కోర్టు గేట్లకు ఏముండాలో మేం చూసుకుంటాం! | Supreme Court dismisses plea for guidelines on displaying Ashoka Chakra | Sakshi
Sakshi News home page

కోర్టు గేట్లకు ఏముండాలో మేం చూసుకుంటాం!

Jul 29 2026 5:11 AM | Updated on Jul 29 2026 5:11 AM

Supreme Court dismisses plea for guidelines on displaying Ashoka Chakra

అశోక చిహ్నం లేదంటూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీం  

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు భవనం ప్రధాన గుమ్మటం, గేటు, అధికార పత్రాలపై జాతీయ చిహ్ననికి బదులుగా న్యాయస్థానం తన సొంత చిహ్నాన్ని వినియోగించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టు గేట్లపై ఏముండాలో నిర్ణయించే విషయాన్ని తమకు వదిలేయాలని, ఇతర సామాజిక సమస్యలపై దృష్టి పెట్టాలని పిటిషనర్‌కు హితవు పలికింది. ఈ అంశంపై బదరవాడ వేణుగోపాల్‌ అలియాస్‌ బాబా ఖతర్నాక్‌ అనే వ్యక్తి స్వయంగా పిటిషన్‌ వేశారు. కేంద్ర హోంశాఖ–2007 నిబంధనల ప్రకారం రాజ్యాంగ సంస్థలు జాతీయ చిహ్నాన్ని మాత్రమే ప్రదర్శించాలని, కానీ 1958లో ప్రారంభమైన సుప్రీంకోర్టు భవనంపై జాతీయ చిహ్నం ఇప్పటి వరకు లేదని ఆయన పేర్కొన్నారు.

రిజిస్ట్రీ సైతం కోర్టు సొంత చిహ్నన్నే వాడుతోందని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ధర్మాసనం దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది. ‘సుప్రీంకోర్టు గేట్లు, తలుపులపై ఏముండాలనే విషయాన్ని మాకే వదిలేయండి. మీ ఆహార్యం చూస్తుంటే సన్యాసిలా ఉన్నారు, ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. వాటిపై దృష్టిపెట్టి సమాజ సేవ చేసుకోండి. కోర్టు గేట్ల విషయం మేం చూసుకుంటాం‘అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర హోంశాఖ నిబంధనలను పిటిషనర్‌ ప్రస్తావించినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. పిటిషన్‌లో విచారణార్హమైన అంశాలు లేవంటూ కొట్టివేసింది.

గతంలో వేసిన పిటిషన్‌కు కొనసాగింపు
కోర్టులకు రాజ్యాంగపరమైన గుర్తింపు వంటి అశోక చిహ్నం సుప్రీంకోర్టుకు ఏర్పాటు చేసేందుకు తగు ఆదేశాలు జారీ చేయాలంటూ వేణుగోపాల్‌ రాజ్యాంగంలోని ఆర్టీకల్‌ 32 ప్రకారం గతంలో ఒక రిట్‌ వేశారు. మార్చి 23న సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ అంశం పరిపాలనాపరమైనదని పేర్కొంటూ దీనిపై తగిన నోట్‌ను సంబంధిత అధికారికి పంపించాలని సెక్రటరీ జనరల్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాల పురోగతిని తెలపాలంటూ వేణుగోపాల్‌ జూలై 3న రిజిస్ట్రార్‌ ద్వారా మరో పిటిషన్‌ వేశారు. ఆ తర్వాత, రిజిస్ట్రార్‌ ఉత్తర్వును సవాల్‌ చేస్తూ చేసిన అప్పీలును మంగళవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏం ప్రదర్శించాలనేది తమ సొంత విషయమంటూ అప్పీల్‌ను కొట్టివేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement