రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి భారతీయ నావికుల భద్రతపై ఆందోళన పెంచుతోంది. ఉక్రెయిన్‌లోని చోర్నోమోర్స్క్ పోర్టులో ఓ కార్గో నౌకలో 13 మంది భారతీయ నావికులు చిక్కుకుపోయారు. బ్లాక్‌సీ ప్రాంతంలో కొనసాగుతున్న డ్రోన్, క్షిపణి దాడుల మధ్య వారు ప్రాణభయంతో ఉన్నట్లు ఫార్వర్డ్ సీమన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) తెలిపింది.
‘ఎంవీ అమీర్1’ అనే కార్గో నౌకలో మొత్తం 15 మంది సిబ్బంది ఉండగా.. అందులో 13 మంది భారతీయులేనని యూనియన్ వెల్లడించింది. నౌక చాలా రోజులుగా పోర్టులో నిలిచిపోయిందని, చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుసగా డ్రోన్, మిసైల్ దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల నడుమ.. నౌకలోని సిబ్బంది నిరంతరం భయంతో జీవిస్తున్నారని FSUI తెలిపింది. ఎప్పుడైనా నౌకపై నేరుగా దాడి జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే భారత ప్రభుత్వం, నౌక యజమానులు, సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని వారిని సురక్షితంగా తరలించాలని కోరింది.
వరుస దాడులతో బ్లాక్‌సీ ప్రమాదకరం
ఇటీవల ఉక్రెయిన్ తీర ప్రాంతాల్లో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఓడెసా సమీపంలో ‘ఎంవీ ఓమోర్ఫీ’ నౌకపై జరిగిన దాడిలో ఓ భారతీయ నావికుడు మృతి చెందాడు. మరో ఘటనలో ‘ఎంవీ ఏజీఎన్ రాగ్నర్’ నౌకపై దాడి జరగగా.. కొందరు సిబ్బంది గల్లంతయ్యారు.
భారతీయ నావికుల భద్రతపై ఆందోళన
బ్లాక్‌సీ ప్రాంతం ప్రస్తుతం వాణిజ్య నౌకలకు అత్యంత ప్రమాదకరంగా మారింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు ఈ ప్రాంతాల్లో పనిచేసే ముందు భద్రతను అంచనా వేసుకోవాలని విదేశాంగ శాఖ ఇప్పటికే సూచనలు జారీ చేసింది.


