కీవ్‌పై భీకర దాడి..10 మంది మృతి  | Russian strike on Ukrainian arms expo prompts outrage in Kyiv | Sakshi
Sakshi News home page

కీవ్‌పై భీకర దాడి..10 మంది మృతి 

Jul 25 2026 4:55 AM | Updated on Jul 25 2026 4:55 AM

Russian strike on Ukrainian arms expo prompts outrage in Kyiv

కీవ్‌: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై శుక్రవారం రష్యా భీకర క్షిపణి దాడికి పాల్పడింది. ఘటనలో కనీసం 10 మంది చనిపోగా, మరో 100 మంది వరకు గాయపడ్డారు. సెంట్రల్‌ కీవ్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ప్రైవేట్‌ రక్షణ ఉత్పత్తిదారుల ప్రతినిధుల సమావేశంపై ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. దాడి తీవ్రతకు చుట్టుపక్కలున్న 27 ఇళ్లు, 44 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయన్నారు. 

ఇతర వివరాలను తెలిపేందుకు నిరాకరించారు. ప్రభుత్వం కూడా దాడి మీడియా కవరేజీపై ఆంక్షలు విధించింది. కాగా, రష్యా దాడుల భయమున్న విషయం తెలిసీ ఆ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేయడంపై ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ రుస్లాన్‌ క్రవ్‌చెంకో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై వేరుగా క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామన్నారు. 

ఇలా ఉండగా, సరిహద్దులకు 1,350 కిలోమీటర్ల దూరంలోని రష్యాలో ని కిరోవ్‌లో ఉన్న ఆయిల్‌ డిపోతోపాటు, మిలటరీ ప్లాంట్‌పైనా తాము డ్రోన్‌ దాడులు చేపట్టినట్లు జెలెన్‌స్కీ చెప్పారు. దాడిలో ఆరుగురు చనిపోగా, 26 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కాగా, రష్యాలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ రిటైలర్‌ వైల్డ్‌బెర్రీస్‌కు చెందిన సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లోని గోదాముపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడికి పాల్పడింది. గోదాము నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. 

రేథియాన్‌తో జెలెన్‌స్కీ భేటీ 
రష్యా క్షిపణి దాడులను తట్టుకునే గగనతల రక్షణ వ్యవస్థలను సమకూర్చుకునేందుకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చర్యలను వేగవంతం చేశారు. గురువారం కీవ్‌లో జెలెన్‌స్కీని రేథియాన్‌ కంపెనీ ప్రతినిధి బృందం కలిసింది. ఉక్రెయిన్‌తో కలిసి పేట్రియాట్‌ గగనతల రక్షణ వ్యవస్థలను ఉత్పత్తి చేసేందుకు గల అవకాశాలపై వీరు చర్చించారు. రాడార్లు, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థలు, ఇంటర్‌సెప్టార్‌ క్షిపణులు ఈ వ్యవస్థల్లో ఉంటాయి. ప్రభుత్వ రంగంలో లేదా ప్రైవేట్‌ రంగంలో పేట్రియాట్‌ వ్య వస్థలను సమకూర్చుకునేందుకు తా ము సిద్ధంగా ఉన్నామంటూ అనంతరం జెలెన్‌స్కీ సోషల్‌ మీడియాలో ప్రకటించారు. అయితే, ఈ వ్యవహారం అంతసులువుగా కార్యాచరణలోకి వచ్చే అవకాశాలు లేవని నిపుణులు అంటున్నారు. ఉత్పత్తి దశకు చేరుకునేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement