పెళ్లి చేసుకున్నామంటూ పెట్టిన ఫొటోలో ఆ నలుగురు
సోషల్ మీడియా ప్రాంక్!
అమ్రోహా: ఒకే వ్యక్తిని ముగ్గురు పెళ్లాడిన వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, దీనిపై ఆన్‌లైన్‌లో పెద్ద దుమారమే చెలరేగింది. స్పందించిన యూపీ మహిళా సంక్షేమ కమిటీ(సీడబ్ల్యూసీ) అధికారులు ఆ ముగ్గురినీ సోమవారం పిలిపించారు. విచారణలో వారు చెప్పిన విషయాలను విని అధికారులు నోరెళ్లబెట్టారు. అదంతా వైరలయ్యేందుకు తీసుకున్న వీడియో మాత్రమేనని వారు అసలు విషయం వెల్లడించారు. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు తీసిన ప్రాంక్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. అయితే, తమపై ఆన్‌లైన్ ట్రోలింగ్ ఘోరంగా ఉందని వాపోయారు. అది నిజంగా పెళ్లేనంటూ అబద్ధం చెప్పినందుకు పశ్చాత్తాప పడుతున్నారు. ఇకనైనా వేధింపులను ఆపాలని వారు వేడుకున్నారు.
ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు వీడియోలో కనిపించిన ముగ్గురిలో ఒకరు మైనర్ అంటూ తమకు మూడు రోజుల క్రితం అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు సీడబ్ల్యూసీ చైర్మన్ అతులేశ్ కుమార్ భరద్వాజ్ వివరించారు. ముగ్గురి నుంచి వాంగ్మూలాలను సేకరించామని, వీరిలో ఒకరు మైనర్ అని రూఢీ అయ్యిందని చెప్పారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామన్నారు. యూపీలోని అమ్రోహా జిల్లా ధోరియా గ్రామానికి చెందిన దేవిక, ఛావి అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు, వారి బంధువు మెహర్‌పూర్‌కు చెందిన ఆల్కా కలిసి శ్యాంపురి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కును హసన్‌పూర్‌లోని చాముండ ఆలయంలో వివాహమాడినట్లు ఆన్‌లైన్‌లో వీడియో ప్రత్యక్షమైంది.
వీరు నలుగురూ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, ఆన్‌లైన్‌లో బాగా ఫాలోయింగ్ ఉన్న వాళ్లు. ఆరు నెలలుగా వికాస్ ముగ్గురికీ భర్తగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నాడు. అయితే, ముగ్గురు యువతులు ఒక్కరినే వివాహమాడటం సనాతన ధర్మానికి విరుద్ధమంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, తాము మైనర్లమనీ, ఇష్టం వచ్చిన వారిని పెళ్లాడే హక్కు తమకుందని, పురాణాల్లోనూ ఇలాంటి ఉదాహరణలున్నాయంటూ వారు మొదట్లో కొట్టిపారేశారు.
అదేవిధంగా, ముగ్గురు యువతులు, ఒక యువకుడి పెళ్లి తాను జరిపించలేదని చాముండ ఆలయ పూజారి స్పష్టం చేస్తున్నారు. వివాదాస్పద వీడియోలో ఉన్న ఆ నలుగురినీ ఈ నెల 23వ తేదీన పిలిపించి, వారి వయస్సును నిర్ధారించే పత్రాలను సమరి్పంచాలని, లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని కోరామని హసన్‌పూర్ సీనియర్ ఎస్సై అమిత్ కుమార్ తెలిపారు. అయితే, వారింకా వాటిని ఇవ్వలేదన్నారు.


