breaking news
Medina
-
కడసారి చూసేందుకు..
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ/ముషీరాబాద్/ నాంపల్లి: కడసారి తమ వారిని చూసుకునేందుకు, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 38 మంది మదీనాకు బయలుదేరారు. మంగళవారం రాత్రి 8 గంటలకు నాంపల్లిలోని హజ్ భవన్‌కు వారంతా వచ్చారు. శంషాబాద్ఎయిర్పోర్ట్ నుంచి రాత్రి ఒంటి గంటకు విమానంలో బయలుదేరారు. వీరంతా బుధవారం ఉదయం మదీనాకు చేరుకుంటారు. సోమవారమే అక్కడకు వెళ్లిన మంత్రి అజహరుద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.షఫీవుల్లా, ఇతర ప్రభుత్వ అధికారులు మదీనాకు వచ్చేవారికి దగ్గరుండి ఏర్పాట్లు చేస్తారు. అయితే ప్రమాదం జరిగి 30 గంటలు దాటుతున్నా, బంధువులను ఎంత మందిని మదీనాకు తీసుకువెళ్లాలి అనేదానిపై హజ్ కమిటీ జాప్యం చేస్తుందని బాధిత కుటుంబాల బంధువులు మంగళవారం ఉదయం మాజీ హోంమంత్రి మహమూద్ ఆలీ, ఎమ్మెల్యే తనయుడు ముఠా జైసింహ దృష్టికి తీసుకువెళ్లారు. వారు వెంటనే విద్యానగర్ నుంచి నేరుగా నాంపల్లిలోని హజ్ భవన్‌కు చేరుకొని హజ్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హజ్ కమిటీ సభ్యులు, బంధువుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఒక దశలో బంధువులు ధర్నాకు దిగారు. దీంతో స్పందించిన ప్రతినిధులు ఎంత మంది వెళతారో జాబితా ఇవ్వాలని కోరగా బంధువుల లిస్టును వారికి సమర్పించారు. అందులో 34 మందిని ఎంపిక చేశారు. వీరితోపాటు నలుగురు అధికా రులు కూడా వెళుతున్నారు. విద్యానగర్ నుంచి మహ్మద్ సోహెబ్, ఇబ్రహీం షరీఫ్, సాదిజ్పాషా, షేక్ రషీద్, మునీర్ అహ్మద్, ఇర్ఫాన్ షరీఫ్, గౌస్ షేక్, అబ్దుల్ ఇర్షాద్, అబ్దుల్ వహిద్, అబ్దుల్ రషీద్‌లు మదీనాకు వెళ్లినవారిలో ఉన్నారు. వీరంతా రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో వెళుతున్నారని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ బియబానీ ఖుస్రోపాషా ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ప్రభుత్వ ఖర్చులతో బాధిత కుటుంబాలు మదీనాకు వెళుతున్నాయని, సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని పబ్లిక్ గార్డెన్స్‌లోని రాయల్ మసీదులో ప్రత్యేక దువా చేశామని చెప్పారు. నేడు, లేదా రేపు అంత్యక్రియలుబస్సులో సజీవ దహనమైన వారి అంత్య క్రియలు బుధ లేదా గురువారాల్లో జరిగే అవకాశముంది. ఈ మేరకు సౌదీ ప్రభుత్వం ఢిలీలోని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇచ్చింది. డీఎన్ఏ పరీక్షల అనంతరం ఆయా కుటుంబాలకు మృతదేహాలను అప్పగిస్తారు. వారి సమక్షంలోనే ఖననం చేసేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే ఖననం: హజ్, ఉమ్రా యాత్ర సమయంలో యాత్రికులు విమానం లేదా రైలు, రోడ్డు ప్రమాదంలో ఒకవేళ మరణిస్తే.. మృతదేహాలను సౌదీ అరేబియాలోనే ఖననం చేయడానికి వారు, వారి కుటుంబ సభ్యులు అంగీకరించినట్టు యాత్రకు వెళ్లే ముందు దరఖాస్తు ఫారమ్‌లో స్పష్టంగా పేర్కొంటారు. ఒకవేళ ప్రమాదం జరిగిన తర్వాత వారి కుటుంబ సభ్యులు తమ వారి మృతదేహాలు అప్పగించాలని అభ్యంతరం తెలిపినా, యాత్రికులు ముందే అనుమతి ఇచ్చినందున మృతదేహాలను వెనక్కి పంపించడం చట్టపరంగా సాధ్యం కాదని కేంద్ర హజ్ కమిటీ అధికారులు చెబుతున్నారు. మక్కా, మదీనా వంటి తీర్థయాత్రలకు వెళ్లే ముందు యాత్రికులు నింపే అధికారిక ఫారంలోనే ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొంటారు. ఒకవేళ యాత్ర సమయంలో యాత్రికుడు మరణిస్తే.. మృతదేహాన్ని సౌదీ అరేబియాలోనే ఖననం చేయడానికి అంగీకరిస్తూ ఆ ఫారంలో వారు సంతకం చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను భారత్‌కు తీసుకురావడం చట్టపరంగా సాధ్యం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నష్టపరిహారంపై నిబంధన సౌదీ హజ్ చట్టం ప్రకారం.. హజ్, ఉమ్రా మతపరమైన యాత్రలు కాబట్టి వాటికి.. ప్రభుత్వపరంగా ఎలాంటి బీమా ఆధారిత సౌకర్యాలు ఉండవు. హజ్ యాత్ర సమయంలో ఎవరైనా మరణిస్తే.. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం చెల్లించదు. హజ్ యాత్రికులు భారత్‌లో ప్రైవేట్ బీమా తీసుకొని ఉంటే.. వారి పాలసీ ప్రకారం ఆర్థిక సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియను సౌదీ అరేబియా ప్రభుత్వం కాకుండా, సంబంధిత యాత్రికుడి దేశం, వారి బీమా సంస్థ ద్వారా మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది. కాలిపోయిన ముద్దలు చూసి ఏం చేస్తారుఅవమానకర వ్యాఖ్యలు చేసిన ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అభ్యంతరం తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు..హజ్ హౌస్‌లో వాగ్వాదం..తక్షణమే డిప్యుటేషన్ రద్దు.. తిరిగి మాతృ సంస్థకు మహమ్మద్ షఫియుల్లా సాక్షి, హైదరాబాద్: ఉమ్రా యాత్రలో మృతి చెందిన వారిపై అవమానకర వ్యాఖ్యలు చేసిన మహమ్మద్ షఫియుల్లాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఏకంగా డిప్యుటేషన్ రద్దు చేస్తూ సొంత శాఖకు వెనక్కి పంపించింది. ఉమ్రా యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి అంత్యక్రియలు మక్కాలో ఇస్లాం సంప్రదాయం ప్రకారం నిర్వహించేందుకు ఒక్కో బాధిత కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున బంధువులను అక్కడకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే బాధిత కుటుంబాలు మంగళవారం హైదరాబాద్ హజ్ హౌస్‌కు రాగా, వారితో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్, హజ్ కమిటీ ఇన్చార్జ్ ఈఓ మహమ్మద్ షఫియుల్లా మృతులను అవమానించే విధంగా వాఖ్యలు చేశారు. ‘బస్సు ప్రమాదంలో మొత్తం కాలిపోయారు... అక్కడకు వెళ్లి కాలిపోయిన ముద్దలు చూసి ఏం చేస్తారు’అంటూ నోరుపారేసుకున్నారు. దీంతో బాధిత కుటుంబాల సభ్యులు ఆయన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రమాదంలో మీ కుటుంబ సభ్యులుంటే ఇలాగే వ్యాఖ్యలు చేస్తారా? వారి అంత్యక్రియలకు హాజరుకారా? అంటూ విరుచుకుపడ్డారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావారణం నెలకొంది. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, సత్వరమే సర్కార్ చర్యలకు ఉప్రకమించింది. ఆయన్ను ఉర్దూ అకాడమీ డైరెక్టర్, హజ్ కమిటీ ఇన్చార్జ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవుల నుంచి తప్పించి డిప్యుటేషన్ రద్దు చేస్తూ మాతృ సంస్థ టీజీ జెన్కోకు పంపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ (మైనారిటీ) కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వక్ఫ్ సర్వే కమిషనర్ అసదుల్లాకు బాధ్యతలు అప్పగించారు. -
సౌదీలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు
న్యూఢిల్లీ: బంగారం ధరలు ఆకాశానికి చేరుతున్న తరుణంలో దుబాయ్‌కు జాక్ పాట్ తగిలింది. సౌదీ అరేబియా పశ్చిమ భాగంలోని మదీనాలో భారీ ఎత్తున బంగారం, రాగి ధాతువు నిక్షేపాలను గుర్తించినట్టు సౌదీ ఆరేబియా ప్రకటించింది. సౌదీ జియోలాజికల్ సర్వే మదీనా ప్రాంతంలోని అబా అల్-రాహా సరిహద్దుల్లో బంగారు ఖనిజాన్ని కనుగొన్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించింది. మదీనాలోని వాడి అల్-ఫరా ప్రాంతంలోని అల్-మాదిక్ ప్రాంతంలోని నాలుగు ప్రదేశాలలో రాగి ఖనిజాన్ని కనుగొన్నట్లు వారు తెలిపారు. కొత్త మైనింగ్ ప్రాంతాల వల్ల సుమారు 533 మిలియన్ల డాలర్ల పెట్టుబడిని ఆకర్షించవచ్చు అని, దాదాపు 4 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. కాగా సౌదీ అరేబియాలో దాదాపు 5,300 మినరల్ లొకేషన్లు ఉన్నాయని సౌదీ జియాలజిస్ట్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ ప్రొఫెసర్ అబ్దుల్ అజీజ్ బిన్ లాబోన్ గత జనవరిలో తెలిపారు, వీటిలో విభిన్నమైన మెటల్ ,నాన్-మెటల్ శిలలు, నిర్మాణ వస్తువులు, అలంకరణ శిలలు , రత్నాలు ఉన్నాయన్నారు.తాజా ఆవిష్కరణలతో, ప్రపంచ దేశాలనుంచి ఆశాజనకమైన పెట్టుబడి అవకాశాలు రానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.. కాగా సౌదీ అరేబియాలో భూగర్భ బంగారం నిల్వలు 323.7 టన్నులుగా అంచనా. వార్షిక రాగి, జింక్ ఫాస్ఫేట్ల ఉత్పత్తి 68,000 టన్నులు, 24.6 మిలియన్ టన్నులుగా ఉంటుంది అక్కడి ప్రభుత్వ అంచనా. -
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం; 35 మంది మృతి
దుబాయ్ : సౌదీ అరేబియాలోని మదీనాలో బుధవారం అర్ధరాత్రి రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 35 మంది విదేశీయులు మృతి చెందినట్లు సౌదీ అరేబియా వార్తాసంస్థ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. 40 మంది యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు మదీనా ఫ్రావిన్స్‌లోని అల్ అఖర్ సెంటర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న భారీ ప్రొక్లెయినర్‌ను ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున బస్సులో మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్న ప్రయాణికల బయటికి వచ్చేందుకు కిటికీ అద్దాలు పగలగొట్టినట్లు స్థానికలు తెలిపారు. అప్పటికే బస్సు మొత్తం మంటలు వ్యాపించడంతో 35 మంది విదేశీయులు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని అల్- హమ్నా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరిగిన బస్సులో ఏషియన్, అరబిక్కు చెందిన పౌరులు ఉన్నట్లు తెలిసింది. కాగా గతంలోనూ అల్ అఖర్ ఫ్రావిన్స్ దగ్గర పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2018 ఏప్రిల్‌లో మక్కాను సందర్శించుకోవడానికి బస్సులో 20 మంది యాత్రికుల బృందం బయలుదేరింది. సరిగ్గా మదీనాలోని అల్ అఖర్ ఫ్రావిన్స్ వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్‌ను గుద్దడంతో నలుగురు బ్రిటీష్ పౌరులు మరణించగా, 12 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ముస్లింలకు పవిత్ర స్థలంగా పేరొందిన మక్కాకు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంవడం బాధాకరమని పేర్కొన్నారు. -
సోమాలియాలో ఉగ్రదాడి
మొగదిషు: దక్షిణ సోమాలియాలోని సరిహద్దు పట్టణం కిస్మాయోలో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది చనిపోగా 56 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మెదినా హోటల్లోకి సైనిక దుస్తులు ధరించిన కొందరు ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ ప్రవేశించారు. అదే సమయంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనంపై మరో ఉగ్రవాది ప్రవేశించి తనను తాను పేల్చేసుకున్నాడు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులతో తలపడ్డాయి. ఇరువర్గాల మధ్య కాల్పులు 12 గంటలపాటు కొనసాగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు సహా కెన్యా, టాంజానియా, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలకు చెందిన పౌరులు కలిపి మొత్తం 26 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులు కూడా గాయపడ్డారన్నారు. పేలుడు ధాటికి హోటల్ భవనం ధ్వంసమయ్యింది. ఈ దుశ్చర్యకు తామే కారణమని అల్ షబాబ్ ప్రకటించుకుంది. సోమాలియా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అల్‌ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ అల్ షబాబ్ దశాబ్ద కాలంగా విధ్వంసక చర్యలకు పాల్పడుతోంది. -
మదీనాకు పయనం...
• ప్రవక్త జీవితం ముహమ్మద్ ప్రవక్తను వెతుక్కుంటూ వెంబడించిన శతృవులు సరిగ్గా గుహ దగ్గరికొచ్చి ఆగిపొయ్యారు. అక్కడినుండి ఎటువెళ్ళిందీ వారికి అంతుచిక్కలేదు. గుహలో దూరారేమో చూడండి అన్నాడో వ్యక్తి వెనుక నుండి అరుస్తూ.. కాని గుహ ముఖద్వారానికి ఓ పెద్ద సాలెగూడు అల్లుకొని ఉంది. అక్కడే రెండుపక్షులు గూళ్ళు కట్టుకొని, గుడ్లుపెట్టి పొదుగుతున్నాయి. అంతేకాదు దారికి అడ్డంగా ఓ పెద్దవృక్షం కూడా ఉంది. సంవత్సరాల తరబడి నర మానవుడెవరూ ఇటు తొంగి చూసిన ఆనవాళ్ళు కూడా లేని ఈ గుహలో మానవ జాడ ఉంటుందని అనుకోవడం పిచ్చితనంకాక మరేమీకాదు. అనుకొని ఉసూరుమంటూ తిరుగుముఖం పట్టారు ఖురైషీ దుండగులు. ఈ విధంగా ముహమ్మద్ ప్రవక్త, హ.అబూబకర్ లు మూడురోజుల వరకు సౌర్ గుహలో నే తలదాచుకున్నారు. ఈ మూడురోజుల పాటూ హ.అబూబకర్ తనయుడు హ. అబ్దుల్లాహ్, కూతురు హ. అస్మా తండ్రికి, ప్రవక్తవారికి అన్నపానీయాలు సమకూర్చేవారు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారంకాదు. పులులతో చెలగాటం. ఏదోపని మీద ఎటో వెళుతున్నట్లు బయలు దేరి గుహకు దారితీసేవారు. వీరి సేవకుడు ఆమిర్ అడుగుజాడలు కనిపించకుండా మేకలు తోలుకొనివెనకాలే బయలు దేరేవాడు. వీరు అందించిన సమాచారం ఆధారంగా ప్రవక్తమహనీయులు, అబూబకర్ లు మదీనా బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. అస్మా, అబ్దుల్లాలు చివరిరోజు అన్నపానీయాలతో పాటు, రెండుమేలుజాతి ఒంటెల్ని, ఇబ్నెఅర్ఖత్ అనే ఓ ముస్లిమేతరవ్యక్తిని తీసుకొని వచ్చారు. ఇతనుఅబూబకర్కు చాలా నమ్మకస్తుడు. జనసంచారం లేని నిర్జనమార్గాలగుండా మదీనా తీసుకువెళ్ళడానికి అతనికి కొంతపైకం ఇచ్చిమార్గదర్శిగా నియమించుకున్నారు. హ.అబూబకర్ గారి కూతురు అస్మా ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు సిధ్ధంచేశారు. చివర్లో నీళ్ళతిత్తి కట్టడానికి సమయానికక్కడ ఏమీ లేకపోవడంతో కంగారు పడ్డారు. కాని వెంటనే మెరుపులాంటి ఆలోచన తట్టగానే క్షణంకూడా ఆలస్యం చెయ్యకుండా తన నడుముకు కట్టుకున్న ఓణీని రెండుముక్కలుగా చింపి మంచినీళ్ళతిత్తి కట్టేశారు. అలాంటి సమయంలో ఆమె సమయస్ఫూర్తికి అచ్చెరువొందిన ప్రవక్తమహనీయులు మందహాసం చేస్తూ, ‘జాతున్నితాఖైన్’ అని సంబోధించారు. అప్పటి నుండి ఆమె ’జాతున్నితాఖైన్ ’ (రెండు ఓణీల మహిళ) గా ప్రసిధ్ధిగాంచారు. ఇబ్నెఅర్ఖత్ మార్గదర్శకత్వంలో ప్రవక్తమహనీయులు, హ.అబూబక్ర్ , ఆయన సేవకుడు ఆమిర్‌లు మదీనాకు పయనమయ్యారు. ప్రవక్తకోసం వెతికి వెతికి వేసారిన Ôè త్రువులు ఇక తమవల్లకాదని, ముహమ్మద్ పట్టిచ్చినవారికి వందఒంటెలు బహుమతిని ప్రకటించారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతాది వచ్చేవారం) -
జీపును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ఇద్దరి మృతి
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామం వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని మేఘనా ట్రావెల్స్ బస్సు ఢీకొంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న విశాఖకు చెందిన ఘట్టపు మురళీకృష్ణ (32), షేక్ మదీనా (52) తీవ్ర గాయాలతో మృతి చెందారు. యాసీన్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం కామినేని ఆస్పత్రికి తరలించారు. -
ప్రపంచ ప్రసిద్ధమైనవి...
ముస్లింల ప్రార్థనా స్థలాలుగా పేరుపొందినవి మస్జిద్లు. మనదేశంలోనే కాదు ప్రపంచమంతటా అత్యుద్భుతమైన, ఆకర్షణీయమైన మస్జిద్లు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రపంచప్రఖ్యాతి పొందిన కొన్ని మస్జిద్లు... అల్-హరామ్: మక్కా, సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతి పెద్ద మస్జిద్‌లలో మక్కా ముందు వరస లో ఉంది. ఈ మస్జిద్ బయట నిర్మాణం అత్యద్భుతం అనిపిస్తే, లోపల గోడల దర్శనం అదృష్టంగా భావిస్తారు ముస్లిమ్‌లు. ఇస్లామ్ మత పద్ధతులకు అనుగుణంగా నిర్మించిన ఈ కట్టడం ఏడాది పొడవునా ఉండే అందం రమదాన్ నెలలో రెట్టింపు అవుతుంది. అల్-నబావీ: మదీనా, సౌదీ అరేబియా ఇస్లామ్‌లోని రెండవ అతిపవిత్రమైన నగరం మదీనా. మహమ్మద్ సమాధి గల నగరంగానూ మదీనా వెలుగొందుతోంది. ఈ నగరంలోనే మక్కా తర్వాత ప్రపంచంలో అతి పెద్ద మస్జిద్ అల్-నబావీ రెండవస్థానాన్ని ఆక్రమించింది. 12వ శతాబ్ధంలో నిర్మించిన ఈ కట్టడం సౌదీ అరేబియాకు పశ్చిమాన ఉంది. ఈ మస్జిద్ మూల నిర్మాణ నమూనానే ప్రపంచంలోని మస్జిద్‌లలో ఉపయోగించారు. ఖర్జూరపు చెట్ల కాండాలను, మట్టిని ఉపయోగించి ఈ మస్జిద్ గోడలు నిర్మించారని చెబుతారు. అల్ అక్సా: జెరూసలెం ఇస్లామ్‌ల మూడవ అతిపెద్ద పవిత్ర క్షేత్రంగా జెరూసలెంలోని అల్ అక్సా మస్జిద్ పేరు పొందింది. ఇస్త్రా, మేరాజ్ కోసం మహమ్మద్ ప్రవక్త బయల్దేరింది ఈ మస్జిద్ నుంచేనని ముస్లిమ్‌ల విశ్వాసం. నిజానికి ఇది కొన్ని మస్జిద్ల సమూహం. మక్కానగరంలోని కాబా గృహం ఖిబ్లాగా ప్రకటించబడటానికి ముందు ఈ మస్జిద్ ఎ అక్సా మొదటి ఖిబ్లాగా వ్యవహరింపబడేది. ఫైజల్ మస్జిద్: పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లో ఉన్న ఫైజల్ మస్జిద్ దక్షిణ ఆసియాలోనే అతి పెద్దది. 1993కు ముందు ప్రపంచంలోని అతిపెద్ద మస్జిద్‌లలో నాలుగవ స్థానంలో ఉంది. 1990కి ముందు మక్కాలోని అల్-హరామ్, మదీనాలోని అల్-నబావి మస్జిద్ల తర్వాత ఫైజల్ మస్జిద్ అతి పెద్ద మస్జిద్‌లలో స్థానం ఉంది. జహీర్ మస్జిద్: మలేషియా మలేషియాలోని కెడా రాష్ట్రంలో సుల్తాన్ దాజుద్దిన్ ముకర్రమ్ షా కుమారుడు టున్కూ మహమ్మద్ 1912లో ఈ మస్జిద్ను నిర్మించాడు. ఇది మలేషియాలోనే అతి ప్రాచీనమైన కట్టడం. ఐదు అతి పెద్ద బురుజులు, ఐదు మినార్లతో ఈ మస్జిద్ విలసిల్లుతోంది. బైతుల్ ముకర్రమ్ మస్జిద్: బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ జాతీయ మస్జిద్‌గా పేరున్న బైతుల్ ముకర్రమ్ ఢాకా రాజధానిలో ఉంది. 1960లో ఈ మస్జిద్ నిర్మాణం పూర్తయ్యింది. 30 వేల మంది ఒకేసారి నమాజు చేసుకునే సామర్థ్యం గల ఈ మస్జిద్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన మస్జిద్‌లలో పేరెన్నికగన్నది.


