయాలు వివరంగా తెలియకపోయినా, ఆ నాలుగు సంవత్సరాల్లో బందీలు ఎదుర్కొన్న బాధలు తెలిశాయి. వారి మాటల్లోనే కొన్ని విషయాలు... ‘‘నాలుగు సంవత్సరాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాం. మా ముఖాన నాసి రకమైన బియ్యం పడేసేవారు. కూరగాయలేమీ ఉండేవి కాదు. ఆ బియ్యాన్నే ఉడకబెట్టుకొని తినేవాళ్లం. ఇక నీళ్ల గురించి చెప్పనక్కర్లేదు’’ అని గతాన్ని కన్నీళ్ల మధ్య గుర్తు తెచ్చుకున్నాడు మన్జీత్సింగ్. ఆహారమే కాదు వస్త్రాల గురించి కూడా పట్టించుకునే వారు కాదు సముద్రపు దొంగలు. పాత లుంగీలు, చిరిగిన బనియన్లు, టీషర్ట్లు ఇచ్చేవాళ్లు. అవి ఒక్కసారి ధరిస్తే, పూర్తిగా పాడైన తరువాతగానీ వేరేవి ఇచ్చేవాళ్లు కాదు. ఇక అండర్వేర్ల ఊసే ఉండేది కాదు. తమ పాత బనీయన్నే అండర్‌వేర్‌గా కుట్టుకునేవారు. కారణం తెలియదుగానీ సోమాలియా సముద్రపు దొంగలు సిక్కులు అంటే మండిపడేవారు. ఆ భయంతోనే చండీఘడ్‌కు చెందిన సోహన్‌సింగ్ తన మతం ఏమిటన్నది తెలియకుండా దాచడానికి ప్రయత్నించేవాడు. ‘‘నేను హిందువును’’ అని చెప్పుకున్నా దొంగలు బలవంతంగా అతడి గడ్డాన్ని తీయించారు. ఆ సంఘటన తనను ఎంతో బాధకు గురి చేసిందని చెబుతాడు సోహన్‌సింగ్. ఒకవైపు 55 డిగ్రీల ఉష్ణోగ్రత, మరోవైపు నైలాన్ దుస్తులు...అమ్మో...ఆ బాధ మాటలకు అందదు’’ అంటూ ఆ నరకప్రాయమైన అనుభవాలను ప్రస్తావించాడు జోసెఫ్. బతుకు మీద ఒకే ఒక ఆశ ఏమిటంటే ఆరు నెలలకొకసారో, సంవత్సరానికి ఒకసారో కుటుంబసభ్యులతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం. అయిదు నిమిషాలకు మించని ఆ ఫోన్ సంభాషణ మాట్లాడినట్లు ఉండేది కాదు. మాట్లాడనట్లూ ఉండేది కాదు. తాము ఇంకా సజీవంగా ఉన్నామని లోకానికి తెలియజేయడానికే అలా ఫోన్లో మాట్లాడించేవారు. ‘‘వారి మాటలకు ఎదురు చెప్పినా, అసహనంగా కనిపించినా చేయి చేసుకునేవారు. క్రూరత్వం గురించి కథల్లో చదవడం, సినిమాల్లో చూడడం తప్ప నిజజీవితంలో చూడడం ఇదే’’ అంటాడు 45 ఏళ్ల భీమ్సేన్. నౌకలో ఈయన ఎలక్ట్రికల్ ఆఫీసర్. ‘‘ఇప్పటి వరకు మిమ్మల్ని బాధ పెట్టింది చాలు. ఇక రేపో మాపో విడుదల చేస్తాం’’ అన్నప్పుడల్లా బందీల కళ్లలో వేల వసంతాలు వెల్లివిరిసేవి. అలా నాలుగు సంవత్సరాల్లో ఎన్ని ఆశలు పెట్టారో! ‘‘మానసిక, శారీరక హింసల మధ్య నలిగి పోతూ చివరి ఆశను కూడా వదులుకున్నాం’’ అని చేదు గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు జోసెఫ్. బందీలైన నావికులను చేతులు వెనక్కి కట్టి, చావ బాదుతూ ఫోటోలు తీసేవారు. వాటిని నౌక యజమానికి పంపి- ‘‘డబ్బులు పంపించకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది’’ అని బెదిరించేవారు. భారత ప్రభుత్వ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సోమాలియా ప్రభుత్వం సముద్రపు దొంగలతో అనేక దఫాలుగా జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. మొన్న అక్టోబర్ 30న బందీలు విడుదలయ్యారు. కెన్యా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ కెక్యూ-202లో వారు స్వదేశానికి చేరుకున్నారు. తమ కోసం కళ్లలో ఒత్తులు వేసుకొని నిరీక్షిస్తున్న కుటుంబసభ్యులను సుదీర్ఘకాలం తరువాత కలుసుకున్నారు. కథ సుఖాంతమైంది. ‘‘ఆ నరకపు రోజులను పూర్తిగా మరిచిపోండి’’ అన్నారు ఒక సైకాలజిస్ట్ అప్పటి బందీలలో ఒకరైన భాస్కరన్‌తో. భాస్కరన్ నోటి నుంచి అయితే సమాధానం రాలేదుగాని, అతడి కళ్లు చెబుతున్నాయి...‘అది ఇప్పట్లో సాధ్యపడే విషయమేనా?’ అని.


