హౌతీల దాడి.. మక్కా, మదీనాలో క్షిపణి శకలాలు! | Houthi Incident: Saudi Says Shrapnel Fell In Mecca Medina | Sakshi
Sakshi News home page

హౌతీల దాడి.. మక్కా, మదీనాలో క్షిపణి శకలాలు!

Oct 25 2026 7:13 AM | Updated on Oct 25 2026 7:18 AM

Houthi Incident: Saudi Says Shrapnel Fell In Mecca Medina

సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా ప్రాంతాల్లో క్షిపణి శకలాలు పడినట్లు ఆ దేశ పౌర రక్షణ విభాగం శనివారం వెల్లడించింది. ఇరాన్‌ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులను ప్రయోగించారని.. వాటి శకలాలు పలు ప్రాంతాల్లో పడినట్లు తెలిపింది. ఉగ్రవాద హౌతీ మిలీషియా మక్కా అల్‌ ముకర్రమా, మదీనా అల్‌ మునవ్వరా ప్రాంతాల వైపు ప్రయోగించిన రెండు బాలిస్టిక్‌ క్షిపణుల శకలాలు కిందపడ్డాయని సౌదీ పౌర రక్షణ విభాగం ఎక్స్‌ వేదికగా పేర్కొంది.

ఈ శకలాలు మక్కా వెలుపల వాదీ ముగమాస్‌, జెడ్డాలోని అల్‌ నుజా ప్రాంతం, తైఫ్‌లోని వాదీ జలీల్‌, రబీఘ్‌లోని జనావాసాలు లేని ప్రాంతంలో పడినట్లు వెల్లడించింది. అయితే, ఇస్లాం మతానికి అత్యంత పవిత్రమైన ఈ రెండు నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వస్తున్న ఆరోపణలను హౌతీలు ఖండించారు. మక్కా, మదీనా పవిత్ర ప్రాంతాలపై మా బలగాలు దాడి చేశాయంటూ సౌదీ శత్రువు చేస్తున్న ప్రచారం చాలా పెద్ద అబద్ధమంటూ హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరీన్‌ పేర్కొన్నారు.

శనివారం అంతకుముందు సౌదీ పౌర రక్షణ విభాగం దేశంలోని పశ్చిమ ప్రాంతాల్లోని నాలుగు ప్రావిన్సుల్లో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. వీటిలో మక్కా ప్రాంతం కూడా ఉంది. ఆయా ప్రాంతాల ప్రజలు సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. శుక్రవారం, శనివారాల్లో సౌదీలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు హౌతీలు ప్రకటించిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. సౌదీ రాజధాని రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై రెండు దశల్లో దాడి చేసినట్లు హౌతీ సైనిక ప్రతినిధి తెలిపారు. దమ్మామ్‌, నజ్రాన్‌ ప్రాంతాల్లోని విమానాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. 

అలాగే దక్షిణ ప్రాంతంలోని ఖమీస్‌ ముషైత్‌ వైమానిక స్థావరం, ముడి చమురు పంపింగ్‌ కేంద్రాలు, తూర్పు నుంచి పశ్చిమానికి చమురును తరలించే పైప్‌లైన్‌పై దాడులు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు యెమెన్‌లోని సౌదీ మద్దతుగల ప్రభుత్వం కూడా కీలక ప్రకటన చేసింది. దక్షిణ ప్రాంతంలోని ఓడరేవు నగరం ఏడెన్‌లో ఉన్న కోస్ట్‌గార్డ్‌ కేంద్రాలపై హౌతీలు మూడు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు వెల్లడించింది. ఈ పరిణామాలతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

ఇదీ చదవండి: నిరసనలతో దద్దరిల్లిన ఫ్రాన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement