రియాద్: చమురు సంపదకు కేరాఫ్‌గా ఉన్న సౌదీ అరేబియాపై యెమెన్ హూతీలు మరోసారి విరుచుకుపడ్డారు. క్షిపణులు, డ్రోన్లతో ఏకంగా రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకున్నామని ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రపంచ చమురు మార్కెట్‌ను ప్రభావితం చేయగల ఆరామ్‌కో చమురు స్థావరాలు, కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడులు చేసినట్లు వెల్లడించారు. ఆరు విడతల్లో సైనిక ఆపరేషన్లు నిర్వహించామని హూతీ ప్రతినిధి యాహ్యా సరీ ప్రకటించారు. దీంతో సౌదీ రక్షణ వ్యవస్థ అప్రమత్తమైంది. ఆదివారం కూడా రియాద్ వైపు దూసుకొచ్చిన రెండు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ప్రకటించాయి. తాజాగా క్రూయిజ్ క్షిపణులను కూడా అడ్డుకున్నట్లు వెల్లడించాయి. దీంతో సౌదీ-యెమెన్ మధ్య ఘర్షణ మరోసారి తీవ్రరూపం దాల్చింది.
హూతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మొదటి ఆపరేషన్‌లో రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆరామ్‌కో చమురు నిల్వ ట్యాంకులు, డిస్టిలేషన్ టవర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. రెండో దాడిలో ఖురైస్ చమురు క్షేత్రంలోని ఆరామ్‌కో స్థావరాలను, మూడో దాడిలో దవాద్మిలోని చమురు పంపింగ్ స్టేషన్ నంబర్ 8ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన మూడు ఆపరేషన్లలో నజ్రాన్‌లోని సౌదీ నేషనల్ గార్డ్ శిబిరంతో పాటు ఇతర సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించారు. అయితే ఈ లక్ష్యాలపై దాడులు విజయవంతమయ్యాయా? ఎంత మేర నష్టం జరిగింది? అన్నది సౌదీ అధికారులు పూర్తిగా ధ్రువీకరించలేదు.
Yemen’s Houthis say at least 25 people have been killed and 30 injured in air strikes they blame on the Saudi-led coalition. Houthi-affiliated media report that nine attacks targeted telecommunications networks in Sa’ada governorate. https://t.co/ujfzahiqZK
— Al Jazeera English (@AJEnglish) November 7, 2026
సౌదీ క్షిపణులను అడ్డుకున్న రక్షణ వ్యవస్థ
హూతీల దాడుల ప్రకటనల నేపథ్యంలో సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ అప్రమత్తమైంది. ఆదివారం రియాద్ ప్రావిన్స్ వైపు వచ్చిన రెండు బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసినట్లు సంకీర్ణ దళాలు ప్రకటించాయి. అనంతరం రియాద్, దక్షిణ సౌదీ వైపు వచ్చిన రెండు క్రూయిజ్ క్షిపణులను కూడా అడ్డుకున్నట్లు వెల్లడించాయి. నజ్రాన్ ప్రాంతంలోనూ పౌర రక్షణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.
24 గంటల్లో 105 దాడులు..
మరోవైపు యెమెన్‌పై సౌదీ వైమానిక దాడులు తీవ్రతరం చేసిందని హూతీలు ఆరోపిస్తున్నారు. గత 24 గంటల్లో యెమెన్‌లోని 105 ప్రాంతాలపై వైమానిక, క్షిపణి దాడులు జరిగాయని యాహ్యా సరీ పేర్కొన్నారు. ఈ దాడుల్లో 30 మందికి పైగా పౌరులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ఆరోపించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారని తెలిపారు. అయితే ఈ గణాంకాలను స్వతంత్రంగా ధ్రువీకరించాల్సి ఉంది.
మార్కెట్‌పై దాడే ప్రతీకారానికి కారణమా?
యెమెన్‌లోని తైజ్ ప్రావిన్స్ అల్-వజియా జిల్లాలో అల్-హదారా మార్కెట్‌పై శుక్రవారం జరిగిన దాడిలో కనీసం 30 మంది మరణించారని హూతీలు ఆరోపించారు. వ్యాపారులు, కొనుగోలుదారులు సహా పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అయితే ఈ దాడికి సంబంధించి యెమెన్ ప్రభుత్వ దళాలు హూతీలపైనే ఆరోపణలు చేశాయి. ఇరు వర్గాల వాదనల్లో భిన్నత్వం ఉండటంతో అసలు ఘటనపై స్వతంత్ర విచారణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గల్ఫ్ ప్రాంతానికి పెరుగుతున్న ముప్పు!
సౌదీ చమురు కేంద్రాలు, విమానాశ్రయాలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్న ప్రకటనలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆరామ్‌కో చమురు మౌలిక సదుపాయాలకు నష్టం జరిగితే ప్రపంచ చమురు సరఫరా, ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే యెమెన్‌లో కొనసాగుతున్న అంతర్గత పోరు, సౌదీ మద్దతున్న ప్రభుత్వ దళాలు-హూతీల మధ్య ఘర్షణలు మరింత తీవ్రమవుతున్నాయి. 2022లో కుదిరిన కాల్పుల విరమణ కూడా ఇటీవలి పరిణామాలతో బలహీనపడింది. మొత్తానికి.. ఒకవైపు సౌదీ క్షిపణులను అడ్డుకుంటుంటే.. మరోవైపు హూతీలు మరిన్ని దాడులకు సిద్ధమంటూ హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: ట్రంప్‌కు కొత్త కష్టాలు.. కోలుకోలేని షాకిచ్చిన ఇరాన్!


